ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)
ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది.
పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు.
మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు.
ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు.
విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు.
ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.
– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,
దోర్నాలపల్లి, దోమ మండలం,
వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు.
ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు.
మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు.
పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment