గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం! | Pistol war on worms! | Sakshi
Sakshi News home page

గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!

Published Tue, Sep 25 2018 6:52 AM | Last Updated on Tue, Sep 25 2018 7:28 AM

Pistol war on worms! - Sakshi

ముష్టి ద్రావణాన్ని తయారుచేస్తున్న విజయ కుమార్, రైతులు

పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్‌. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది.

పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్‌ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు.

ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్‌ మాటల్లో తెలుసుకుందాం..  పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి.


ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్‌ నుంచి సెప్టెంబర్, అక్టోబర్‌ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్‌ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి.
వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి.
జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి.
నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్‌ సంచిలో వేసి దంచాలి.
సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్‌లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి.
ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి.
 
పత్తి చేలలో పిచికారీ విధానం

పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత  నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది.

మొక్కజొన్నకు నాలుగైదు సార్లు..
మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు.

వరిలోనూ..
వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది.
తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్‌ చెబుతున్నారు.

మత్తు వచ్చి.. విరేచనాలై..
ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్‌ వివరించారు.

పూత దశలో పవర్‌ స్ప్రేయర్లు వాడొద్దు
ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్‌(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్‌ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు.
– మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్‌), వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement