![Former CM Ramesh Pokhriyal Nishank Daughter Duped Of Rs 4 Cr For Movie Chance](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/2.jpg.webp?itok=7KpAAQiv)
సినిమా అవకాశాల పేరుతో చాలామంది మోసపోతూ ఉంటారు. పలు నిర్మాణ సంస్థల పేర్లు చెప్పుకొని అమాయకులను ట్రాప్ చేసి తమ బుట్టలో వేసుకుంటారు. ఆపై వారి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఉడాయించేస్తారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అయితే, సినిమా ఛాన్సుల పేరుతో తనను మోసం చేశారని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ ఫిర్యాదు చేశారు. ముంబైకి చెందిన మాన్సి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాపై డెహ్రాడూన్ నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆరుషి నిశాంక్ ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్, నటి, నిర్మాత, మోడల్ కూడా.. సినిమాలపై మక్కువతో ఆమె ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ఆయితే, ఆమెకు సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలనే కోరిక ఉంది. దానిని ఆసరా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు ఒకరోజు డెహ్రాడూన్‌లోని ఆమె ఇంటికి వెళ్లి తమను తాము సినిమా నిర్మాతలమని పరిచయం చేసుకున్నారు. మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా కొత్త సినిమాలు తెరకెక్కిస్తున్నామని ఆమెతో తెలిపారు.
షానయా కపూర్, విక్రమ్ మాస్సేతో ఒక సినిమా తీస్తున్నామని ఆమెతో చెప్పారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, నటించే వారికి స్టార్‌డమ్ వస్తుందని నమ్మబలికారు. అయితే, సినిమా కోసం రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఆమెను నమ్మించారు. ఆపై హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కూడా దక్కుతుందని ఆమెకు ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఆ పాత్ర నచ్చకపోతే రూ. 5 కోట్లకు గాను ఏడాదికి 20 శాతం వడ్డితో కలిపి ఇస్తామని, రెండు నిర్మాణ సంస్థల పేరు మీద సినిమా తీస్తామని ఆమెని నమ్మించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_443.jpg)
ఆ కేటుగాళ్ల మాటలను నమ్మిన ఆరుషి నిశాంక్.. సంయుక్తంగా సినిమా నిర్మింద్దామని వారికి రూ. 4 కోట్లు అప్పజెప్పింది. అయితే, కొన్ని రోజుల తర్వాత, వివిధ రకాల కారణాలతో ఎంఓయూ నిబంధనలకు విరుద్ధంగా, గతేడాది అక్టోబర్ 27న మరో రూ.25 లక్షలు, అక్టోబర్ 30న రూ.75 లక్షలు, నవంబర్ 19న కోటి రూపాయలు తీసుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్నాయి. సినిమా పనులు ఎంతవరకు వచ్చాయని ఆమె ప్రశ్నించింది. దీంతో కొన్ని నకిలీ ఫోటోలను ప్రచురించి పంపిణీ చేశారు. కొత్త హీరోయిన్‌ను తీసుకున్నామని నమ్మబలికారు.
వారి మోసాన్ని పసిగట్టిన ఆరుషి.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆమెను చంపుతామని బెదిరించారు. ఆపై ఆమె పరువు తీస్తామని హెచ్చరించారు. ఆరుషి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సినిమా అవకాశం పేరుతో రూ. 6 కోట్లు సమర్పించుకున్న ఆరుషిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత డబ్బు చేతిలో ఉండగా నువ్వే సొంతంగా సినిమా నిర్మించవచ్చు కదా అంటూ ఫైర్ అవుతున్నారు.
ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్
భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రమేశ్ పోఖ్రియాల్ 75కు పైగా పుస్తకాలు రచించారు.సాహిత్య రంగంలో పలు అవార్డ్స్ కూడా ఆయన అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment