Subsidy tractors
-
సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో రైతులకు కుచ్చుటోపీ
ద్వారకాతిరుమల: సబ్సిడీపై ట్రాక్టర్లు ఇప్పిస్తానని కొందరు రైతులను నమ్మించి, వారిపేరున ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను వేరే వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు నోటీసులు అందడంతో బాధిత రైతులు పోలీసుల్ని ఆశ్రయించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఎస్.ఐ. వెంకటసురేష్ రైతులను మోసగించిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు కేసు వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన ఈదల శ్రీధర్.. సొంత గ్రామంలోని రైతులతో పాటు మండలంలోని ఎం.నాగులపల్లి, దొరసానిపాడు, ద్వారకాతిరుమల, దేవినేనివారిగూడేనికి చెందిన 34 మంది రైతులను రూ.6 లక్షల ట్రాక్టర్‌ను సబ్సిడీపై రూ.4 లక్షలకు ఇప్పిస్తానని చెప్పాడు. అది నమ్మిన రైతులు గతేడాది శ్రీధర్ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టారు. తరువాత వారు రెండుమూడుసార్లు అడిగినా.. త్వరలో వస్తాయని చెప్పాడు. తరువాత ఏలూరులోని శ్రీ ప్రసన్నలక్ష్మీ మోటార్స్ స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ యజమాని నెక్కలపు మనోజ్‌కుమార్, షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దేవులపల్లి మోహన్‌కుమార్, హెచ్డీఎఫ్సీ ఫైనాన్స్ ఏజెంట్ సహాయంతో బాధిత రైతుల పేరున శ్రీధర్ 34 ట్రాక్టర్లకు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ చేయించాడు. డౌన్‌పేమెంట్ కట్టాడు. షోరూమ్ యజమాని సహాయంతో మోహన్‌కుమార్, శ్రీధర్ ట్రాక్టర్లను డెలివరీ తీసుకుని లబ్ధిదారులకు తెలియకుండానే చుట్టుపక్కల రైతులతో పాటు, తెలంగాణలోని పలువురికి విక్రయించారు. ఫైనాన్స్ తీరిపోయిందని, త్వరలో రికార్డులు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మబలికి ఒక్కో ట్రాక్టర్‌ను రూ.4 లక్షలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. వచ్చిన సొమ్ములో కొంతభాగాన్ని.. బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, కొన్ని వాయిదాలకు వారి ఖాతాల్లో సొమ్ము ఉండేలా జాగ్రత్తపడ్డాడు. 5 ట్రాక్టర్ల స్వాధీనం ఇటీవల రైతుల ఖాతాల్లో డబ్బు లేక వాయిదాలు వసూలుకాకపోవడంతో పోవడంతో ఫైనాన్స్ కంపెనీల వారు రైతులకు నోటీసులిచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసిన బాధిత రైతులు ఈ నెల 7న ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్.ఐ. వెంకటసురేష్.. ట్రాక్టర్లు తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్లాలని వాటిని కొనుగోలు చేసినవారికి చెప్పారు. దీంతో శ్రీధర్ వద్దకు చేరిన 5 ట్రాక్టర్లను ఎస్.ఐ. స్వాధీనం చేసుకుని.. శ్రీధర్, మనోజ్‌కుమార్, మోహన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. -
ఇన్చార్జి మంత్రుల చేతిలోనే ‘స్టీరింగ్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఏడాది సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్లు మంజూరు చేసే అధికారమున్న జిల్లాస్థాయి అధికారుల కమిటీని తప్పించి, పూర్తి అధికారాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవలే అన్ని జిల్లాల వ్యవసాయశాఖాధికారులకు అందాయి. ఇప్పటికే ఈ సబ్సిడీ ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకే దక్కుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆధునిక యంత్ర పరికరాలతో పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర లక్ష్మి) పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా అధికారుల కమిటీ ప్రమేయం లేదు ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సబ్సిడీ ట్రాక్టర్లు పొందాలనుకున్న రైతులు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి.. డివిజన్ స్థాయిలోని ఏడీఏ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ద్వారా జిల్లా స్థాయి అధికారుల కమిటీ వాటిని పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తుంది. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీకి డీఏఓ కన్వీనర్‌గా, ఆగ్రోస్ ఆర్ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, లీడ్ బ్యాంక్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఈ జిల్లా స్థాయి అధికారుల కమిటీతో ప్రమేయం ఉండదు. దరఖాస్తులు నేరుగా కలెక్టర్ ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాల్సి ఉంటుంది. ఇన్చార్జి మంత్రి ఆమోద ముద్ర వేస్తేనే ట్రాక్టర్ మంజూరు అవుతుంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పథకం పూర్తిగా విమర్శల పాలైంది. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ట్రాక్టర్లు పంచుకుంటున్నారు. వీటి మంజూరులో పెద్ద ఎత్తున ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌పై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు దండుకున్నారనేది బహిరంగ రహస్యం. సగం ధరకే (గరిష్టంగారూ.3.5 లక్షల వరకు సబ్సిడీ) ట్రాక్టర్ వస్తుండటంతో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నాయకులు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై ట్రాక్టర్ల మంజూరు అధికారాలు ఏకంగా మంత్రికి కట్టబెట్టడంతో ట్రాక్టర్లు పొందాలంటే ఇన్చార్జి మంత్రులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేట్ రిజర్వు కోటాపై వివాదాస్పదం గతంలో సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో స్టేట్ రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ) పేరుతో జారీ అయిన మార్గదర్శకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయా జిల్లాలకు మంజూరైన ట్రాక్టర్లలో కొన్నింటిని ఫలానా లబ్ధిదారునికే ఇవ్వాలని ఏకంగా కమిషనరేట్ నుంచే సిఫార్సు లేఖలు అధికారికంగానే జిల్లా అధికారులకు అందడం పట్ల ఆ శాఖ వర్గాలు అప్పట్లో ముక్కున వేలేసుకున్నాయి. స్టేట్ రిజర్వు కోటా ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈసారి ట్రాక్టర్ల మంజూరు అధికారం ఏకంగా జిల్లా మంత్రులకు కట్టబెట్టడంతో ఎలాంటి ఆరోపణలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాల్సి ఉంది. -
‘ కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం’
సాక్షి, పరకాల: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించి, రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కిసాన్ మేళా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై 50 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్ పరిపాలన రైతులకు స్వర్ణయుగమని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారని కొనియాడారు. రుణాల కోసం ఎదురుచూడకుండా ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందించడం చారిత్రకమైందని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బొల్లె భిక్షపతి, వరంగల్ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మారాజు, పరకాల, ఆత్మకూరు ఎంపీపీలు నేతాని సులోచన, మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, పరకాల ఏడీఏ విద్యాసాగర్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మండలంలోని వ్యవసాయా విస్తీర్ణ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాయితీ ట్రాక్టర్లొచ్చాయ్.. ‘వారికే’ ప్రాధాన్యం..
ఖమ్మంవ్యవసాయం/మధిర : రాయితీపై ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేళ్లుగా మూలనపడిన పథకాలకు మోక్షం లభించడంతో 2016–17, 2017–18 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1,500 మంది ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అధికార పార్టీ కార్యకర్తల పేర్లను జాబితాలో చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషీ వికాస యోజన పేరిట(ఆర్కేవీవై), జాతీయ ఆహార భద్రతా పథకం పేరిట, రాష్ట్ర ప్రభుత్వం నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్ఎస్పీ) పేరిట వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోంది. రెండున్నర ఎకరాల మాగాణి లేదా మెట్ట భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. యాంత్రీకరణ పరికరాలను 50 శాతం రాయితీపై అందించనుండగా.. షెడ్యూల్డ్ కులాల రైతులకు 16 శాతం, షెడ్యూల్డ్ తెగల వారికి 8 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వు చేశారు. గ్రూపుగా పథకాన్ని పొందే రైతులకు 95 శాతం రాయితీ ఇస్తున్నారు. రైతులు చేసుకున్న దరఖాస్తులను ఏఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ల బృందం పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉన్న వారిని అర్హులుగా గుర్తించి.. జాబితాను జిల్లా వ్యవసాయ శాఖకు పంపించారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాను పరిశీలించి.. తుది జాబితా రూపొందించాయి. దీనిని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని పంపించారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చని ఆ జాబితాల్లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో 580, భద్రాద్రి జిల్లాలో 170 ట్రాక్టర్ల జాబితాలను సిద్ధం చేసి.. పంపిణీ చేసేందుకు అధికార యంత్రాగం కసరత్తు చేస్తోంది. ట్రాక్టర్, రోటోవేటర్లను 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. వీటి విలువ సుమారు రూ.7లక్షల నుంచి 7.25లక్షల వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం రూ.3.50లక్షలు భరిస్తూ రైతులకు సబ్సిడీగా ఇస్తుంది. మిగిలింది రైతులే భరించాల్సి ఉంటుంది. బ్యాంక్ డీడీ లేదా బ్యాంక్ కాన్సెంట్‌ను అందించాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు 2016–17 సంవత్సరానికి 278 ట్రాక్టర్లు, 2017–18కి.. 302 ట్రాక్టర్లు, 2016–17, 2017–18 సంవత్సరాలకు మొత్తం 170 ట్రాక్టర్లను అందించనున్నారు. పది రోజుల్లో పంపిణీ లబ్ధిదారులకు పది రోజుల్లో ట్రాక్టర్లు పంపిణీ చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో జిల్లాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగానే రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేయనున్నారని సమాచారం. ‘వారికే’ ప్రాధాన్యం.. ట్రాక్టర్ల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన రైతులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సూచించిన రైతులకే ట్రాక్టర్లను కేటాయించినట్లు ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన్ని అర్హతలున్నా.. కొందరు రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యవసాయాధికారులు తీవ్ర వత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా.. వ్యవహారం వ్యవసాయ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. పలు ప్రాంతాల్లో కొందరు పైరవీకారులు ఎలాగైనా రాయితీ ట్రాక్టర్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతో వారు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే.. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి.. జాబితాలు రూపొందించాం. కలెక్టర్ పర్యవేక్షణలో జాబితాను తయారు చేశాం. జాబితాలను మండల, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తున్నాం. త్వరలోనే ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి -
మనోడే ఇచ్చేయ్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సబ్సిడీ ట్రాక్టర్ల దందా జోరుగా సాగుతోంది! లబ్ధిదారులకు దక్కాల్సిన ట్రాక్టర్లు పైరవీలతో పక్కదారి పడుతున్నాయి. దళారులు, కొందరు రాజకీయ నేతలు కమీషన్లు పుచ్చుకొని సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అమ్మేస్తున్నారు. కలెక్టర్ల నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నా.. అధికార పార్టీ నేతల హవానే నడుస్తోంది. అర్హులైనా కాకున్నా వారనుకున్న వారికే ట్రాక్టర్లు దక్కుతున్నాయి. ట్రాక్టర్లు దక్కించుకోవడం కోసం అనేకమంది దళారులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ సిఫార్సు లేఖ తీసుకొని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో అందజేసి ట్రాక్టర్లు ఎగరేసుకుపోతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు రాజేస్తోంది. అన్నీ వారికేనా..? ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రత్యేక కోటా కింద అధిక సంఖ్యలో ట్రాక్టర్లు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరికే ఎక్కువగా కేటాయిస్తున్నారంటూ ట్రాక్టర్లు దక్కని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. సిఫార్సు లేఖలపై ఓ ఎస్టీ ఎమ్మెల్సీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. తన కార్యకర్తల కోసం మంత్రిని ట్రాక్టర్లు కావాలని కోరితే.. ఆయన సంతకం చేసి పంపించినా ఇప్పటివరకు ఒక్కటీ మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సీనియర్ మంత్రి విన్నపం మేరకు.. ఆయన కార్యకర్తల కోసం ఏకంగా 200 పైగా ట్రాక్టర్లు ప్రత్యేకంగా కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికార పార్టీలో ట్రాక్టర్లు దక్కని ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.లక్ష కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో వీటిని సరఫరా చేస్తుంది. ఒకేసారి గ్రూపు లేదా వ్యక్తిగతంగా వీటిని ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. భారీ సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో వీటికి డిమాండ్ ఏర్పడింది. రైతులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్ బృందం పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. తర్వాత అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయశాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి అర్హులైనవారితో తుది జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితా ప్రకారం రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలి. కానీ ఈ తంతు కేవలం కాగితాలకే పరిమితమైంది. ట్రాక్టర్ ఇప్పించేందుకు కొందరు దళారులు, మరికొందరు ప్రజాప్రతినిధులు రైతుల నుంచి రూ.లక్ష వరకు ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబితాలో పేరు లేకున్నా.. ట్రాక్టర్ల పంపిణీలో గోల్‌మాల్‌కు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు సిరిసిల్ల మండలంలో మండల కమిటీ ద్వారా 25 మంది అర్హుల రైతుల జాబితా పంపగా అందులోంచి కేవలం ఐదుగురుని మాత్రమే ఎంపిక చేశారు. మరో నలుగురిని జాబితాలో పేరు లేకున్నా పైస్థాయి సిఫారసు లేఖల ద్వారా ఎంపిక చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో కూడా ఇలాగే ఉంది. చొప్పదండిలో 10 ట్రాక్టర్లు ఉన్న రైతులకే మళ్లీ ఇచ్చారని, ఏ ప్రాతిపదికన వారు అర్హులవుతారని ఏకంగా జెడ్పీ సమావేశంలోనే సభ్యులు ఆరోపించారు. ఇలా అనర్హులైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధి పైరవీ ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక కోటా కింద ట్రాక్టర్లు కేటాయిస్తున్నారు. ఇదేం పద్ధతి..? 2016–17 నుంచి ట్రాక్టర్ల కేటాయింపులో స్పెషల్ రిజర్వ్డ్ కోటా(ఎస్‌ఆర్‌క్యూ) పద్ధతిని ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి సిఫార్సు చేసిన రైతులకే ట్రాక్టర్లు మంజూరు చేయడం దీని ఉద్దేశం. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసులు చేసి తమకు అనుకూలమైన వారికి ట్రాక్టర్లు ఇప్పించుకుంటున్నారు. పూర్తిగా పైరవీలపై నడిచే ఈ పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలే ట్రాక్టర్లు పొందుతున్నారని ఓ ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడం గమనార్హం. 2016–17 నుంచి ఇప్పటివరకు మొత్తం 5 వేల ట్రాక్టర్ల వరకు ఇస్తే అందులో ఎస్‌ఆర్‌క్యూ కింద వ్యవసాయ మంత్రి కార్యాలయ విచక్షణతో ఏకంగా 700 వరకు ట్రాక్టర్లు ఇచ్చారు ‘‘ఎస్‌ఆర్‌క్యూ పద్ధతి ప్రవేశపెట్టాక వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం ప్రతిష్ట దిగజారుతోంది. మరోవైపు ఆయన పేషీ నుంచి వచ్చే సిఫార్సు లేఖలు మంత్రికి తెలుస్తున్నాయా? లేదా? అన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం మంత్రి ప్రతిష్టకు మచ్చగా ఉంది’’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సచివాలయం, వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయంలోనూ పైరవీకారులు పెద్దఎత్తున దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి రెండుచోట్లా ఒకరిద్దరు అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ వ్యవహారం కావడంతో ఈ దందాపై మాట్లాడేందుకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ముందుకు రావడం లేదు. ‘నో కామెంట్’అని, తమ వివరణ అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. -
సబ్సిడీ ట్రాక్టర్లు ఎవరి కోసం?
♦ వరిసాగులో దమ్ముకు పెద్ద ట్రాక్టర్లు ఉపయోగించ వద్దంటూ ప్రచారం ♦ కొనుగోలుకు మాత్రం రూ.రెండు లక్షల సబ్సిడీ ♦ జిల్లాకు 758 ట్రాక్టర్లు మంజూరు ♦ వరి రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ♦ చేపలు, రొయ్యల చెరువుల యజమానులకు ♦ అడ్డదారిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు భీమవరం: వ్యవసాయం దండగంటూ గతంలో బహిరంగంగానే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అదేబాటలో ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడని పెద్ద ట్రాక్టర్లకు సబ్సిడీ ఇస్తూ చిన్న సన్నకారు రైతులను విస్మరిస్తోంది. జిల్లాలో సుమారు 5.6 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులున్నారు. వరిసాగులో కూలీల ఖర్చు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో వరిసాగు చేయడమంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో వరిసాగులో ఖర్చు తగ్గించడానికి వ్యవసాయశాఖ రైతులను యాంత్రీకరణ వైపు దృష్టిసారించే విధంగా ప్రచారం చేసింది. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, వరినూర్పిడి యంత్రాలు, టార్పాలిన్స్ వంటి వాటిని సబ్సిడీపై ఇస్తోంది. పెద్ద ట్రాక్టర్లతో దుక్కి దున్నితే సుమారు అడుగున్నర లోతు దమ్ముచేయడం వల్ల భూమిలో వరి పైరుకు ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు నశించి పంటకు నష్టం ఏర్పడుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. వరి నాట్లుకు కేవలం ఆరు అంగుళాల లోతు దమ్ముచేస్తే సరిపోతుందని తెలియజేశారు. ఇందుకు పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు, రోటోవేటర్లు ఉపయోగించడం మేలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు పవర్ టిల్లర్లు, రోటోవేటర్లను ఉపయోగిస్తున్నారు. నూర్పిడికి ట్రాక్టర్లను కాకుండా నూర్పిడి యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్ద ట్రాక్టర్లకు రూ.2 లక్షలు సబ్సిడీ.. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు ఉపయోగించాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ట్రాక్టర్ల కొనుగోలుకు రూ. 2 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. రెండు ఎకరాలు సొంత భూమి కలిగిన రైతుకు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేస్తే వ్యవసాయశాఖ సబ్సిడీపై ట్రాక్టర్ మంజూరు చేయిస్తోంది. ఈ విధంగా టూవీలర్ ట్రాక్టర్‌కు రూ. 1.5 లక్షలు, ఫోర్ వీలర్ ట్రాక్టర్‌కు రూ. రెండు లక్షలు సబ్సిడీగా ఇస్తోంది. జిల్లా మొత్తం సుమారు 758 ట్రాక్టర్లు మంజూ రయ్యాయి. భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని భీమవరం మండలానికి 22 ట్రాక్టర్లు, వీరవాసరం మండలానికి 27, పాలకోడేరు మండలానికి 17 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే పాలకొల్లు 25, పోడూరు 18, ఆచంట 15, యలమంచిలి 15, నరసాపురం 17, మొగల్తూరు 8, ఉండి వ్యవసాయసబ్ డివిజన్లోని ఉండి, ఆకివీడు, కాళ్ల మండలాలకు 59 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద ట్రాక్టర్స్ అవసరాలు అంతగా లేకపోవడంతో రైతులు సబ్సిడీ ట్రాక్టర్స్ పట్ల మక్కువ చూపడం లేదు. జిల్లాలో ఎక్కువగా రొయ్యలు, చేపల చెరువుల సాగుకు, చెరువుల్లో పూడికతీతకు, గట్లు పటిష్టం చేయడానికి, దూరప్రాంతంలో ఉండే చెరువుల నుంచి చేపలు, రొయ్యలను ప్రధాన రహదారికి చేర్చడం, రియల్ఎస్టేట్ భూముల్లో మట్టి పూడిక వంటి అవసరాలకు పెద్ద ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నందున చేపల, రొయ్యల రైతులు సబ్సిడీ ట్రాక్టర్లను పొందేందుకు రాజకీయనాయకులతో పైరవీలు ప్రారంభించారు. -
ముడుపులిస్తేనే ట్రాక్టర్
సబ్సిడీ ట్రాక్టర్లకు పైరవీల జోరు బినామీ పేర్లతో దరఖాస్తులు అధికార పార్టీ నాయకులకే అందలం రఘునాథపల్లి: అన్నదాతల వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రాయితీగా ఇస్తున్న ట్రాక్టర్ల మంజూరు కోసం ప్రతిపాదనల దశలోనే పైరవీల జోరు కొనసాగుతోంది. రైతులకు సాగులో తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ట్రాక్టర్‌ను ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.50 వేలకే అందించనుంది. ఈ సారి ఎస్సీ ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ పెంచడంతో తీవ్ర పోటీ నెలకొంది. రఘునాథపల్లి మండలానికి ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు ఆరు ట్రాక్టర్లు కేటాయించగా వీటిని పొందేందుకు 36 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను ఎంపీపీ, ఏఓ, తహసీల్దార్, ఎంపీడీఓ సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ కాకముందే సబ్సిడీ ట్రాక్టర్లు పొందేందుకు బేరసారాలు సాగుతున్నాయి. అయితే గ్రూపులకు మొదటి ప్రాధాన్యం ఉండటంతో కొందరు బినామీ పేర్ల సబ్సిడీ ట్రాక్టర్లు పొందేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. మేకలగట్టు శివారు ఆంధ్రతండాకు చెందిన ఒకరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉన్న తన భార్య పేరుపై మరో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ గ్రూపుకు ఇచ్చే నజరాన విషయంలో తేడా రావడంతో సదరు గ్రూపు సభ్యులు ఆ దరఖాస్తును తొలగించాలని స్థానిక ఏఓకు ఫిర్యాదు చేసి దానిని తొలగించారు. ఇలా మరికొన్ని బినామీ దరఖాస్తులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులకే.. మండలానికి ఇప్పటికే రెండు విడతలలో ఆరు ట్రాక్టర్లు మంజూరు కాగా వాటిని అధికార పార్టీ నాయకులే దక్కించుకున్నారు. ఇప్పుడు మూడో విడతలోనూ అధికార పార్టీ నాయకులే దక్కించుకునేందుకు మంత్రాంగం నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ సారి సబ్సిడీ పెంచడంతో ట్రాక్టర్ల మంజూరికి ఓ అధికార పార్టీ నాయకుడు ముడుపుల స్వీకారానికి తెరలేపాడు. ముందే లక్షా 50 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. భూమిని నమ్ముకొని, సేద్యం చేస్తున్న రైతులను కాదని ముడుపులు ఇచ్చిన వారికే ట్రాక్టర్లు మంజూరు చేసేలా అధికార పార్టీ నాయకుడి వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు ట్రాక్టర్లు మంజూరి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని «రైతులు కోరుతున్నారు. కమిటీ ఆమోదంతోనే సబ్సిడీ ట్రాక్టర్లు ఏఓ హుమేరా నౌసిన్ సబ్సిడీ ట్రాక్లర్ల కోసం 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. తనతో పాటు ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్ సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. దరఖాస్తుల్లో అనర్హులు ఉంటే సమాచారం అందిస్తే వెంటనే తొలగిస్తాం. సబ్సిడీ ట్రాక్లర్ల కోసంఎవరూ దళారులను ఆశ్రయించవద్దు. -
అక్రమాలను కప్పిపుచ్చేందుకు.. వ్యవసాయ అధికారుల తంటాలు
కరీంనగర్ అగ్రికల్చర్/శంకరపట్నం: సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ముడుపుల బాగోతంపై ‘సాక్షి’లో ‘ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 వేల ముడుపులు’ శీర్షిక బుధవారం కథనం ప్రచురించడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాకు 172 సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరు కాగా.. ఒకే కంపెనీకి చెందిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఇందుకోసం సంబంధిత కంపెనీ డీలర్ నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50వేల చొప్పున కమీషన్ పుచ్చుకున్నారనే ఆరోపణలను ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించింది. మరోవైపు ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండడంతో తమ పేర్లు బయటకు రాకుండా అధికారులు తంటాలు పడుతున్నారు. జిల్లాలోని ఓ ఏడీఏ స్థాయి అధికారి తన పరిధిలో ట్రాక్టర్లు కేటాయించిన లబ్దిదారుల వద్దకు వెళ్లి ట్రాక్టర్ల కొనుగోలులో ముడుపుల మాట ఎత్తొద్దంటూ ప్రాధేయపడినట్లు తెలిసింది. మండలాల వారీగా సబ్సిడీ ట్రాక్టర్లు పొందిన వారి వద్దకు వెళ్లి తాము ఎవరి ఒత్తిడి లేకుండా.. స్వచ్ఛందంగానే సదరు కంపెనీ ట్రాక్టర్లు కొనుగోలు చేశామని రారుుంచుకుంటున్నట్లు సమాచారం. శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి రాజిరెడ్డి సబ్సిడీ ట్రాక్టర్ పొందగా.. బుధవారం వ్యవసాయ అధికారులు ఆయన వద్దకు వచ్చి తాను స్వచ్ఛందంగానే జాన్‌డీర్ ట్రాక్టర్ తీసుకున్నానని, అధికారులు ఒత్తిడి చేయలేదని వివరణ తీసుకున్నారు. హుజురాబాద్ ఏడీఏ దామోదర్‌రెడ్డి సబ్సిడీ ట్రాక్టర్లకు ముడుపులు తీసుకున్నారనడం అవాస్తవమని ఒక ప్రకటనలో ఖండించారు. సాక్షిలో వచ్చిన కథనం నిరాధారమని పేర్కొన్నారు. ఆ డివిజన్లోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, వీణవంక, శంకరపట్నం మండలాలకు చెందిన లబ్దిదారుల సంతకాలతో సబ్సిడీ ట్రాక్టర్ల కేటాయింపులో అధికారుల ఒత్తిడి లేదని.. ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని పేర్కొంటూ జేడీఏకు విన్నవించుకున్నారు. ఈ మేరకు సాక్షి కార్యాలయానికి ప్రకటన పంపించారు. ఇంకా విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ముడుపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. -
'నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారు'
హైదరాబాద్ : రైతులకు ఇచ్చే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అంతగా ఆదరణలేని ట్రాక్టర్ల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక మతలబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు కాకుండా టీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారని గుత్తా విమర్శించారు. లబ్దిదారుల ఎంపిక అధికారం మంత్రులకు ఇవ్వడం వల్ల వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ రైతులకు అన్యాయం జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయకుండా మంత్రులు తమకు నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి, విజిలెన్స్ శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూర్చొని చర్చలు జరపాలన్నారు. దీనిపై కేంద్రం జ్యోకం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. -
సబ్సిడీ ట్రాక్టర్లకు రాజకీయ చీడ!!
* 35 కోట్ల సబ్సిడీ కింద జిల్లాలకు 740 ట్రాక్టర్లే పంపిణీ * 50% రాయితీ ఉండటంతో ఎగబడుతున్న రైతులు * అధికార పార్టీ అండదండలున్న వారికే ఇస్తున్న వైనం * తక్కువ యూనిట్ల కేటాయింపుతో తీవ్ర కొరత రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాల సబ్సిడీకి రాజకీయ చీడ అంటుకుంది. అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే యంత్రాలను కట్టబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ భారీగా ఉండటంతో కొన్ని యంత్రాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వాటిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన సబ్సిడీపై ట్రాక్టర్ల సరఫరా గ్రామాల్లో సెగలు పుట్టిస్తోంది. వాటిని తక్కువ సంఖ్యలో కేటాయించడంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలకే వాటిని ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డిమాండ్ మేరకు ట్రాక్టర్లను మరిన్ని కేటాయించాల్సి ఉండగా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. - సాక్షి, హైదరాబాద్ మండలానికి ఒకట్రెండే? రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాకు 2014-15 సంవత్సరానికి రూ. 200 కోట్లు కేటాయించింది. అందులో అనేకం భూమిని చదును చేయడం నుంచి కోతల వరకు పనికి వచ్చే యంత్రాలున్నాయి. వాటిని 30 శాతం నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. ఈసారి కొత్తగా ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై ఇవ్వడం ప్రారంభించారు. అందులో ప్రధానంగా వరికి భూమిని సిద్ధం చేయడం, కోతలకు ఉపయోగించడం కోసం 34 హెచ్‌పీ సామర్థ్యానికి మించి ఉన్న ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. ఆ ట్రాక్టర్ల వాస్తవ ధర రూ. 10 లక్షలు ఉండగా సబ్సిడీపై రైతులకు రూ. 5 లక్షలకే లభిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ సబ్సిడీ ప్రకటించడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఉత్సుకత పెరిగడంతో వాటిని పొందేందుకు ఎగబడుతున్నారు. కానీ ట్రాక్టర్లను తక్కువ సంఖ్యలో జిల్లాలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ. 35 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇచ్చి 740 ట్రాక్టర్లనే జిల్లాలకు కేటాయించారు. కొన్ని చోట్లనైతే మండలానికి ఒకటి, మరికొన్ని చోట్ల మండలానికి రెండుకు మించి రైతులకు ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు రైతుల నుంచి మాత్రం వేలాది దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వంలోని అధికార పెద్దల సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన కార్యకర్తలకే ఇచ్చేలా నాయకులు యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సీఎం జిల్లాలోనూ అంతే... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సొంత జిల్లా మెదక్‌లో 46 మండలాలు ఉంటే అక్కడ కేవలం 58 ట్రాక్టర్లే కేటాయించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 64 మండలాలు ఉంటే... ఆ జిల్లాకు కేటాయించింది 76 ట్రాక్టర్లు మాత్రమే. అక్కడ ఒక మండలానికి ఒకటి చొప్పునే కేటాయించినట్లయింది. రంగారెడ్డి జిల్లాలో 37 మండలాలు ఉంటే... అక్కడ 18 ట్రాక్టర్లే కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో 57 మండలాలు ఉంటే... అక్కడ 110 ట్రాక్టర్లు కేటాయించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా నిజామాబాద్‌లో 36 మండలాలు ఉంటే... అక్కడ మాత్రం 130 ట్రాక్టర్లు కేటాయించారు. మండలానికి అత్యంత తక్కువ యూనిట్లు కేటాయించడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా రైతులకు ట్రాక్టర్లు చేరడంలేదు. అధికారుల చేతివాటం ట్రాక్టర్లకు డిమాండ్ పెరగడంతో అవి సాధారణ రైతులకు చేరడంలేదు. ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్ల కేటాయింపులు పెంచకుంటే అవి కొందరికే దక్కే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని కొందరు అధికారులు, కొన్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఒక ట్రాక్టర్‌కు రైతు సబ్సిడీపోను రూ. 5 లక్షలు చెల్లించాలి. మిగిలిన రూ. 5 లక్షలు ప్రభుత్వం కంపెనీకి చెల్లిస్తుంది. అయితే కొందరు అధికారులు కొన్నిచోట్ల రైతుల నుంచి అదనంగా మరో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు తీసుకొని ట్రాక్టర్లను కేటాయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల కేటాయింపు పెంచాలని... ఆ మేరకు వ్యవసాయ యంత్రాలకు కేటాయించిన నిధుల్లోంచి ట్రాక్టర్లకే అదనంగా కేటాయించేలా చూడాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.