సబ్సిడీ ట్రాక్టర్లు ఎవరి కోసం?
♦ వరిసాగులో దమ్ముకు పెద్ద ట్రాక్టర్లు ఉపయోగించ వద్దంటూ ప్రచారం
♦ కొనుగోలుకు మాత్రం రూ.రెండు లక్షల సబ్సిడీ
♦ జిల్లాకు 758 ట్రాక్టర్లు మంజూరు
♦ వరి రైతులకు దక్కాల్సిన సబ్సిడీ
♦ చేపలు, రొయ్యల చెరువుల యజమానులకు
♦ అడ్డదారిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు
భీమవరం:
వ్యవసాయం దండగంటూ గతంలో బహిరంగంగానే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అదేబాటలో ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడని పెద్ద ట్రాక్టర్లకు సబ్సిడీ ఇస్తూ చిన్న సన్నకారు రైతులను విస్మరిస్తోంది. జిల్లాలో సుమారు 5.6 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులున్నారు. వరిసాగులో కూలీల ఖర్చు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో వరిసాగు చేయడమంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో
వరిసాగులో ఖర్చు తగ్గించడానికి వ్యవసాయశాఖ రైతులను యాంత్రీకరణ వైపు దృష్టిసారించే విధంగా ప్రచారం చేసింది. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, వరినూర్పిడి యంత్రాలు, టార్పాలిన్స్ వంటి వాటిని సబ్సిడీపై ఇస్తోంది. పెద్ద ట్రాక్టర్లతో దుక్కి దున్నితే సుమారు అడుగున్నర లోతు దమ్ముచేయడం వల్ల భూమిలో వరి పైరుకు ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు నశించి పంటకు నష్టం ఏర్పడుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. వరి నాట్లుకు కేవలం ఆరు అంగుళాల లోతు దమ్ముచేస్తే సరిపోతుందని తెలియజేశారు. ఇందుకు పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు, రోటోవేటర్లు ఉపయోగించడం మేలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు పవర్ టిల్లర్లు, రోటోవేటర్లను ఉపయోగిస్తున్నారు. నూర్పిడికి ట్రాక్టర్లను కాకుండా నూర్పిడి యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
పెద్ద ట్రాక్టర్లకు రూ.2 లక్షలు సబ్సిడీ..
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు ఉపయోగించాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ట్రాక్టర్ల కొనుగోలుకు రూ. 2 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. రెండు ఎకరాలు సొంత భూమి కలిగిన రైతుకు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేస్తే వ్యవసాయశాఖ సబ్సిడీపై ట్రాక్టర్ మంజూరు చేయిస్తోంది. ఈ విధంగా టూవీలర్ ట్రాక్టర్‌కు రూ. 1.5 లక్షలు, ఫోర్ వీలర్ ట్రాక్టర్‌కు రూ. రెండు లక్షలు సబ్సిడీగా ఇస్తోంది. జిల్లా మొత్తం సుమారు 758 ట్రాక్టర్లు మంజూ రయ్యాయి.
భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని భీమవరం మండలానికి 22 ట్రాక్టర్లు, వీరవాసరం మండలానికి 27, పాలకోడేరు మండలానికి 17 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే పాలకొల్లు 25, పోడూరు 18, ఆచంట 15, యలమంచిలి 15, నరసాపురం 17, మొగల్తూరు 8, ఉండి వ్యవసాయసబ్ డివిజన్‌లోని ఉండి, ఆకివీడు, కాళ్ల మండలాలకు 59 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
వ్యవసాయ అవసరాలకు పెద్ద ట్రాక్టర్స్ అవసరాలు అంతగా లేకపోవడంతో రైతులు సబ్సిడీ ట్రాక్టర్స్ పట్ల మక్కువ చూపడం లేదు. జిల్లాలో ఎక్కువగా రొయ్యలు, చేపల చెరువుల సాగుకు, చెరువుల్లో పూడికతీతకు, గట్లు పటిష్టం చేయడానికి, దూరప్రాంతంలో ఉండే చెరువుల నుంచి చేపలు, రొయ్యలను ప్రధాన రహదారికి చేర్చడం, రియల్‌ఎస్టేట్ భూముల్లో మట్టి పూడిక వంటి అవసరాలకు పెద్ద ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నందున చేపల, రొయ్యల రైతులు సబ్సిడీ ట్రాక్టర్లను పొందేందుకు రాజకీయనాయకులతో పైరవీలు ప్రారంభించారు.