సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లు చావు కబురు చల్లగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర వుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకే తమకు సమయం సరిపోతుందని, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేంత స్థాయిలో తాము దృష్టి కేంద్రీకరించలేమని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. తండ్రీ కొడుకుల ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నట్టేట ముంచారంటూ తమ్ముళ్లు ఆందోళనకు గురవుతు న్నారు. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న లోపాయి కారీ ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీకి మేలు చేసేందుకు తమను బలిపశువులను చేశార ని ఆవేదనకు గురవుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతామని, బీఫారాలు ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలుగుదేశం అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
లోకేశ్‌తో మాట్లాడుకోవాలన్న బాబు
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా నాన్చుతూ వస్తోంది. అన్నిచోట్లా పోటీ చేయకపోయినా, బలమున్న చోటయినా పోటీకి దిగుదామని పార్టీ నేతలకు చెప్పుకుంటూ వచ్చింది. కాగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పోటీ విషయమై తేల్చుకునేందుకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవల చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయ్యారు. అయితే తెలంగాణలో పోటీ చేసే విషయం తాను మాట్లాడలేనని, లోకేశ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సూచించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జ్ఞానేశ్వర్ అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఆహ్వానం పంపారు. అయితే లోకేశ్ హాజరు కాకుండా.. తెలంగాణలో పోటీ చేయడం లేదనే సమాచారాన్ని పంపించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడాల్సి వచ్చింది. తాము ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని, బలమున్న నియోజకవర్గాల్లో నైనా పోటీకి అంగీకరించాలని డిమాండ్ చేశారు.
కానీ లోకేశ్ ససేమిరా అనడంతో సమావేశానికి వచ్చిన నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. తండ్రీకొడుకుల కోసం తాము త్యాగాలెందుకు చేస్తామని ప్రశ్నించిన నేతలు.. కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలన్న ఆలోచనతోనే తెలంగాణలో పోటీని విరమించుకున్నారంటూ బహిరంగ ఆరోపణలకు దిగారు. స్వతంత్ర అభ్యర్థు లుగానైనా బరిలోకి దిగుతామంటూ సమావేశంలో తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment