సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారనే ప్రచారంతో వేలాదిగా వెళ్తున్న జనం
ఉదయం 5 గంటలకే క్యూ కడుతున్న మహిళలు
ఎన్‌పీసీఐ ఖాతాలు, ఆధార్ సీడింగ్ కోసం పడిగాపులు
నియంత్రణ లేక తొక్కిసలాట.. కనిపించని పోలీసులు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్ పోస్టాఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
సూపర్ సిక్స్ పథకాల కోసమంటూ..
టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్‌సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.
అసలు సంగతి ఏమిటంటే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింక్ అయినంత మాత్రానా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింక్ చేస్తున్నా.. సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.
బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్ లింకేజీ, సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment