బీజేపీ వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ : లోక్‌సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రానున్న నేపథ్యంలో పార్టీ వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతలు సమావేశమవుతున్నారు. ఉదయం పదిన్నరకు పార్లమెంట్లో భేటీ కానున్న బీజేపీ సీనియర్ నేతలు కీలక సవరణలతోపాటు... ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేస్తే వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశముంది.
లోక్సభలో తెలంగాణ బిల్లుపై బీజేపీ తీరు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో మద్దతు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే ప్రభుత్వం తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఇరు ప్రాంతాలను సంతృప్తి పర్చాలని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన బిల్లులో ఈ అంశాలేవీ లేవని.. సీమాంధ్ర ప్రాంతానికి విధులు, నిధులు, అభివృద్ధి విషయంలో ప్రణాళికలకు సంబంధించి బిల్లులో స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ అగ్రనేతలు ప్రధానమంత్రి అనంతరం తేల్చిచెప్పారు. బిల్లులోని లోపాలను ఎత్తిచూపుతూ సీమాంధ్రకు న్యాయం కోసం సవరణల చిట్టాను విప్పారు. దీంతో బీజేపీ నేడు ఏవిధంగా వ్యవహరిస్తుందన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది.