Corn farmers
-
మక్కలేస్తే మునుగుడే!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అవసరానికి మించి భారీగా మొక్కజొన్న నిల్వలు ఉన్నాయని... యాసంగిలో మక్కలు సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరించారు. మక్కల సాగు, నిల్వలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా యని, రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు సీఎం కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. మక్కలకు కనీస మద్దతు ధరను ఆశించే పరిస్థితి లేనేలేదని, మద్దతు ధర రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. ధర ఎంత తక్కువ వచ్చినా ఫర్వాలేదనుకునే రైతులు మాత్రమే మొక్కజొన్న సాగుకు సిద్ధపడాలన్నారు. యాసంగిలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో మక్కల సాగును నిపుణులు, అధికారులు తీవ్రంగా వ్యతి రేకించారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని ఈ సమావేశంలో నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ము కోవచ్చు, కొనుక్కోవచ్చు అనే విధానంతో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని, దీనికి తోడుగా విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను పెద్ద ఎత్తున తగ్గించిం దని... ఇవి పేద రైతు పాలిట శాపంగా పరిణమిం చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం తగ్గింపు... అంతర్జాతీయ విపణిలో అవసరాలకుపోను.. 28 కోట్ల మెట్రిక్ టన్నుల మక్కల నిల్వలున్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మక్కలు మాత్రమే సాలీనా అవసరం కాగా, 3 కోట్ల 53 లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని నిపుణులు, అధికారులు సీఎంకు తెలియజేశారు. అంటే 1 కోటీ 11 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయని, వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న పంటల నుంచి దాదాపు 4 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయని తెలియజేశారు. దీంతో ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా మక్కల స్టాకు ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి నిర్ణయించడం పరిస్థితులను మరింత దిగజార్చిందని స్పష్టం చేశారు. మక్కల మీద విధించే 50 శాతం దిగుమతి సుంకాన్ని 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాల నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందన్నారు. తద్వారా దేశంలోని, రాష్ట్రంలోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కవ ధరకే కోళ్ల దాణా.. తెలంగాణలో ఉన్న మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలనే ఉద్దేశంతో కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయ శాఖ చర్చలు జరిపిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎంకు వివరించారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణలో పండిన మొక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖామంత్రి గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!
పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది. పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు. ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్ మాటల్లో తెలుసుకుందాం.. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి. వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి. జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్ సంచిలో వేసి దంచాలి. సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి. ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి. పత్తి చేలలో పిచికారీ విధానం పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. మొక్కజొన్నకు నాలుగైదు సార్లు.. మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు. వరిలోనూ.. వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది. తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. మత్తు వచ్చి.. విరేచనాలై.. ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్ వివరించారు. పూత దశలో పవర్ స్ప్రేయర్లు వాడొద్దు ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్), వైఎస్సార్ జిల్లా -
మార్కెట్లో మక్క రైతుల ఆందోళన
రూ.400ల వరకు తగ్గించిన వ్యాపారులు ఏ పద్ధతిన నిర్ణయించారని ప్రశ్నించిన రైతులు కనపడకుండాపోయిన ఉద్యోగులు పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతో కొనసాగిన క్రయవిక్రయాలు వరంగల్ సిటీ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మక్క రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాళ్‌కు రూ.1800కు పైచిలుకు పలికిన ధర, ఒక్కసారిగా రూ.1455–1060కు పడిపోవడంతో మక్క రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. రైతులు పెద్ద ఎత్తున యార్డు వద్దకు చేరుకోని ఏ పద్ధతిన ధరను నిర్ణయించారని, ఎందుకు ధర తగ్గించారో తెలుపాలని అడుగుతుండగానే యార్డు ఇంచార్జితో సహా ఉద్యోగులంతా ఉడాయించారు. సమాధానం చెప్పడానికి ఉద్యోగులు, వ్యాపారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రైతులకు మరింతగా కోపం వచ్చి.. ఓ దశలో గన్ని బ్యాగులను తగులబెట్టే ప్రయత్నం చేశారు. మార్కెట్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐలు భీంశర్మ, బాలాజీవరప్రసాద్లు యార్డుకు చేరుకుని, గొడవలు కాకుండా నియంత్రించారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు ధర తగ్గించారో చెప్పాలని, కనీసం రూ.1500తోనైనా కొనుగోలు చేస్తే తాము ఊరుకుంటామని సీఐ భీంశర్మతో వాదించారు. దీనికి సీఐ సమ్మతించి యార్డు ఇంచార్జీ, ఉద్యోగులను పిలిపించి అడ్తి, వ్యాపారులతో మాట్లాడాలని సూచించారు. అందుకు వ్యాపారులు ససేమిరా అన్నారు. వ్యాపారులతో మాట్లాడి ఒప్పించడానికి అటు కార్యదర్శి, మార్కెట్ చైర్మన్ ఎవరూ ప్రయత్నించ లేదు. చివరకు పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతోనే కొనుగోళ్లు నడిచాయి. యార్డు ఇన్చార్జి అత్యుత్సాహంతోనే గొడవ కాగా మక్క రైతుల ఆందోళనకు ప్రధాన కారుకుడు యార్డు ఇంచార్జీనే అని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర నిర్ణయం కాకముందే మైక్‌లో రూ.1555 పెట్టే ధరను రూ.100తగ్గించి 1455కే అనౌన్స్ చేశాడని, దీంతో వ్యాపారులు అనౌ¯Œ్స అయ్యాక ఎట్టి పరిస్థితిలో ధర పెంచేది లేదని, ఒక వేళ పెంచితే ఇక ప్రతి రోజు అలానే ఉంటుందని ఖారాకండిగా తెలిపారు. అసలు ధరకు రూ.100 ఎందుకు తగ్గిం చావని యార్డు ఇంచార్జీని అడిగితే బిత్తర చూపులు తప్పా సమాధానం లేదు. యార్డు ఇంచార్జీ గత రెండు సంవత్సరాలుగా ఒకరిద్దరు అడ్తి దారులను గుప్పెట్లో పెట్టుకోని ఇలానే చేస్తున్నాడని ఉద్యోగులు వాపోయారు. అతడిని మార్చాలని పలవురు ఉద్యోగులు బాహాటంగానే అంటున్నారు. మార్కెట్‌కు రాని చైర్మన్.. నూతనంగా నియమితులైన మార్కెట్ చైర్మ¯ŒS ధర్మరాజు మార్కెట్‌కు రాలేదు. మార్కెట్‌కు బయలుదేరే సమయంలో గొడవ విషయం తెలుసుకుని ఆగిపోయారని పలువురు మాట్లాడు కోవడం కనిపించింది. ఇక మార్కెట్‌కు సుమారు 30వేల బస్తాల మక్కలు అమ్మకానికి వస్తే.. ఉదయం మెసేజ్‌లో 18,471 బస్తాలు వచ్చినట్లు ధర రూ.1445–1060 పలికినట్లు పంపించారు. తీరా మార్కెట్ అధికారికంగా ప్రకటించే ధరల్లో 19వేల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు ధర రూ.1445–1375 పలికినట్లు ధరల పట్టికను పంపించారు. ఈ లెక్కన ఎన్ని క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయో, ఏధర పలికిందో, ఓపె¯ŒS టెండరా...నామ్ విధానమా అనేది మార్కెట్ ఉద్యోగులకే తెలియని పరిస్థితి. మార్కెట్లో అంతా మోసమే మార్కెట్లో మొత్తం ఎటు చూసినా మోసంతో కూడిన వ్యాపారమే. హమాలీ కూలీల నుంచి అడ్తి, వ్యాపారుల వరకు చివరకు ఉద్యోగులతో సహా రైతుల నుంచి ఎంత మేరకు దండుకోవాలనే ఆలోచనే తప్పా మరోటి లేదు. తిరిగి మక్కలను ఇంటికి తీసుకుపోలేక తప్పని సరి పరిస్థితిలో అమ్మకుంటున్నాం. ఏమైనా మాట్లాడితే ఎవరినైనా అడుగుదామంటే పోలీసులు తీసుకుపోతున్నారు. – బానోతు మోతీలాల్, మక్క రైతు -
అన్నదాతంటే అలుసా..!
- నిలిచిన మొక్కజొన్న కొనుగోళ్లు - ఆగ్రహించిన రైతులు జాతీయరహదారి దిగ్భంధం అలంపూర్ / కల్వకుర్తి రూరల్ : జిల్లాలో మొక్కజొన్న రైతుల పరి స్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పంట కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధర లభించక, గన్నీ బ్యాగ్‌లు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాదాపు పది రోజులుగా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా మార్కెఫెడ్ అధికారులు పట్టిం చుకోకపోడవంతో ఆగ్రహించిన రైతు లు సోమవారం అలంపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై, కల్వకుర్తి వద్ద శ్రీశైలం రహదారిపై ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో కలుగోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెఫెడ్ మొ క్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. అరుు తే డిమాండ్‌కు తగినట్లుగా గన్నీ బ్యాగ్ లు సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు పది రోజులుగా ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్రం నిర్వాహకులు సైతం గన్నీ బ్యాగ్‌లు సరఫరా చేయాలని కోరినా స్పందించకపోవడంతో సోమవారం కొనుగోళ్లను నిలిపివేశారు. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు పంటను అమ్ముకున్నా మార్కెట్లోనే పడిగాపులు కాయూల్సి వస్తోంది. దీం తో ఆగ్రహించిన అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల కు చెందిన రైతులు జాతీయరహదారిని దిగ్భంధించారు. అరగంటపాటు రోడ్డు పై బైఠాయించి, మార్కెఫెడ్ డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చే యాలని, గన్నీ బ్యాగ్‌లు సరఫరా చే యూలని, కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. అరుుతే ఆందోళన చేస్తున్న రైతు ల వద్దకు అధికారులెవరూ రాకపోవడం గమనార్హం. దీంతో జాతీయరహదారిపై వాహనాలు బారులు తీరాయి. ప్రయాణీకులు, వాహనదారులు వేడుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది: ఆచారి బంగారు తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. కల్వకుర్తి మార్కెట్ యూర్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్వకుర్తి, మిడ్జిల్ మండలాలకు చెందిన రైతులు దాదాపు 10 గంటల పాటు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన కొనుగోలు చేయకుండా తిరస్కరించడం దారుణమన్నారు. పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై మొక్కజొన్నలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో స్థానిక సీఐ వెంకట్, ఎస్సై మగ్దూంఅలీ అక్కడికి చేరుకొని మార్కెఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా, మార్కెట్‌కు వచ్చిన మొక్కజొన్న ను పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ధర్నా విరమించారు. -
మక్కల కొనుగోలులో మస్తు దోపిడీ
ఖమ్మం వ్యవసాయం: మొక్కజొన్న రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు రూ.1310 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించడంలో అధికారులు విఫలంకావడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారు. సరుకులో తేమ ఎక్కువగా ఉందనే నెపంతో కొనుగోలుకు సరేమిరా అంటున్నారు. గత్యంతరం లేక రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉండి మొక్కజొన్న గింజలను ఆరబెడుతున్నారు. ఇంత చేసినా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దిగుబడి అంతంతమాత్రమే... ఖరీఫ్ సీజన్లో కొత్తగూడెం, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, చింతకాని, మధిర, బోనకల్, వైరా, ముదిగొండ, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో దాదాపు 45వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి రూ.15 నుంచి రూ.20వేలు పెట్టుబడి పెట్టి పంట పండించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాలేదు. వర్షాలు అనుకూలిస్తే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది కేవలం 5 నుంచి 10 క్వింటాల దిగుబడి మించలేదు. రైతులకు అందని మద్దతు ధర ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలు క్వింటాలుకు రూ.1,310 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. నాణ్యత ప్రమాణాలను కూడా నిర్ణయించింది. వ్యర్థ పదార్థాలు 1.0 శాతం, ఇతర తిండిగింజలు 2.0 శాతం, దెబ్బతిన్న గింజలు 1.5 శాతం, కొద్దిగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలు 4.5 శాతం, పరిపక్వం చెందని, నాసిరకం గింజలు 3.0 శాతం, పుచ్చిపోయిన గింజలు 1.0 శాతం, తేమ 14 శాతం ఉన్న మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టింది. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పంటలో నాణ్యత ఉండటం అసాధ్యంగా మారింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వ్యాపారులు రైతులకు ఇవ్వడం లేదు. వ్యవసాయ మార్కెట్ లు, ప్రైవేట్‌గా, గ్రామాల్లో మొక్కజొన్నలను క్వింటాలకు రూ.850 నుంచి రూ.వెయ్యి వర కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా రూ.460 మేరకు తక్కువగా కొనుగోలు చేసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ‘దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగిన’ చందంగా మార్క్‌ఫెడ్ వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలుకొనుగోలు చేయాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ శాఖ పెడచెవినే పెట్టింది. దాదాపు 40 రోజులుగా మొక్కజొన్నల కొనుగోళ్లు జరుగుతున్నా మార్కెఫెడ్ వాటి కొనుగోళ్లకు ముందుకురాలేదు. క్వింటాలుకు రూ.400 నుంచి 500 వరకు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. గత రెండు, మూడు రోజుల్లో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇల్లెందులో ఏర్పాటు చేసిన కేంద్రంలో హమాలీల మధ్య తలెత్తిన వివాదంతో కొనుగోళ్లు జరగటం లేదు. బయ్యారం, గుండాల తదితర మండలాల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మిన తరువాత మార్కెఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు అంతగా జరగటం లేదు. ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ 1,600 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందని ఆ శాఖ జిల్లా మేనేజరే చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు దాదాపు 70 నుంచి 80వేల క్వింటాల వరకు కొనుగోలు చేశారని ఒక అంచనా. ఒక్క ఖమ్మం మార్కెట్లోనే దాదాపు 35వేల క్వింటాలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మార్కెట్లో క్వింటాలుకు రూ.850 నుంచి రూ.1,070 వరకు మాత్రమే ధర పెట్టారు. ధరల దోపిడీని అరికట్టని యంత్రాంగం మొక్కజొన్నలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా వ్యాపారులు క్వింటాలుకు రూ.450 మేరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించలేకపోయినా కనీస గిట్టుబాటు ధర అందించే విధంగా కూడా చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందని సాకుతో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మా శ్రమను దోచుకుంటున్నారు: చలమల కోటయ్య, ఈర్లపూడి ఎంతో కష్టపడి పండించిన పంటను దళారులు దోచుకుంటున్నారు. ఎకరంన్నరలో మొక్కజొన్న సాగుచేస్తే 10 క్వింటాల దిగుబడి వచ్చింది. కనీసం ఖర్చుల మేరకు కూడా రాలేదు. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుందనే ఆశతో వస్తే ఇక్కడ కూడా దోపిడీ చేశారు. క్వింటాలు రూ.950కి కొనుగోలు చేశారు. -
నెలలు గడుస్తున్నా.. చెక్కులివ్వరా?
గజ్వేల్, న్యూస్‌లైన్: మక్కల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా.. చెక్కుల పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో కోపోద్రిక్తులైన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా గురువారం స్థానిక మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి సుమారు ఆరు గంటలకుపైగా లావాదేవీలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇక్కడికి చేరుకోగా రైతులు వాగ్వాదానికి దిగారు. అయిదు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన సద్దుమణిగింది. గజ్వేల్‌లోని ఐకేపీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వ్యవహారంలో కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ కేంద్రం నిర్వాహకులు వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో కొనుగోళ్లలో జాప్యం జరిగిందని గుర్తించిన జిల్లా అధికారులు కేంద్ర నిర్వాహకురాలు, ఐకేపీ ఏపీఎంను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. అక్టోబర్ నెలలో ప్రారంభించిన ఈ కేంద్రంలో జనవరి 15 వరకు మొత్తం 34వేల క్వింటాళ్ల వరకు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఇందులో 19,500 క్వింటాళ్ల స్టాకును తరలించారు. మిగిలిన 14వేల పైచిలుకు క్వింటాళ్ల స్టాకు ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో పడి వున్నది. స్టాకు తరలింపునకు నోచుకోకపోవడంవల్ల మొత్తం రూ.3.5కోట్ల వరకు జరగాల్సిన చెల్లింపుల్లో ఇప్పటివరకు కోటిన్నర మాత్రమే చెక్కులను అందించగలిగారు. సుమారు రూ.2కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడి నుంచి నిల్వలను మార్క్‌ఫెడ్ అధ్వర్యంలోని గోదాముల్లోకి తరలిస్తేనే రైతులకు చెల్లింపులు జరుగుతాయి. కానీ వ్యవహారంలో నెలతరబడి జాప్యం నెలకొన్నది. జిల్లాలోని మిగతా ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నా.. గజ్వేల్‌లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. మరో పక్క గడువు ముగిసిందనే కారణంతో కేంద్రంలో కొనుగోళ్లును నిలిపివేయడంతో వేలాది క్వింటాళ్ల మక్కలు కొనుగోళ్లకు నోచుకోకుండా పడివున్నాయి. ఈ సమస్యలపై విసిగిపోయిన రైతులు ఈనెల 3న యార్డు గేటుకు తాళమేసి ధర్నా నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో తిరిగి గురువారం ఉదయం యార్డు గేటుకు తాళం వేశారు. పైగా గేటు ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక హుటాహటినా ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, డీఎంకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సాయంత్రం 3గంటలవరకు ఆందోళన కొనసాగడంతో యార్డులో ఆరు గంటలకుపైగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సైతం ఇక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో సమస్యను మార్క్‌ఫెడ్ డీఎం, ఆర్డీఓలు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ సూచన మేరకు నిల్వలు లిఫ్ట్ చేసి పెండింగ్‌లో ఉన్న చెక్కులను అయిదు రోజుల్లో ఇప్పించడంతోపాటు యార్డులో కొనుగోలు చేయకుండా మిగిలిపోయిన మక్కలను ప్రభుత్వ కేంద్రాల గడువు ముగిసినందు వల్ల ప్రైవేట్ వ్యాపారులతో కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. -
మొలకెత్తిన నిర్లక్ష్యం!
యాచారం, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించినా సక్రమంగా రైతులకు బిల్లులు ఇవ్వరు. పోనీ కొనుగోలు చేసిన మక్కలనైనా తరలిస్తారంటే.. అదీ లేదు. మొత్తంగా కొనుగోళ్ల వ్యవహారాన్ని అధికారులు గాలికొదిలినట్టు కన్పిస్తోంది. యాచారం మండలంలో మహిళా సమాఖ్య, ఐకేపీ సంయుక్తంగా చింతపట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి మండలంలోని రైతులే కాకుం డా మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాల నుంచి 200మంది రైతులకుపైగా సోమవారం వరకు 8,111 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయాలు జరిపారు. విక్రయాలు జరిపిన రైతులకు క్వింటాల్‌కు రూ.1,310 చొప్పు న రూ.కోటి పది లక్షల వరకు డబ్బులు అందాల్సి ఉంటుంది. కానీ రైతులకు సగం బిల్లులు కూడా అందలేదు. కొనుగోలు కేంద్రంలో ప్రారంభంలో విక్రయాలు జరిపిన వారం రోజుల్లోనే రైతులకు బిల్లులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించినా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నిత్యం చెప్పులరిగేలా తిరగక తప్పడం లేదు. ఇదిలాఉంటే మక్కల బస్తాలు ఏ రక్షణ లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దే మూలుగుతున్నాయి. సుమారు 200 క్వింటాళ్ల మక్కల బస్తాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ మొలకలొస్తున్నాయి. కొనుగోళ్లు జరిగిన తర్వాత మక్కల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ ఉత్పత్తులు ఏ మాత్రం ఉపయోగానికి రాని దుస్థితి ఏర్పడింది. పంటలు వేసుకోవటానికి సిద్ధం వర్షాలు సంవృద్ధిగా కురిసి భూగర్భజలాలు పెరగడం వల్ల వరితోపాటు వివిధ రకాల పంటలు వేసుకోవటానికి రైతులు సిద్ధమవుతున్నారు. చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విక్రయాలు జరిపిన రైతుల్లో అత్యధికంగా వరి సాగు చేసేవారే ఉన్నారు. ఒక్కో రైతుకు రూ.వేలాది బిల్లులు అందాల్సి ఉంది. విక్రయించిన మొక్కజొన్న డబ్బులు సకాలంలో అందకపోవడం, నాటేసే సమయం దగ్గరపడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల చివరి వరకే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు ఈ నెల చివరి వరకే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక ఐకేపీ, సమాఖ్య సభ్యులకు ఆదేశాలందాయి. గత కొద్ది రోజుల కింద ఇబ్రహీంపట్నంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం బంద్ కావడంతో ఇబ్రహీంపట్నం పరిసరాల గ్రామాల నుంచి రైతులు చింతపట్లలోని కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నలు విక్రయాలకు తరలి స్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఐకేపీ, సమాఖ్య సిబ్బంది ఈనెల 20లోపు రైతులకు ఇచ్చిన బస్తాల వరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 20 తర్వాత వచ్చిన రైతులకు బస్తాలు ఇవ్వడం నిలిపేశారు. కొద్ది రోజులుగా చింతపట్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను అధికారులు సకాలంలో తరలించకపోవడం, భద్రపర్చుకునే స్థలం లేక గోదాం బయటనే నిల్వ ఉంచారు. చలి, కురిసే వర్షాలకు వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న మొలకెత్తడంతోపాటు, బూజు పట్టింది. కొనుగోలు చేసిన వెంటనే తరలిస్తామని అధికారులు హామీలు ఇవ్వడమే కానీ ఆచరణలో శ్రద్ధ పెట్టడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెల కింద విక్రయించా... చింతపట్ల కొనుగోలు కేంద్రం లో 38 క్వింటాళ్ల మొక్కజొన్నలు నెల కింద విక్రయించా. విక్రయించిన మొక్కజొన్నకు రూ.49వేలకు పైగా నేటికీ బిల్లులు అందలేదు. చెప్పులరిగేలా తిరగగా సోమవారం చెక్ ఇచ్చారు. అది కూడా 27న తేదీ వేసి ఇచ్చారు. సాగు పనులు దగ్గరపడుతుంటే భయం నెలకొంది. - ముత్యాల సాయిరెడ్డి, నానక్‌నగర్ కొనుగోలు కేంద్రాని కొనసాగించాలి చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరో పక్షం రోజలకు పైగా నిర్వహించాలి. నేటికీ రైతులు పలు గ్రామాల నుంచి వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలు తీసుకోస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. లేదంటే రైతులు నష్టపోతారు. - లిక్కి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ, చింతపట్ల ప్రోత్సాహం లేదు కొనుగోలు కేంద్రం నిర్వాహణ సక్రమంగా చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నుంచి ప్రోత్సాహం లేదు. వెనువెంటనే మొక్కజొన్నలు తరలించకపోవడం వల్ల వందలాది క్వింటాళ్ల నిల్వలు అలానే ఉంటున్నాయి. నేటికీ రైతులకు రూ.లక్షలాది బిల్లులు ఇవ్వాలి. రైతులు నిత్యం తిరుగుతున్నారు. - స్రవంతి, ఎస్ఆర్పీ మార్కెటింగ్ ఐకేపీ -
పంటలపై వరుణ ప్రతాపం, చలిగాలులకు నలుగురు మృతి
సాక్షి, మచిలీపట్నం : వర్ష బీభత్సానికి జిల్లాలో చేలు చెరువులయ్యాయి. కళ్లముందే మునిగిపోతున్న పంటచేలను చూసి రైతు గుండె చెరువైంది. జిల్లాలో లక్షా 12 వేల ఎకరాల్లో పంట నీటమునగగా, దిక్కుతోచని స్థితిలో అన్నదాత అల్లాడుతున్నాడు. మరోపక్క అనేక గ్రామాలు వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చలిగాలుల ధాటికి జిల్లాలో నలుగురు మృతిచెందారు. నందిగామ మండలం రాఘవాపురంలో కోట రామయ్య దెబ్బతిన్న పత్తిచేను వద్ద విస్తుపోయి చూస్తున్నాడు.. కంకిపాడు మండలం చలివేంద్రపురంలో కొల్లి సుబ్బారెడ్డి నీటమునిగిన వరిచేనును కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు.. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో చుక్కా యాకోబు వర్షానికి తడిసి మొలకలు వచ్చిన మొక్కజొన్నను చూసి బిక్కుబిక్కుమంటున్నాడు.. అవనిగడ్డ మండలం దక్షిణతిరువోలు లంకలో బచ్చు రాజేశ్వరరావు నీటిపాలైన బీర, బెండ పంటలను చూపి బెంగపెట్టుకున్నాడు.. కొల్లేరు తీరంలోని భుజబలపట్నంలో సయ్యపురాజు గుర్రాజు తన చేపల చెరువులను చూసి గుబులు పెట్టుకున్నాడు.. కలిదిండి, కైకలూరు మండలాల్లో రొయ్యల చెరువుల గట్లు తెగి రైతులు హడావుడిగా పట్టుబడులు చేస్తున్నారు.. తీరానికి చేరువలో ఉన్న బందరు, కృత్తివెన్ను మండలాల్లో ముంపు తీవ్రత పెరుగుతుందని ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు.. ఇవి జిల్లాలో శుక్రవారం కనిపించిన హృదయాలను పిండేసే దృశ్యాలు. ఇవి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. జిల్లా అంతటా అన్ని పంటల రైతులు ముంపు ముప్పునుంచి గట్టెక్కే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నీట మునిగిన పంట చేను గట్టున ఉన్న ఏ రైతును కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. చెరువులను తలపిస్తున్న పొలాలు... జిల్లాలో ఏ చేలను చూసిన నీళ్లతో నిండి చెరువులను తలపిస్తున్నాయి. కాయకష్టం నీటిపాలు కావడంతో కర్షకుడి కళ్లలో కన్నీళ్లే ఉబికివస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో దాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరుణుడి ప్రతాపానికి జిల్లాలోని చేలు చెరువులయ్యాయి. వాటిని చూసి రైతుల గుండెలు కన్నీటి కాల్వలుగా మారుతున్నాయి. జిల్లాలో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అధికారిక లెక్కల ప్రకారం 1,12,808 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ నష్టం రెట్టింపు ఉంటుందని రైతుల చెబుతున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా దానిలో 48,872 ఎకరాల పంట నీటిముంపునకు గురైంది. అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, నాగాయలంక, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి, గుడ్లవల్లేరు, నందివాడ, పమిడిముక్కల, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, నందిగామ తదితర మండలాల్లో వరిచేలు నీటిపాలు కావడంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ... జిల్లాలో 1.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దానిలో 52,330 ఎకరాల్లో పంట వర్షాలకు దెబ్బతింది. జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, మైలవరం తదితర ప్రాంతాల్లో తీతకు వచ్చిన పత్తిచేను తడిచిపోవడంతో రంగుమారిపోయింది. చాలాచోట్ల విచ్చుకునే దశలో ఉన్న, తీతకు వచ్చిన పత్తి వర్షాలు, గాలులకు నేలరాలిపోయి నీటిపాలైంది. దీంతో ఎకరాకు పదివేల రూపాయల వరకు నష్టం వస్తుందని పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మచిలీపట్నం, నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల్లో 2,500 ఎకరాల్లో వేరుశనగ, జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి. పెనుగంచిప్రోలు, కంచికచర్ల ప్రాంతాల్లో 1,358 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. జిల్లాలో దాదాపు 22,500 ఎకరాల్లో సాగు జరుగుతున్న పసుపు చేలలో తోట్లవల్లూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, పామర్రు, ఉయ్యూరు, చల్లపల్లి ప్రాంతాల్లోని 1,305 ఎకరాల్లో పసుపు చేలు నీటి ముంపునకు గురయ్యాయి. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లోని 2,245 ఎకరాల్లో మిరప చేలు, 493 ఎకరాల్లోని అరటి పంట దెబ్బతింది. తోట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు ప్రాంతాల్లోని 273 ఎకరాల్లోని తమలపాకు తోటలు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు తదితర ప్రాంతాల్లోని 3,232 ఎకరాల్లోని కూరగాయల తోటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లోని బీర, బెండ తోటల్లోకి నీరు చేరడంతో నాలుగు రోజులుగా నీటిలో నానిపోయి కాయలు కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు. తెగిన రొయ్యల చెరువుల గట్లు... జిల్లాలో ఆక్వారంగం ఆక్సిజన్ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. 73 వేల ఎకరాల్లో చేపల, 35 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. కొల్లేరు, కలిదిండి, కృత్తివెన్ను, బందరు ప్రాంతాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య, చేపల చెరువుల్లో డీవోబీ సమస్యలు తలెత్తాయి. కైకలూరు, కలిదిండి మండలాల్లో రొయ్యల చెరువుల గట్లు తెగి రైతులు నష్టపోయారు. జలదిగ్బంధంలో గ్రామాలు... మచిలీపట్నం : అల్పపీడన ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. శుక్రవారం కుండపోతగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల తాకిడికి జిల్లాలోని పది మండలాలపై ప్రభావం చూపగా 80 గ్రామాల చుట్టూ నీరు చేరింది. మూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మచిలీపట్నం, గుడివాడ పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ప్రజలు అవస్థల పాలయ్యారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో రెండు లక్షల మంది జనాభాపై ప్రభావం పడింది. కలిదిండి మండలంలో అత్యధికంగా 18.4, తిరువూరులో అత్యల్పంగా 0.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 40 గృహాలు దెబ్బతినగా వాటిలో 16 పాక్షికంగా దెబ్బతినానయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు. 484.11 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, దీంతో రూ.125 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 100 రోడ్లు 750 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక తయారుచేశారు. 49 పశువులు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. చలిగాలులకు నలుగురు మృతి కూచిపూడి/పెడన రూరల్/పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల ప్రభావంతో వీచిన చలిగాలులకు జిల్లాలో నలుగురు మృతిచెందారు. మొవ్వ మండలం కాజలో పేకేటి వీరరాఘవరెడ్డి, మొవ్వ ఎస్టీ కాలనీలో కే వెంకటేశ్వర్లు గురువారం రాత్రి చనిపోయారు. పెడన తోటమూల ప్రాంతంలోని మొగ్గయ్య కాలనీలో చేనేత వృత్తి చేసుకునే గుత్తి కాంతమ్మ (68) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. పామర్రు మండలం పెదమద్దాలి అంబేద్కర్ కాలనీలో పోలవరపు వరలక్ష్మి (65) గురువారం రాత్రి చలిగాలులకు కన్నుమూసింది. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కోతలపై మండిపడ్డారు. మార్కెట్ ఎదుట రహదారిపై రాస్తారోకోకుదిగి వాహనాలను స్తంభింపజేశారు. చివరకు అధికారులు దిగివచ్చి రైతులకు న్యాయం చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో మంగళవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాకలతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి 3,300 క్వింటాళ్ల మొక్కజొన్నలు అమ్మకానికి వచ్చాయి. మొక్కజొన్నలో 14 శాతానికి బదులుగా 16 శాతం తేమ ఉందని 9 ట్రాక్టర్ల మొక్కజొన్నను వాపస్ పంపారు. 9 వేలం ప్రాంతాల్లో మొక్కజొన్నలను విక్రయానికి సిద్ధం చేయగా ట్రేడర్లు సరిగా ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకు 7 ప్రాంతాల్లో మాత్రమే పంటను వేలం ద్వారా విక్రయించారు. కాగా ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్న మద్దతు ధర రూ.1310 ప్రకటించగా తేమ తదితర కారణాలు చూపి రూ.1,210కే కొనుగోలు చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ ఎదురుగా ఉన్న కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. కరీంనగర్, సిద్దిపేట వైపు వెళ్లే అన్నిరకాల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ‘సీఎం డౌన్ డౌన్, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి, కలెక్టర్ ఇక్కడకు రావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ సిద్దిపేట తహశీల్దార్ యాదగిరిని సంఘటనా స్థలికి పంపారు. రైతులు, ట్రేడర్లు, మార్కెట్ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. చివరికి రూ.1,210కి ఖరీదు చేసిన మొక్కజొన్నలకు అదనంగా మరో రూ.80 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అదే విధంగా ఖరీదు చేయని మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయడానికి ట్రేడర్స్ అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు.