‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం అందరికీ తెలసు. మరి రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఎందుకు వ్యాఖ్యానించారో అర్ధంకావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్యపుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఏపీకి అన్యాయం ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి అనేక విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రానికి 12 సెంట్రల్ ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని, వాటిలో ఐదు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలలను ఉద్దేశ పూర్వకంగా, తెలంగాణలో కలిపిన రోజు, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిశాయని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం మోదీ ఏపీకి చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.