సబ్సిడీ ట్రాక్టర్లకు రాజకీయ చీడ!!
* 35 కోట్ల సబ్సిడీ కింద జిల్లాలకు 740 ట్రాక్టర్లే పంపిణీ
* 50% రాయితీ ఉండటంతో ఎగబడుతున్న రైతులు
* అధికార పార్టీ అండదండలున్న వారికే ఇస్తున్న వైనం
* తక్కువ యూనిట్ల కేటాయింపుతో తీవ్ర కొరత
రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాల సబ్సిడీకి రాజకీయ చీడ అంటుకుంది. అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే యంత్రాలను కట్టబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ భారీగా ఉండటంతో కొన్ని యంత్రాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వాటిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన సబ్సిడీపై ట్రాక్టర్ల సరఫరా గ్రామాల్లో సెగలు పుట్టిస్తోంది. వాటిని తక్కువ సంఖ్యలో కేటాయించడంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలకే వాటిని ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డిమాండ్ మేరకు ట్రాక్టర్లను మరిన్ని కేటాయించాల్సి ఉండగా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.
- సాక్షి, హైదరాబాద్
మండలానికి ఒకట్రెండే?
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాకు 2014-15 సంవత్సరానికి రూ. 200 కోట్లు కేటాయించింది. అందులో అనేకం భూమిని చదును చేయడం నుంచి కోతల వరకు పనికి వచ్చే యంత్రాలున్నాయి. వాటిని 30 శాతం నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. ఈసారి కొత్తగా ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై ఇవ్వడం ప్రారంభించారు. అందులో ప్రధానంగా వరికి భూమిని సిద్ధం చేయడం, కోతలకు ఉపయోగించడం కోసం 34 హెచ్‌పీ సామర్థ్యానికి మించి ఉన్న ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. ఆ ట్రాక్టర్ల వాస్తవ ధర రూ. 10 లక్షలు ఉండగా సబ్సిడీపై రైతులకు రూ. 5 లక్షలకే లభిస్తోంది.
ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ సబ్సిడీ ప్రకటించడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఉత్సుకత పెరిగడంతో వాటిని పొందేందుకు ఎగబడుతున్నారు. కానీ ట్రాక్టర్లను తక్కువ సంఖ్యలో జిల్లాలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ. 35 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇచ్చి 740 ట్రాక్టర్లనే జిల్లాలకు కేటాయించారు. కొన్ని చోట్లనైతే మండలానికి ఒకటి, మరికొన్ని చోట్ల మండలానికి రెండుకు మించి రైతులకు ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు రైతుల నుంచి మాత్రం వేలాది దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వంలోని అధికార పెద్దల సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలకే ఇచ్చేలా నాయకులు యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
సీఎం జిల్లాలోనూ అంతే...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సొంత జిల్లా మెదక్‌లో 46 మండలాలు ఉంటే అక్కడ కేవలం 58 ట్రాక్టర్లే కేటాయించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 64 మండలాలు ఉంటే... ఆ జిల్లాకు కేటాయించింది 76 ట్రాక్టర్లు మాత్రమే. అక్కడ ఒక మండలానికి ఒకటి చొప్పునే కేటాయించినట్లయింది. రంగారెడ్డి జిల్లాలో 37 మండలాలు ఉంటే... అక్కడ 18 ట్రాక్టర్లే కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో 57 మండలాలు ఉంటే... అక్కడ 110 ట్రాక్టర్లు కేటాయించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా నిజామాబాద్‌లో 36 మండలాలు ఉంటే... అక్కడ మాత్రం 130 ట్రాక్టర్లు కేటాయించారు. మండలానికి అత్యంత తక్కువ యూనిట్లు కేటాయించడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా రైతులకు ట్రాక్టర్లు చేరడంలేదు.
అధికారుల చేతివాటం
ట్రాక్టర్లకు డిమాండ్ పెరగడంతో అవి సాధారణ రైతులకు చేరడంలేదు. ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్ల కేటాయింపులు పెంచకుంటే అవి కొందరికే దక్కే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని కొందరు అధికారులు, కొన్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఒక ట్రాక్టర్‌కు రైతు సబ్సిడీపోను రూ. 5 లక్షలు చెల్లించాలి. మిగిలిన రూ. 5 లక్షలు ప్రభుత్వం కంపెనీకి చెల్లిస్తుంది. అయితే కొందరు అధికారులు కొన్నిచోట్ల రైతుల నుంచి అదనంగా మరో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు తీసుకొని ట్రాక్టర్లను కేటాయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల కేటాయింపు పెంచాలని... ఆ మేరకు వ్యవసాయ యంత్రాలకు కేటాయించిన నిధుల్లోంచి ట్రాక్టర్లకే అదనంగా కేటాయించేలా చూడాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.