మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
‘తల్లికి వందనం’ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం
18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఎప్పుడిస్తారంటూ ఆగ్రహం
ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కా చెల్లెమ్మల నిలదీత
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కంగుతిన్న లోకేశ్
ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవేత
సాక్షి, భీమవరం/ఉండి/కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మహిళా లోకం నిలదీసింది. సూపర్ సిక్స్ హామీలన్నీ ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో లోకేశ్ కంగుతిన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ.1,500, ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలని మహిళలు కోరారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్’ అని స్థానిక మహిళలు లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉండిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో పలు ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు వచ్చిన స్థానిక మహిళలను పోలీసులు అడ్డుకుని బయటే ఉంచేశారు. వారు గేటు బయటి నుంచి లోకేశ్‌ను పిలవగా.. ఆయన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు? సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశి్నస్తూ లోకేశ్‌కు చుక్కలు చూపించారు. లోకేశ్ బదులిస్తూ.. ‘పింఛన్ పెంచాం. గోతులు పూడుస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. త్వరలో చేస్తాం’ అన్నారు. కానీ.. ఎప్పటి నుంచి ఆయా పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయకుండా సమాధానం దాటవేశారు.
వినతులు తీసుకోకుండానే..
దివ్యాంగురాలైన తన కుమార్తెకు పింఛన్ ఇప్పించాలని ఒక మహిళ వినతిపత్రం అందజేయగా.. మిగిలిన మహిళల నుంచి వినతులు తీసుకోకుండానే లోకేశ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. వినతిపత్రాలు ఇచ్చేవారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి అందజేయాలని కూటమి నాయకులు సూచించడంతో మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు అప్పటివరకు పడిగాపులు కాసిన జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు.
మీడియాపై ఆంక్షలు
ఉండిలోని జెడ్పీ హైస్కూల్‌లో దాతల సాయంతో ఆధునికీకరించిన అభివృద్ధి పనుల ప్రారంబోత్సవం, కాళ్ల మండలం పెదఅమిరంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ, భీమవరంలో ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం, పితృవియోగంతో ఉన్న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి లోకేశ్ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు.
లేని షటిల్, టెన్నిస్ కోర్టులు ప్రారంభించిన మంత్రి
నిర్మాణాలు ఏమీ చేయకుండానే నేలపై సున్నం వేసి, నెట్‌లు కట్టి షటిల్ కోర్టులంటూ మంత్రి లోకేశ్‌తో ప్రారంభింపజేయడం, ఆయన ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరించింది. మంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలోని ప్లే గ్రౌండ్ అభివృద్ధి పేరిట కాలువలోంచి తీసిన మట్టితెచ్చి వేశారని స్థానికులు తెలిపారు. హైస్కూల్‌లో ప్రారంభోత్సవాల అనంతరం లోకేశ్, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, టీడీపీ ముఖ్య నేతలు కొంతసేపు ప్రధానోపాధ్యాయుని గదిలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కిటికీ తలుపులు కూడా మూసివేశారు. ఎంఈవో జ్యోతిని కూడా పోలీసులు, లోకేశ్ సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారంతా బయటే ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment