ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ పార్లమెంట్ ప్రకటించారు.. గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో కూడా రాష్ట్రానికి పదేళ్ల పాటు హోదా ఇస్తామని పేర్కొంది.
అంతే కాకుండా.. మోదీ, వెంకయ్యనాయుడు ఎన్నికల సభలోనూ హామీ ఇచ్చారు అని రామకృష్ట గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు అనగుణంగా హోదా ఇవ్వాల్సింది పోయి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని మాట్లాడడం లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టడమేనని విమర్శించారు.
కేంద్రం ప్యాకేజీ ఇచ్చినా సరిపెట్టుకుందామనే చంద్రబాబు నాయుడు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు జరిగే ఉద్యమంలో ప్రజలతో పాటు పాలకులు కూడా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన బిల్లులో హామీల అమలు డిమాండ్‌తో నవంబరు రెండున విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు.