సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కోతలపై మండిపడ్డారు. మార్కెట్ ఎదుట రహదారిపై రాస్తారోకోకుదిగి వాహనాలను స్తంభింపజేశారు. చివరకు అధికారులు దిగివచ్చి రైతులకు న్యాయం చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాకలతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి 3,300 క్వింటాళ్ల మొక్కజొన్నలు అమ్మకానికి వచ్చాయి.
మొక్కజొన్నలో 14 శాతానికి బదులుగా 16 శాతం తేమ ఉందని 9 ట్రాక్టర్ల మొక్కజొన్నను వాపస్ పంపారు. 9 వేలం ప్రాంతాల్లో మొక్కజొన్నలను విక్రయానికి సిద్ధం చేయగా ట్రేడర్లు సరిగా ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకు 7 ప్రాంతాల్లో మాత్రమే పంటను వేలం ద్వారా విక్రయించారు. కాగా ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్న మద్దతు ధర రూ.1310 ప్రకటించగా తేమ తదితర కారణాలు చూపి రూ.1,210కే కొనుగోలు చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ ఎదురుగా ఉన్న కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.
కరీంనగర్, సిద్దిపేట వైపు వెళ్లే అన్నిరకాల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ‘సీఎం డౌన్ డౌన్, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి, కలెక్టర్ ఇక్కడకు రావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ సిద్దిపేట తహశీల్దార్ యాదగిరిని సంఘటనా స్థలికి పంపారు. రైతులు, ట్రేడర్లు, మార్కెట్ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. చివరికి రూ.1,210కి ఖరీదు చేసిన మొక్కజొన్నలకు అదనంగా మరో రూ.80 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అదే విధంగా ఖరీదు చేయని మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయడానికి ట్రేడర్స్ అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు.
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
Published Wed, Oct 2 2013 6:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement