నిజామాబాద్ జిల్లాలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన సబ్సిడీ ట్రాక్టర్లు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఏడాది సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్లు మంజూరు చేసే అధికారమున్న జిల్లాస్థాయి అధికారుల కమిటీని తప్పించి, పూర్తి అధికారాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవలే అన్ని జిల్లాల వ్యవసాయశాఖాధికారులకు అందాయి. ఇప్పటికే ఈ సబ్సిడీ ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకే దక్కుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆధునిక యంత్ర పరికరాలతో పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర లక్ష్మి) పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే.
జిల్లా అధికారుల కమిటీ ప్రమేయం లేదు
ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సబ్సిడీ ట్రాక్టర్లు పొందాలనుకున్న రైతులు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి.. డివిజన్ స్థాయిలోని ఏడీఏ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ద్వారా జిల్లా స్థాయి అధికారుల కమిటీ వాటిని పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తుంది. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీకి డీఏఓ కన్వీనర్‌గా, ఆగ్రోస్ ఆర్‌ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, లీడ్ బ్యాంక్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఈ జిల్లా స్థాయి అధికారుల కమిటీతో ప్రమేయం ఉండదు.
దరఖాస్తులు నేరుగా కలెక్టర్ ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపాల్సి ఉంటుంది. ఇన్‌చార్జి మంత్రి ఆమోద ముద్ర వేస్తేనే ట్రాక్టర్ మంజూరు అవుతుంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పథకం పూర్తిగా విమర్శల పాలైంది. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ట్రాక్టర్లు పంచుకుంటున్నారు. వీటి మంజూరులో పెద్ద ఎత్తున ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌పై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు దండుకున్నారనేది బహిరంగ రహస్యం. సగం ధరకే (గరిష్టంగారూ.3.5 లక్షల వరకు సబ్సిడీ) ట్రాక్టర్ వస్తుండటంతో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నాయకులు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై ట్రాక్టర్ల మంజూరు అధికారాలు ఏకంగా మంత్రికి కట్టబెట్టడంతో ట్రాక్టర్లు పొందాలంటే ఇన్‌చార్జి మంత్రులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టేట్ రిజర్వు కోటాపై వివాదాస్పదం
గతంలో సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో స్టేట్ రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ) పేరుతో జారీ అయిన మార్గదర్శకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయా జిల్లాలకు మంజూరైన ట్రాక్టర్లలో కొన్నింటిని ఫలానా లబ్ధిదారునికే ఇవ్వాలని ఏకంగా కమిషనరేట్ నుంచే సిఫార్సు లేఖలు అధికారికంగానే జిల్లా అధికారులకు అందడం పట్ల ఆ శాఖ వర్గాలు అప్పట్లో ముక్కున వేలేసుకున్నాయి. స్టేట్ రిజర్వు కోటా ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈసారి ట్రాక్టర్ల మంజూరు అధికారం ఏకంగా జిల్లా మంత్రులకు కట్టబెట్టడంతో ఎలాంటి ఆరోపణలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment