రేపు ఢిల్లీలో కీలక ఘట్టాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభకు చేరిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీ వేదికగా సోమవారం కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో జరగనున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు బిజినెస్ షెడ్యూల్లో తెలంగాణ బిల్లు అంశం లేదు.
మంగళవారానికి సంబంధించి కూడా బిజినెస్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులోనూ తెలంగాణ బిల్లు ప్రస్తావన లేదు. అఖిలపక్ష సమావేశంలో చర్చ తర్వాత తుదిషెడ్యూలు ఖరారయ్యే అవకాశముందంటున్నారు. ఇందులో తెలంగాణ బిల్లుపై చర్చకు సంబంధించిన అంశం చేర్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం.
కాగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణకు స్పీకర్ మీరా కుమార్ ఆదేశించారు. విచారణ చేసి నివేదిక సమర్పించాలని పార్లమెంట్ నియమావళి కమిటీకి ఆదేశాలిచ్చారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి బహిరంగ ర్యాలీ, మహాధర్నాకు సమైక్యవాదులు సిద్ధమవుతున్నారు.