సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు టర్మ్‌ల తర్వాత పాలన మార్పు ఒరవడి ఈసారి బ్రేక్ అవుతుందా..? లేక కొనసాగుతుందా..? అనే చర్చకు తావిస్తున్నాయి. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్‌లు రెండుసార్లు వరుస విజయాలు సాధించాయి. కానీ మూడోసారి అధికారం చేపట్టడంలో విఫలమయ్యాయి.
అయితే మధ్యలో 1989లో ఒకసారి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 1994లో మాత్రం రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కాగా 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్, టీడీపీలకే అధికారం చేజిక్కుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) రెండోసారీ (2018లో) అధికారంలోకి వచ్చింది. తాజాగా 2023 నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఒరవడికి భిన్నంగా వరుసగా మూడో విజయాన్ని బీఆర్‌ఎస్ నమోదు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూడు ప్రధాన పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అన్ని ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజారిటీ..!
గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. ఎక్కడా అసందిగ్ధతకు తావివ్వలేదు. అయితే ఈసారి ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు తమ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ హంగ్ ఏర్పడుతుందని, అయినా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పడం చర్చనీయాంశమయ్యింది. అయితే తర్వాత ఆ పార్టీ తమ నేత అలా మాట్లాడలేదంటూ హంగ్‌ను కొట్టిపారేసింది. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. ఇక మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా హంగ్‌ను కొట్టిపారేయడం గమనార్హం.
బీఆర్‌ఎస్ నేతల్లో ధీమా
అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు పూర్తి దీమాతో ఉన్నారు. గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారడం తప్పకుండా సానుకూల ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిందని, బెంగళూరును వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరిస్తున్నారు. కేసీఆర్ కూడా తరచూ తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలోనూ దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ అని.. సాగు, తాగునీటి రంగాలే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందనడానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనం అని నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయనేది అధికార పక్షం వాదన.
ఢీ అంటే ఢీ అంటున్న మూడు పార్టీలు
గడిచిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన పోటీదారుగా ఉండటంతో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఢంకా బజాయిస్తున్నాయి. సాధారణ ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి, ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ మూడోసారి అధికార పీఠాన్ని అధిష్టించే అవకాశమే లేదని, తాము గెలుపొందడం ఖాయమనే భావనలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. విజయ సాధన దిశగా ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరు గ్యారంటీలపై అపార నమ్మకం..
అదే సమయంలో తెలంగాణ ఇచ్చి న పార్టీగా, ఆరు గ్యారంటీలతో ఈసారి తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అవినీతి, కుటుంబ పాలనతో పాటు నిరుద్యోగులను మోసం చేసిందని ప్రధానంగా ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అనుయాయులకే ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నదని విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని పాలించే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని తేల్చి చెబుతోంది.
డబుల్ ఇంజన్ నినాదం
రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ అధి కారంలో ఉంటే అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ చెబుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని, అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది. బీసీ నినాదం ఎత్తుకోవడంతో పాటు బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. ఉచితాల జోలికి వెళ్లకుండా అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టి విజయం సాధించాలనే ఆలోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment