Sakshi Special Story On World Cotton Day In Telugu, Interesting Unknown Facts - Sakshi
Sakshi News home page

World Cotton Day Special Story: బ్రౌన్‌ కాటన్‌ సాగు.. పర్యావరణానికి ఎంతో మేలు

Published Thu, Oct 6 2022 12:12 PM | Last Updated on Thu, Oct 6 2022 1:37 PM

World cotton day sakshi special story in telugu - Sakshi

కృత్రిమ రంగులద్దే అవసరం లేనందున బ్రౌన్‌ కాటన్‌ సాగుతో పర్యావరణానికి మేలు. జన్యుమార్పిడి చేయని బ్రౌన్‌ కాటన్‌ సూటి  వంగడాలకు సిఐసిఆర్‌ రూపకల్పన. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడినిచ్చే బ్రౌన్‌ కాటన్‌ వంగడాలు  3 రకాల్లో రెండు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి సేంద్రియ, ప్రకృతి సేద్యానికి.. తిరిగి విత్తుకోవడానికి కూడా అనువైనవి అక్టోబర్‌ 7న ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక కథనం 

పత్తి అంటే ఎవరికైనా చప్పున గుర్తొచ్చేది తెల్ల బంగారమే. వేరే రంగులో ఉండే దూది కనిపిస్తే దానికి కృత్రిమంగా రంగులద్ది ఉంటారనే భావిస్తాం. అయితే, గోధుమ రంగు దూదిని పండించే పత్తి రకాలు సహజసిద్ధంగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీటినే నాచురల్లీ కలర్డ్‌ కాటన్‌ రకాలు అని, బ్రౌన్‌ కాటన్‌ రకాలు అని పిలుస్తుంటారు.

సహజసిద్ధమైన బ్రౌన్‌ కాటన అటవీ రకాలను అభివృద్ధి పరచి మహారాష్ట్ర నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం (ఐసిఏఆర్‌– సిఐసిఆర్‌) శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే 3 సరికొత్త బ్రౌన్‌ కాటన్‌ సూటి వంగడాలను అభివృద్ధి చేశారు. వైదేహి–1, సిఎన్‌హెచ్‌ 17395 అనే రకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు మహారాష్ట్ర తదితర సెంట్రల్‌ జోన్‌  రాష్ట్రాలకు ఉపయోగపడే మరో రకాన్ని కూడా అధికారికంగా విడుదల చేశారు.

జన్యుమార్పిడి చేయకుండా రూపొందించిన నాన్‌బీటీ రకాలు ఈ బ్రౌన్‌ పత్తి సూటి రకాలు. ఇతర పత్తితో కలిసిపోకుండా దూరం పాటిస్తూ సాగు చేసుకుంటే.. ఈ పత్తి నుంచి వేరు చేసిన గింజలనే తదుపరి పంటకు విత్తనాలుగా వాడుకోవచ్చు. విత్తనాన్ని ప్రతి ఏటా కొనాల్సిన అవసరం ఉండదు.   ప్రధాన శాస్త్రవేత్త డా. వినితా గొట్మరె తదితర శాస్త్రవేత్తలు 15 ఏళ్ల పాటు కొనసాగించిన పరిశోధనల ఫలితంగా రూపుదాల్చిన ఈ వంగడాలు చీడపీడలకు తట్టుకొని రైతులకు మంచి దిగుబడులనివ్వగలవని సిఐసిఆర్‌ సంచాలకులు డాక్టర్‌ వై.జి. ప్రసాద్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 

బ్రౌన్‌ కాటన్‌తో ప్రయోజనాలేమిటి?
బ్రౌన్‌ కాటన్‌ రకాలు అనేక చీడ పీడలను తట్టుకొని వర్షాధారంగా కూడా మంచి దిగుబడులను ఇవ్వగలవు. కాబట్టి ఈ రకం పత్తి సాగు వల్ల ప్రకృతి వనరులపై, పర్యావరణంపై దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా చైతన్యవంతులైన వినియోగదారులు ఆర్గానిక్‌ కాటన్‌ మాదిరే బ్రౌన్‌ కాటన్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. 

తెల్ల దూదితో రంగు వస్త్రాలను ఉత్పత్తి చేసే క్రమంలో జౌళి పరిశ్రమదారులు కృత్రిమ రసాయన రంగులద్దుతూ ఉంటారు. వాషింగ్, బ్లీచింగ్, డైయింగ్‌ ప్రక్రియల కారణంగా భారీగా మురుగు నీరు విడుదలవుతుంది. చాలా సందర్భాల్లో పూర్తిగా శుద్ధి చేయకుండానే విడుదల చేసే ఈ కలుషిత జలాల వల్ల పర్యావరణంతో పాటు భూమిని, నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా మనుషులతోపాటు పశువులకు, జలచరాలకు తీరని హాని జరుగుతోంది.

పర్యవసానంగా ఆ పరిసర ప్రాంత ప్రజలు కేన్సర్, చర్మవ్యాధులు, పనిసంబంధమైన ఆస్మా లేదా అలర్జీలు, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగులద్దే ప్రక్రియలో రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి సహజసిద్ధమైన గోధుమ రంగు పత్తి ఉత్పత్తి ఉపకరిస్తుంది. గతంలో అందుబాటులో ఉన్న దేశవాళీ బ్రౌన్‌ కాటన్‌ రకాల్లో దూది పటుత్వ లోపం తదితర సమస్యలను అధిగమించే విధంగా ఈ వంగడాలను సిఐసిఆర్‌ అభివృద్ధి పరచటం విశేషం.

సిఐసిఆర్‌–హెచ్‌ కాటన్‌ 58 
సిఐసిఆర్‌–హెచ్‌ కాటన్‌ 58 (సిఎన్‌హెచ్‌ 17395) రకం బ్రౌన్‌ కాటన్‌ వంగడం ఈ ఏడాదే విడుదలైంది. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు అనువైనది. ఈ రకం కూడా హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినివ్వగలదు. పింజ పొడవు 23.7 ఎం.ఎం. ఉంటుంది. బ్యాక్టీరియా తెగులుతోపాటు ఆల్టెర్నేరియా ఆకు మచ్చ, గ్రే మిల్‌డ్యూ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది.

సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లను మోస్తరుగా తట్టుకుంటుంది. మొలక శాతం బాగుంటుంది. చీడపీడలను దీటుగా తట్టుకునే ఈ సూటి రకం బ్రౌన్‌ కాటన్‌ సాగు దక్షిణాది రైతులకు మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతుందని సిఐసిఆర్‌ ఆశిస్తోంది.  

వైదేహి–1 రకం
సిఐసిఆర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్రౌన్‌ కాటన్‌ రకాల వరుసలో వైదేహి–1 మొదటిది. దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్యస్థాయి లో సాగుకు అనువైనది. ప్రభుత్వ ఆమోదంతో గత ఏడాది నోటిఫై అయ్యింది. ముదురు గోధుమ రంగు దూదిని అందిస్తుంది. 3 అటవీ రకాల్లోని సుగుణాలతో రూపొందిన అమెరికన్‌ కాటన్‌ (గాస్పిం హిర్సుటం) సూటి రకం వంగడం ఇది. బెట్టను తట్టుకునే లక్షణం ఉండటం వల్ల ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే వర్షాధారంగా హెక్టారుకు 14–15 క్వింటాళ్ల వరకు, నీటిపారుదలతో 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుందని సిఐసిఆర్‌ చెబుతోంది. 


వైదేహి–1 రకం ముదురు గోదుమ రంగు దూది పింజ పొడవు 22.5 ఎం.ఎం. ఉంటుంది. పటుత్వం 3.95. సూర్యరశ్మి బాగా సోకే విధంగా మొక్క నిర్మాణం ఉంటుంది. కాబట్టి, కాయతొలిచే పురుగు ను తట్టుకుంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక వంటి రసంపీల్చే పురుగులను తట్టుకుంటుంది. అటవీ రకాల మాదిరిగా బాక్టీరియా తెగులుతో పాటు అల్టర్నేరియా ఆకుమచ్చ, గ్రే మిల్‌డ్యూ, సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగులు వంటి శిలీంద్రపు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది.

విత్తన మొలక శాతం బాగుంటుంది. స్పిన్నింగ్‌కు అనువైన రకం. అధిక దిగుబడినిచ్చే ఈ ముదురు గోధుమ రంగు పత్తి రకం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని డా. ప్రసాద్‌ తెలిపారు. సాధారణంగా బీటీ పత్తిరకాల పింజ  28–31 ఎం.ఎం. మధ్యలో ఉంటుంది. ఈ రెండు మధ్యస్థ పింజ రకాలు. పింజ పొడవు 22.8–23.7 ఎం.ఎం. ఉంటుంది.

అయినా, వీటి జిన్నింగ్‌కు సమస్యలు ఉండవని డా. ప్రసాద్‌ తెలిపారు. సహజమైన రంగు పత్తి కావటం వల్ల ఒనగూడే పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో బ్రౌన్‌ కాటన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు బ్రౌన్‌ కాటన్‌ ఒప్పంద సాగుకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో సిఐసిఆర్‌ నాన్‌బీటీ రకాలు రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిద్దాం. 

ఇతర పత్తి రకాలతో ఈ విలక్షణ వంగడాలు కలుషితం కాకుండా రైతులు జాగ్రత్తపడాలి. పత్తి కోసం సాగు చేసినా, విత్తనం కోసం సాగు చేసినా ఇతర రకాల పత్తి పొలాల నుంచి 50 మీటర్ల దూరం పాటించటం తప్పనిసరి. కంచె పంటగా జొన్న/ సజ్జ/ మొక్కజొన్నను పొలం చుట్టూ 4 సాళ్లు వేసుకోవటం ద్వారా తెల్ల బీటీ పత్తితో బ్రౌన్‌ కాటన్‌ కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

బ్రౌన్‌ కాటన్‌ నాన్‌–బీటీ రకాలు సేంద్రియ సేద్యానికి అనువైనవి
గోధుమ రంగు పత్తి(బ్రౌన్‌ కాటన్‌)ని ఉత్పత్తి చేసే నాన్‌బీటీ (జన్యుమార్పిడి చేసినవి కాదు) సూటి వంగడాలను 15 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించాం. సాధారణ పద్ధతితో పాటు సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువైన సూటి రకాలు ఇవి. పత్తి నుంచి విత్తనాలు తీసి తిరిగి మళ్లీ విత్తుకోవచ్చు. అయితే, ఇతర తెల్ల రకం పత్తి పొలాలకు కనీసం 50 మీటర్ల దూరంలో బ్రౌన్‌ కాటన్‌ రకాలను సాగు చెయ్యాల్సి ఉంటుంది. రైతులు ఈ జాగ్రత్త పాటించాలి. 

ఈ రకం పత్తి కాయలు పగిలిన మొదట్లో కాయ లోపలి దూది తెల్లగానే ఉంటుంది. అయితే, ఎండ తగిలిన తర్వాత దూది క్రమంగా గోధుమ లేదా ముదురు గోధుమ రంగులోకి మారుతుందని రైతులు గమనించాలి. 60/75“30 సెం.మీ. దూరంలో (అంటే.. సాళ్ల మధ్య 2/రెండున్నర అడుగుల దూరం, మొక్కల మధ్య అడుగు దూరంలో) విత్తుకోవచ్చు. ఎకరానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం అవసరమవుతుంది. బ్రౌన్‌ కాటన్‌ నాన్‌బీటీ రకాల విత్తనాల కోసం రైతులు ఈ క్రింది ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదింవచచ్చు. 
– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాటన్‌ రీసెర్చ్, 
నాగపూర్‌–440010, మహారాష్ట్ర. CICRNAGAPUR@gmail.com

చదవండి: పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement