ఖమ్మంవ్యవసాయం/మధిర : రాయితీపై ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేళ్లుగా మూలనపడిన పథకాలకు మోక్షం లభించడంతో 2016–17, 2017–18 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1,500 మంది ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అధికార పార్టీ కార్యకర్తల పేర్లను జాబితాలో చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషీ వికాస యోజన పేరిట(ఆర్కేవీవై), జాతీయ ఆహార భద్రతా పథకం పేరిట, రాష్ట్ర ప్రభుత్వం నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్‌ఎస్‌పీ) పేరిట వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోంది. రెండున్నర ఎకరాల మాగాణి లేదా మెట్ట భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు.
యాంత్రీకరణ పరికరాలను 50 శాతం రాయితీపై అందించనుండగా.. షెడ్యూల్డ్ కులాల రైతులకు 16 శాతం, షెడ్యూల్డ్ తెగల వారికి 8 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వు చేశారు. గ్రూపుగా పథకాన్ని పొందే రైతులకు 95 శాతం రాయితీ ఇస్తున్నారు. రైతులు చేసుకున్న దరఖాస్తులను ఏఓ, ఎంపీడీఓ, తహసీల్దార్‌ల బృందం పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉన్న వారిని అర్హులుగా గుర్తించి.. జాబితాను జిల్లా వ్యవసాయ శాఖకు పంపించారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాను పరిశీలించి.. తుది జాబితా రూపొందించాయి. దీనిని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని పంపించారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చని ఆ జాబితాల్లో పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో 580, భద్రాద్రి జిల్లాలో 170 ట్రాక్టర్ల జాబితాలను సిద్ధం చేసి.. పంపిణీ చేసేందుకు అధికార యంత్రాగం కసరత్తు చేస్తోంది. ట్రాక్టర్, రోటోవేటర్‌లను 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. వీటి విలువ సుమారు రూ.7లక్షల నుంచి 7.25లక్షల వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం రూ.3.50లక్షలు భరిస్తూ రైతులకు సబ్సిడీగా ఇస్తుంది. మిగిలింది రైతులే భరించాల్సి ఉంటుంది. బ్యాంక్ డీడీ లేదా బ్యాంక్ కాన్సెంట్‌ను అందించాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు 2016–17 సంవత్సరానికి 278 ట్రాక్టర్లు, 2017–18కి.. 302 ట్రాక్టర్లు, 2016–17, 2017–18 సంవత్సరాలకు మొత్తం 170 ట్రాక్టర్లను అందించనున్నారు.
పది రోజుల్లో పంపిణీ
లబ్ధిదారులకు పది రోజుల్లో ట్రాక్టర్లు పంపిణీ చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో జిల్లాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగానే రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేయనున్నారని సమాచారం.
‘వారికే’ ప్రాధాన్యం..
ట్రాక్టర్ల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన రైతులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సూచించిన రైతులకే ట్రాక్టర్లను కేటాయించినట్లు ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన్ని అర్హతలున్నా.. కొందరు రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యవసాయాధికారులు తీవ్ర వత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా.. వ్యవహారం వ్యవసాయ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. పలు ప్రాంతాల్లో కొందరు పైరవీకారులు ఎలాగైనా రాయితీ ట్రాక్టర్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతో వారు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
నిబంధనల ప్రకారమే..
వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి.. జాబితాలు రూపొందించాం. కలెక్టర్ పర్యవేక్షణలో జాబితాను తయారు చేశాం. జాబితాలను మండల, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తున్నాం. త్వరలోనే ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.
– ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment