కార్తీకం..ధరలు ప్రియం
డోన్‌టౌన్: కార్తీక మాసం.. భక్తులు దీక్షలు స్వీకరించే కాలం. ఈ నెలలో వ్రతాలు, పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. వనభోజనాల సందడీ కనిపిస్తుంది. ఆదివారం వచ్చిందంటే తోటలు, పార్కులు జనంతో కిటకిటలాడుతాయి. వనభోజనాల్లో అందరూ శాఖాహారమే భుజిస్తారు.
దీంతో కూరగాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ కాలంలో 60 శాతానికి పైగా ధరలు పెంచేసి వీటిని విక్రయిస్తున్నారు. గత అక్టోబరు నెలలో కిలో 10రూపాయలకే లభించే వంకాయలు ప్రస్తుతం రూ. 40 పలుకుతున్నాయి. బీరకాయలు రూ.12 నుంచి రూ.40, క్యారెట్ రూ.20నుంచి రూ. 50లకు పెరిగాయి.
పూలకు భలే డిమాండ్..
కార్తీక పూజలతోపాటు అయ్యప్ప భక్తులు చేసే పడి పూజలకు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో బంతి, చామంతి రకాలే కాకుండా అన్నిరకాల పూలకూ డిమాండ్ రావడంతో వ్యాపారులు అమాంతం వాటి ధరలు పెంచేశారు. చామంతులు కిలో ధర రూ. 90, బంతి కిలో ధర రూ. 80 వరకూ పలుకుతున్నాయి.
కొండెక్కిన ‘కొబ్బరి’
సహజంగానే కార్తీక మాసంలో కొబ్బరికాయలకు ధర పెరుగుతుంది. ఈ మాసంలో కొబ్బరి వినియోగం ఎక్కువకావడంతో కిరాణందుకాణాలలోనూ, రిటైల్ మార్కెట్లల్లోనూ వినియోగదారుని అవసరాన్ని బట్టి ధర పెంచేస్తుంటారు. గతంలో రూ. 8 ఉండే టెంకాయ.. 16 రూపాయలకు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజను 40 రూపాయల ధర పలుకుతున్నాయి.
వెలగని ‘కర్పూరం’
ప్రస్తుతం మార్కెట్లో పూజా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భక్తులు విధిగా వినియోగించే అగరరబత్తీలు, కర్పూరం, కుంకుమ, పసుపు వంటి వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు రేట్లు పెంచారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి ధరలు రెట్టింపయ్యాయని దీంతో కర్పూరాన్ని వెలిగించలేక పోతున్నామని భక్తులు పేర్కొంటున్నారు.