బాధ్యతను గుర్తిస్తేనే భవిష్యత్తు
నవ్యాంధ్రప్రదేశ్‌కు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పిస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కల్పించడం అందులో కీలకమైనది. ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సైతం ఎన్నో తాయిలాలున్నాయి. ఏడాది కావస్తున్నా ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తిస్తాయా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడంలో అత్యుత్సాహం ప్రదర్శించినవారు చేసిన బాసలు నెరవేర్చవలసి వచ్చేసరికి నీళ్లు నములుతున్నారు. రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. బాధ్యులు మీరంటే మీరని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆనాడు జరిగిందేమిటో ఎవరూ మరిచి పోలేరు. జనం ఎంతగా ఆందోళన చేసినా, రాజకీయ పక్షాలు ఎంతగా నిరసిం చినా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఆఖరికి అయిదు ఊళ్లయినా ఇవ్వండని పాండవుల తరఫున కృష్ణుడు రాయబారం చేసినట్టు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమని ఆనాటి కేంద్ర మంత్రులు కోరినా అప్పటి యూపీఏ సర్కారు వినిపించుకోలేదు.
ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్... ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ రెండూ కలిసి నవ్యాంధ్రప్రదేశ్‌కు బంగారు భవి ష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చి సమైక్యాంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చారు. ఒక రాష్ర్టం నీటి వనరులలోనూ, ఖనిజసంపదలోనూ, ఆర్థిక పరిపుష్ఠతలోనూ లబ్ధి పొందింది... రెండో రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలోనూ, జలవనరుల జంజా టంలోనూ... వైద్య, విద్యా రంగాలలోనూ వెనుకంజలో పడింది.
ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కష్టాలూ ఎదురుకావని, దాన్ని ఆదుకుంటా మని ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అందుకు ఆరుసూత్రాలను కూడా ప్రకటించారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ‘మనసా, వాచా, కర్మణా’ వాగ్దానంచేశారు. ఇప్పుడు ఆ మనసూలేదు....ఆ కర్మాలేదు. వాచకం మాత్రం మిగిలిపోయింది! నిరుడు మార్చి 1న వెలువడిన 71 పేజీల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నవ్యాంధ్రప్రదేశ్‌కు మరికొన్ని తాయిలాలు ప్రకటించింది. అయితే ఆ చట్టంలో ప్రధాని ప్రకటించిన వాగ్దా నాల జాడలేదు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో చట్టపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే మనసుంటే మార్గముంటుంద న్నట్టు... చట్టంలో మార్పులు చెయ్యవచ్చు, హామీలు నిలబెట్టుకోవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యవచ్చు.
అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014లో పరిశేష ఆంధ్ర ప్రదేశ్‌కు ఏఏ హామీలు ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం. చట్టంలోని పదమూ డవ షెడ్యూలులో పొందుపరచినవన్నీ అమలుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని సెక్షన్ 93 స్పష్టంచేసింది. పదమూడవ షెడ్యూలులో నవ్యాంధ్రప్రదేశ్‌కు సమకురుస్తామన్న సౌకర్యాలు:
- ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్, ఐఐఎస్‌ఇఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలను నెలకొల్పడం.
- అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)వంటి సూపర్ స్సెషాలిటీ ఆస్పత్రి, వైద్య విద్యా సంస్థలను ప్రారంభించటం.
- ట్రైబల్ యూనివర్సిటీని నెలకొల్పడం.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్థాపించటం.
- 2018 నాటికి మొదటి దశ పూర్తయ్యే విధంగా దుగ్గిరాజుపట్నాన్ని మేజర్ పోర్ట్‌గా చేయడం.
- విభజన జరిగిన తేదీ నుంచి ఆర్నెల్లలో వైఎస్‌ఆర్ జిల్లాలో సెయిల్ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి కావల్సిన అవకాశాలను పరిశీలించడం.
- ఐఓసీ లేదా హెచ్‌పీసీఎల్ నవ్యాంధ్రప్రదేశ్‌లో విభజన తేదీ నుంచి ఆర్నె ల్లలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కావలసిన అవకాశాలు పరిశీలించడం.
- ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణానికి పూనుకోవడం.
- విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం.
- కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం.
- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి దేశంలోని అన్ని నగరాలకూ రోడ్డు, రైలు రవాణా సదుపాయాల కల్పన.
ఇవిగాక సెక్షన్ 94లో మరికొన్ని హామీలిచ్చారు.
- రాష్ర్ట పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కావలసిన ఆర్థిక సౌకర్యా లను పన్ను రాయితీలతోసహా కల్పించడం.
- రాష్ర్టంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, భౌతిక, సామాజిక పర మైన సౌకర్యాలు కల్పించడం, చేయూతనివ్వటం.
- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అతిముఖ్యమైన రాజభవన్, హైకోర్టు, సెక్రటేరియేట్, శాసనసభ, శాసనమండలి, యితర మౌలిక సదుపాయాలకు ప్రత్యేకమైన ఆర్థిక సహాయం అందించటం.
- ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసం అవసరమైతే క్షీణించిపోయిన అటవీ ప్రాంతాన్ని అందుబాటులోనికి తేవడం.
సెక్షన్ 95 ప్రకారం నాణ్యమైన ఉన్నత విద్య రెండు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు అందుబాటులో ఉంచడానికి, రాజ్యంగంలోని 371 డి ననుసరించి ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, ఎయిడెడ్, అనెయిడెడ్ విద్యా సంస్థల్లోనూ... టెక్నికల్, వైద్య విద్యాసంస్థల్లోనూ పది సంవత్సరాల వరకూ ప్రస్తుతమున్న ప్రవేశ పద్ధతులే కొనసాగాలి. అయితే ఈ నిబంధనను ఇప్పు డు ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి- చట్టంద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలుపరచే విధంగా చూడటం. చట్టంలో పొందుపరచినవన్నీ హక్కులవుతాయి.
కనుక వాటిని సాధించుకునే దిశగా కృషి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమైతే...వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. చట్టంలో పొందుపరిచిన హామీలను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి నిరంతరం పాటు బడాల్సి ఉంటుంది. ఇక రెండోది- రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీ లనూ... మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచేలా చూడ టం. ఇందుకోసం ఆ చట్టానికి సవరణలు తీసుకురావాలి. అలా సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాల్లో అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులు వేలసంఖ్యలో ఉన్నాయి. వాటిని మొదటి దశలో పూర్తి చెయ్యాలి. ఉదాహర ణకు ఇళ్లు నిర్మించినా కిటికీలూ, తలుపులూ పెట్టనివి ఉన్నాయి. అలాగే, ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టినా మోటారు పంపులు అమర్చనివి ఉన్నాయి.
వంతెనలున్నా వాటిని అనుసంధానించే రోడ్లను చేపట్టకపోవడం, ఫ్లై ఓవర్లు అరకొరగా వదిలేయడం, చాన్నాళ్లక్రితమే శంకుస్థాపనలు పూర్తయినా నిర్మా ణాలు చేపట్టకపోవడం...ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిపైనా పెట్టిన పెట్టుబడులు వృథాగా మారాయి. ఈ విషయంలో శ్రద్ధపెట్టి పూర్తిచేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ఆచరణీయ ప్రణాళిక, మినీ ప్లాన్లు, మైక్రోప్లాన్లు వేసుకుని ముం దుకెళ్తే రాష్ట్రాభివృద్ధికి వీలు కలుగుతుంది. అది వేగవంతమవుతుంది. లేనట్ట యితే ఈ అయోమయ పరిస్థితి యిలాగే కొనసాగుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొలువు దీరిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయా?
(వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్)
ఫోన్: 9849085411