సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవసరమైతే తమ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని.. అయితే ఆ పొత్తు ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందని, కొందరు నేతలు పార్టీని వీడినా నష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనను మానుకోవాలని, లేదంటే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన చంద్రబాబు.. ఇతర పార్టీలో టీడీపీ విలీనమన్న ప్రసక్తే ఉండదని, అలా చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కూడా వద్దని కొందరు కార్యకర్తలు నినాదాలు చేయగా.. చంద్రబాబు ఈ విషయంలో స్పందించలేదని తెలుస్తోంది.
ఇక సమావేశంలో మరికొందరు నేతలు, కార్యకర్తలు.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు, లేదంటే లోకేశ్‌కు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన సీఎం.. జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌లు కాదని, తమ కాళ్ల మీద తాము నిలబడాలని సూచించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అరవింద్‌కుమార్‌గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం ఉదయం తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు తన నివాసంలో మరోసారి భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment