
రాజకీయ కుట్రలను పక్కన పెట్టండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వివక్షతో కూడిన రాజకీయ కుట్రలను పక్కనపెట్టి, రాష్ర్టంలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రికి ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి మౌనముద్ర వీడాలని విజ్ఞప్తి చేశారు. మీడియాకు విడుదల చేసిన ఆ లేఖలోని అంశాలను వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇస్తున్నాం. రాష్ర్టంలో కొనసాగుతున్న ఆందోళనలకు తెరదించాలని బాబు ఆ లేఖలో కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీల చర్యలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రధాని రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించి క్రియాశీలక పాత్ర పోషిస్తారనుకుంటే కాంగ్రెస్ కుళ్లు రాజకీయాల్లో పావుగా మారటం బాధాకరమని తెలిపారు. ఏపీఎన్‌జీవో సంఘం ప్రతినిధులు కలిసినపుడు ఏవైనా సమస్యలుంటే ఆంటోనీ కమిటీని కలవాలని ప్రధాని చెప్పడమేమిటని తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నా యని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్‌సింగ్ బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించటంలో ప్రధాని సరైన శ్రద్ధను చూపించకపోవటానికి కాంగ్రెస్ కుట్రే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో టీఆర్‌ఎస్ తమ పార్టీలో విలీనమవుతుందని దిగ్విజయ్ చెప్పటం దీనికి బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తన నిర్ణయాన్ని తీసుకునేముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియచేసిందని, అందువల్లే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని లేఖలో ఆరోపించారు. తనకు, తన పార్టీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రధానికి రాసిన సుదీర్ఘ లేఖలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.