N Chandrababu Naidu
-
తెలంగాణలో పొత్తులుంటాయి
-
తెలంగాణలో పొత్తులుంటాయి : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవసరమైతే తమ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని.. అయితే ఆ పొత్తు ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందని, కొందరు నేతలు పార్టీని వీడినా నష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలనే ప్రతిపాదనను మానుకోవాలని, లేదంటే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన చంద్రబాబు.. ఇతర పార్టీలో టీడీపీ విలీనమన్న ప్రసక్తే ఉండదని, అలా చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్తో పొత్తు కూడా వద్దని కొందరు కార్యకర్తలు నినాదాలు చేయగా.. చంద్రబాబు ఈ విషయంలో స్పందించలేదని తెలుస్తోంది. ఇక సమావేశంలో మరికొందరు నేతలు, కార్యకర్తలు.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు, లేదంటే లోకేశ్‌కు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన సీఎం.. జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌లు కాదని, తమ కాళ్ల మీద తాము నిలబడాలని సూచించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అరవింద్‌కుమార్‌గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం ఉదయం తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు తన నివాసంలో మరోసారి భేటీ కానున్నారు. -
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
-
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఎల్డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది(35శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే..మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించినట్లు పేర్కొంది. -
చంద్రబాబు శుభాకాంక్షలు.. థ్యాంక్స్ చెప్పిన వైఎస్ జగన్!
-
చంద్రబాబు శుభాకాంక్షలు.. థ్యాంక్స్ చెప్పిన వైఎస్ జగన్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 'వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అని చంద్రబాబునాయుడు తన అధికారిక ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ.. చంద్రబాబు చేసిన ట్వీట్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్లో స్పందించారు. 'ప్లజెంట్ సర్ప్రైజ్ అండి. థ్యాంక్యూ' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను జనం మధ్యలో జరుపుకొన్నారు. అనంతపురం జల్లా నల్లమడకు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్‌ను తెప్పించి వైఎస్ జగన్‌తో కట్ చేయించారు. ఈ సందర్భంగా నల్లమడలో ఆయన బస చేసిన శిబిరం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. ఇటు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సబ్సిడీ ట్రాక్టర్లు ఎవరి కోసం?
♦ వరిసాగులో దమ్ముకు పెద్ద ట్రాక్టర్లు ఉపయోగించ వద్దంటూ ప్రచారం ♦ కొనుగోలుకు మాత్రం రూ.రెండు లక్షల సబ్సిడీ ♦ జిల్లాకు 758 ట్రాక్టర్లు మంజూరు ♦ వరి రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ♦ చేపలు, రొయ్యల చెరువుల యజమానులకు ♦ అడ్డదారిన ప్రజాప్రతినిధుల సిఫార్సులు భీమవరం: వ్యవసాయం దండగంటూ గతంలో బహిరంగంగానే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అదేబాటలో ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడని పెద్ద ట్రాక్టర్లకు సబ్సిడీ ఇస్తూ చిన్న సన్నకారు రైతులను విస్మరిస్తోంది. జిల్లాలో సుమారు 5.6 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులున్నారు. వరిసాగులో కూలీల ఖర్చు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో వరిసాగు చేయడమంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో వరిసాగులో ఖర్చు తగ్గించడానికి వ్యవసాయశాఖ రైతులను యాంత్రీకరణ వైపు దృష్టిసారించే విధంగా ప్రచారం చేసింది. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, వరినూర్పిడి యంత్రాలు, టార్పాలిన్స్ వంటి వాటిని సబ్సిడీపై ఇస్తోంది. పెద్ద ట్రాక్టర్లతో దుక్కి దున్నితే సుమారు అడుగున్నర లోతు దమ్ముచేయడం వల్ల భూమిలో వరి పైరుకు ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు నశించి పంటకు నష్టం ఏర్పడుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. వరి నాట్లుకు కేవలం ఆరు అంగుళాల లోతు దమ్ముచేస్తే సరిపోతుందని తెలియజేశారు. ఇందుకు పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు, రోటోవేటర్లు ఉపయోగించడం మేలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు పవర్ టిల్లర్లు, రోటోవేటర్లను ఉపయోగిస్తున్నారు. నూర్పిడికి ట్రాక్టర్లను కాకుండా నూర్పిడి యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్ద ట్రాక్టర్లకు రూ.2 లక్షలు సబ్సిడీ.. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పవర్ టిల్లర్లు, కృషి ట్రాక్టర్లు ఉపయోగించాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ట్రాక్టర్ల కొనుగోలుకు రూ. 2 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. రెండు ఎకరాలు సొంత భూమి కలిగిన రైతుకు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేస్తే వ్యవసాయశాఖ సబ్సిడీపై ట్రాక్టర్ మంజూరు చేయిస్తోంది. ఈ విధంగా టూవీలర్ ట్రాక్టర్‌కు రూ. 1.5 లక్షలు, ఫోర్ వీలర్ ట్రాక్టర్‌కు రూ. రెండు లక్షలు సబ్సిడీగా ఇస్తోంది. జిల్లా మొత్తం సుమారు 758 ట్రాక్టర్లు మంజూ రయ్యాయి. భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని భీమవరం మండలానికి 22 ట్రాక్టర్లు, వీరవాసరం మండలానికి 27, పాలకోడేరు మండలానికి 17 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే పాలకొల్లు 25, పోడూరు 18, ఆచంట 15, యలమంచిలి 15, నరసాపురం 17, మొగల్తూరు 8, ఉండి వ్యవసాయసబ్ డివిజన్లోని ఉండి, ఆకివీడు, కాళ్ల మండలాలకు 59 ట్రాక్టర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద ట్రాక్టర్స్ అవసరాలు అంతగా లేకపోవడంతో రైతులు సబ్సిడీ ట్రాక్టర్స్ పట్ల మక్కువ చూపడం లేదు. జిల్లాలో ఎక్కువగా రొయ్యలు, చేపల చెరువుల సాగుకు, చెరువుల్లో పూడికతీతకు, గట్లు పటిష్టం చేయడానికి, దూరప్రాంతంలో ఉండే చెరువుల నుంచి చేపలు, రొయ్యలను ప్రధాన రహదారికి చేర్చడం, రియల్ఎస్టేట్ భూముల్లో మట్టి పూడిక వంటి అవసరాలకు పెద్ద ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నందున చేపల, రొయ్యల రైతులు సబ్సిడీ ట్రాక్టర్లను పొందేందుకు రాజకీయనాయకులతో పైరవీలు ప్రారంభించారు. -
డిజిటల్ 'బాబు' సొంతూర్లో ఏటీఎం ఉందా?
తిరుపతి : నగదు రహిత లావాదేవీల ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా ఎలా మార్చాలో చెప్పుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వగ్రామాన్నే గాలికొదిలేశారు. సీఎం స్వగ్రామం నారావారిపల్లిలో కనీసం బ్యాంకు కార్యాలయమే కాక, ఒక్క ఏటీఎం కూడా లేదు. నారావారిపల్లికి పక్కనున్న డజను గ్రామాలది ఇదే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ నోట్ల కోసం ఆ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్కడ స్వైపింగ్ మిషన్లూ పనిచేయడం లేదు. కేవలం ఒక్క రేషన్ దుకాణదారుడు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సబ్సిడీ బియ్యాన్ని, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నాడు. నారావారిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో రంగంపేటలో ఏటీఎం ఉన్నా.. అది ఉండీ లేనిమాదిరిగా తయారైంది. కనెక్టివిటీ సమస్యతో అది పనిచేయడం లేదు. ఓ వైపు తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 104వ ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులు ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తున్నారు. ఆ వేదికకు కొద్దీ దూరంలోనే స్వయానా సీఎం స్వగ్రామం నారావారిపల్లినే టెక్నాలజీకి ఆమడదూరంలో పయనం సాగిస్తుండటం విడ్డూరం. -
ప్యాకేజీల తో బాబు పాలన సాగుతోంది: రఘవీరా
రాష్ట్రంలో ప్యాకేజీలతో బాబు పాలన సాగుతోందని, రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను మరిచి ప్రజలను వంచిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి విమర్శించారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీవుల్లా బేగ్ స్వగృహంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ, మట్టి సత్యాగ్రహం స్ఫూర్తితో చంద్రబాబు అవినీతి పాలనపై మరో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే నిర్మించాలని ఉన్నా, ఇప్పుడు దాని నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం అన్యాయమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్యాకేజ్‌లు ముట్టజెప్పేందుకేనని విమర్శించారు. కేవలం తమ సొంత కాట్రాక్టర్లకు పనులు అప్పగించడానికే చంద్రబాబు ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజ్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వచ్చిన అవినీతి డబ్బును 2019 ఎన్నికల్లో ఖర్చుచేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్యాకేజ్లతో కొనుగోలు చేస్తూ, తెలంగాణలో ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అమ్ముకున్నాడని విమర్శించారు. రెండున్నరేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈనెల 28న తిరుపతి నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం చంద్రబాబు 600 హామీలు, కులాల ప్రాతిపదికన 150 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. వీటితోపాటు ప్రత్యేక హోదా అంశంపై ప్రజల వద్దకు వెళతామని వివరించారు. తమ ప్రజాబ్యాలెట్లో ప్రత్యేకహోదా అవసరం లేదని ప్రజలు అభిప్రాయపడితే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని నియమించినట్లు రఘువీరా ప్రకటించారు. సమావేశంలో మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్ జహాబేగ్, పశ్చిమగోదావరి డీసీసీ అధ్యక్షుడు రఫీవుల్లాబేగ్ పాల్గొన్నారు. -
కేంద్రం సాయం చేస్తున్నదని సీఎం చాలా సార్లు చెప్పారు
‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం అందరికీ తెలసు. మరి రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఎందుకు వ్యాఖ్యానించారో అర్ధంకావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్యపుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఏపీకి అన్యాయం ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి అనేక విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రానికి 12 సెంట్రల్ ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని, వాటిలో ఐదు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలలను ఉద్దేశ పూర్వకంగా, తెలంగాణలో కలిపిన రోజు, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిశాయని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం మోదీ ఏపీకి చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. -
అభివృద్ధి కోసమే టీడీపీని ఆశ్రయించా
పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తాడేపల్లి రూరల్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం సీఎం నివాసం వద్ద చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మోహనరావు మాట్లాడుతూ పాతపట్నం వెనుకబడిన నియోజకవర్గమని, ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాలంటే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తే తమ ప్రాంతంలో మరో ఉండవల్లిలో లాగా పచ్చటి పొలాలను చూడవచ్చని చెప్పారు. తాము అమ్ముడు పోయామన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. -
'సతీసావిత్రికి-చింతామణికీ ఉన్నంత తేడా'
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి .. ఎన్టీఆర్ కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లె లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ శాసన సభ్యులుగా గెలిచిన రత్తయ్య, నారాయణ, ఆదయ్యలు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే.. ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలసలను ప్రోత్సహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిరంతరం ఎన్టీఆర్ పేరును దొంగ జపం చేసే టీడీపీ నాయకులు పార్టీఫిరాయింపుల విషయంలో సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించి టీడీపీలోకి చేర్చుకున్నట్లైతే బాబు రాజనీతిజ్ఞుడు అవుతాడని లేకదంటే... చరిత్ర హీనుడవుతాడని అన్నారు. పార్టీఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
దళితులకు సీఎం క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘‘ఎస్సీ ల్లో ఎవరు పుట్టాలనుకుంటారు’’అని మాట్లాడడం దళితులను కించపరిచినట్లేనని, అందుకు క్షమాపణ చెప్పాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.దళితులపట్లవ్యంగ్యంగామాట్లాడటంమనోభావాలనుదెబ్బతీసినట్లేనన్నారు. ఎస్సీల్లో చిచ్చుపెట్టిన చంద్రబాబు ప్రస్తుతం బీసీ కులాల్లో చిచ్చును రగిల్చారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు పెద్దమాదిగనవుతా.., చెప్పులు కుడతానంటూ దళిత వేషం కట్టిన చంద్రబాబు కుల రాజకీయాలతో గద్దెనెక్కలేరని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మాలమాదిగల కులంలో పుట్టడం మాకెంతో గర్వంగా ఉందని, అదే కులంలా మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వినర్ తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, పేట చంద్రారెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందువాసుమాదిగ, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. -
టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్
వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాకినాడలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా పోలీసులు జోక్యం చేసుకుని 30 మంది ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేశారు. -
చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిక్కీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ పై ఫిక్కీ ప్రతినిధులు చంద్రబాబుకు నివేదిక అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వృద్ధిరేటు పడిపోతోందని.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వృద్ధి శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఫిక్కీ బృందం ముఖ్యమంత్రికి సూచించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో పాటు.. ఫిక్కీ చైర్మన్ అన్షూ భద్రాజ , ఐడీఎస్ఏ ఛైర్మన్ రజత్ బెనర్జీ లు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం చంద్రబాబు నాయుడు బయోటెక్నాలజీ కార్యదర్శి విజయ రాఘవన్ తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నా పరిశోధనా సెంటర్ల ఏర్పాటు పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో బయోటెక్నాలజీ అభివృద్ది అవకాశాలపై ఆయన తో చర్చించినట్లు తెలుస్తోంది. -
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంట్ ప్రకటించారు.. గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో కూడా రాష్ట్రానికి పదేళ్ల పాటు హోదా ఇస్తామని పేర్కొంది. అంతే కాకుండా.. మోదీ, వెంకయ్యనాయుడు ఎన్నికల సభలోనూ హామీ ఇచ్చారు అని రామకృష్ట గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు అనగుణంగా హోదా ఇవ్వాల్సింది పోయి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని మాట్లాడడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టడమేనని విమర్శించారు. కేంద్రం ప్యాకేజీ ఇచ్చినా సరిపెట్టుకుందామనే చంద్రబాబు నాయుడు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు జరిగే ఉద్యమంలో ప్రజలతో పాటు పాలకులు కూడా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన బిల్లులో హామీల అమలు డిమాండ్‌తో నవంబరు రెండున విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు. -
హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం
-
నేడు 'అనంత'లో చంద్రబాబు పర్యటన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పాలసముద్రంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు హాజరుకానున్నారు. నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 ఏకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. -
ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా మానవ వనరుల శాఖపై శ్వేతపత్రాన్ని గురువారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఆ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు వారానికి ఓ శాఖ చొప్పున విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల రంగంపై శ్వేతప్రతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమైయ్యారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లతో బాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత అవినీతి నిర్మూలనపై మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.00 గంటలకు పలువురు ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. -
చంద్రబాబు పర్యటన ఇలా
ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 16, 17 తేదీల్లో జిల్లాలో పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా సమాచార శాఖ సోమవారం విడుదల చేసింది. ఈనెల 16న ఉద యం 10.30 గంటలకు చంద్రబాబు ద్వారకాతిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుం టారు. 11 గంటలకు తాడిచర్ల చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడతారు. అనంతరం ఆ గ్రామంలో పర్యటిస్తారు. 11.50 గంటలకు కామవరపుకోట చేరుకుని వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. లబ్ధిదారులకు ఉపక రణాలు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నిర్వహించే రైతు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పలపాడు చేరుకుని రైతులతో ముచ్చటించి గ్రామాన్ని సందర్శిస్తారు. 3.30 గంటలకు రావికంపాడు జంక్షన్, సాయంత్రం 4 గంటలకు దేవులపల్లి జంక్షన్లో రైతులతో మాట్లాడి ఆయా గ్రామాలను సందర్శిస్తారు. 4.30 గంటలకు మద్దిఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుం టారు. 5గంటలకు గుర్వారుుగూడెంలో రైతులతో మాట్లాడి, గ్రామాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు జంగారెడ్డిగూడెం మసీదు జంక్షన్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7.30నుంచి 9.30 గంటల వరకూ జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం వల్ల ప్రజాప్రతి నిధులతో సమావేశం అవుతారు. రాత్రి 9.30 గంటలకు నవభారత్ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. 17న ఉదయం 8నుంచి 11 గంటల వరకు జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఉదయం 11.15 గంటలకు నరసన్నపాలెం, 11.30 గంటలకు బయ్యనగూడెంలో రైతులతో మాట్లాడి గ్రామాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కొయ్యలగూడెం చేరుకుని టుబాకో బోర్డును సందర్శించి రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను సందర్శించి లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. 12.45నుంచి 2.30 గంటల వరకు కొయ్యలగూడెంలో నిర్వహించే స్వయం సహాయక మహిళల సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు కొయ్యలగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ పయనమవుతారు. -
'కొత్త రాష్ట్రంతో యువతకు ఉద్యోగావకాశాలు'
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాల సీతారామన్ మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అలాగే ఇరు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పామని అందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆమె వివరించారు. మహిళపై దాడులను నిరోధించేందుకు కేంద్ర పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఆమె గుర్తు చేశారు. నిర్మల సీతారామన్ సన్మాన కార్యక్రమంలో సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిర్మల సీతారామన్ పాల్గొనున్నారు. -
ఆ సీటుపైనే బాబు, పవన్, కేసీఆర్, జేపీల చూపు!
వారణాసి లోకసభ స్థానంపై దేశవ్యాప్తంగా దృష్టి పడింది. ఎందుకంటే వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ లు పోటికి నిలవడంతో ఆస్థానంపై ఆసక్తి పెరిగింది. అలానే తెలంగాణ ప్రాంతంలోని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి స్థానం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందుకు కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్, లోకసత్తా వ్యవస్థాపకుడు ఎన్ జయప్రకాశ్ నారాయణ్ పోటికి ఆసక్తి చూపడమే. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుమారుడు లోకేష్ ను బరిలోకి దించాలని అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు భావించిన ఎందుకనో వెనుకంజ వేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా బరిలో దిగేందుకు తహతహలాడారు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, జేపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఉండటంతో పలు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఎల్ బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఇతర స్థానంలో అత్యధికంగా తెలంగాణేతర ఓటర్లు ఉన్న కారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీలు మల్కాజ్ గిరి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే స్థానంలో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారో అనే విషయం కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం. -
రాజకీయ కుట్రలను పక్కన పెట్టండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వివక్షతో కూడిన రాజకీయ కుట్రలను పక్కనపెట్టి, రాష్ర్టంలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్సింగ్ను కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రికి ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి మౌనముద్ర వీడాలని విజ్ఞప్తి చేశారు. మీడియాకు విడుదల చేసిన ఆ లేఖలోని అంశాలను వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇస్తున్నాం. రాష్ర్టంలో కొనసాగుతున్న ఆందోళనలకు తెరదించాలని బాబు ఆ లేఖలో కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీల చర్యలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించి క్రియాశీలక పాత్ర పోషిస్తారనుకుంటే కాంగ్రెస్ కుళ్లు రాజకీయాల్లో పావుగా మారటం బాధాకరమని తెలిపారు. ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు కలిసినపుడు ఏవైనా సమస్యలుంటే ఆంటోనీ కమిటీని కలవాలని ప్రధాని చెప్పడమేమిటని తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నా యని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్‌సింగ్ బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించటంలో ప్రధాని సరైన శ్రద్ధను చూపించకపోవటానికి కాంగ్రెస్ కుట్రే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో టీఆర్ఎస్ తమ పార్టీలో విలీనమవుతుందని దిగ్విజయ్ చెప్పటం దీనికి బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని తీసుకునేముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియచేసిందని, అందువల్లే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని లేఖలో ఆరోపించారు. తనకు, తన పార్టీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రధానికి రాసిన సుదీర్ఘ లేఖలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.