సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవని అన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ వేధింపులు, కేసులు మనకు తాత్కాలికం మాత్రమేనని తెలిపారు.ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దేవుడు అన్ని విషయాలు చూస్తున్నాడు అనేందుకు తిరుమల లడ్డూ వివాదం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
బాబుకు దేవుడే మొట్టికాయలు వేశాడు..
లడ్డూ విషయంలో విష ప్రచారం చేశారని, వారి ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని గోబెల్స్ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మేయగల సమర్థులని విమర్శలు గుప్పించారు. అయినా లడ్డూ వ్యవహారంలో గట్టిగా నిలబడి ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని తెలిపారు. చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
విచ్చలవిడిగా జూదం, క్లబ్బులు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో వైఎస్ జగన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో, నియోజకవర్గాల్లో జూదం, క్లబ్బులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక, మద్యంల్లో స్కాంలు నడుస్తున్నాయని, స్టాక్‌యార్డుల్లో పెట్టిన ఇసుక మాయం అయిపోయిందని విమర్శలు గుప్పించారు. మొత్తం స్టాకుయార్డుల్లో నిల్వలను లూటీ చేశారన్న ఆయన.. ఇప్పుడు ఇసుక ఎక్కడ దొరకడం లేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇసుక ధర కన్నా ఇప్పుడు ధర చాలా ఎక్కువ ఉందన్నారు.
మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు..
‘ప.గో. జిల్లాకు చెందిన నాయకులే చెప్తున్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో టన్నుకు రూ. 550లు అయితే, ఇప్పుడు రూ.1375కు అమ్ముతున్నారని చెప్తున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎవరి జేబుల్లోకి డబ్బు పోతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపులనుంచి ఎమ్మెల్యేలకు వాటాలు, ఆపై వాళ్లకు వాటాలు. గ్రామ, గ్రామాన బెల్డు షాపులు వస్తున్నాయి.
మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు
ఐదేళ్ల పరిపాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. జగన్ మంచే చేశాడు.. చెడు చేయలేదన్న మాటే ప్రతిచోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాల కాంపిటీషన్‌లో చంద్రబాబుతో పోటీపడలేకపోయాం. చంద్రబాబు చెప్పినట్టుగా జగన్ చెప్పలేకపోయాడు. చంద్రబాబులా జగన్‌కూడా హామీలు ఇవ్వాలన్నట్టుగా చాలామంది ఎదురుచూశారు. కాినీ, ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్‌కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా తలెత్తుకునే రాజకీయాలు చేస్తాం.
ప.గో.జిల్లా జడ్పీ ఛైర్మన్ పార్టీ మారినా, జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. వారి పోరాట స్ఫూర్తికి అభినందనలు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత మీరు చూపారు. జడ్పీటీసీలు అందరికీ కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శనీయంగా నిలిచింది. ఎప్పుడూ చీకటి మాత్రమే ఉండదు, వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రజల తరఫున పోరాటాలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు వైఎస్ జగన్.
Comments
Please login to add a commentAdd a comment