ఢిల్లీలో గరమ్ గరమ్ టీ
ఢిల్లీలో గరమ్ గరమ్ టీ
Published Tue, Feb 18 2014 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
నేడు లోకసభలో ‘టీ’ చర్చ
20న రాజ్యసభకు తెలంగాణ బిల్లు, చర్చ..
ఉభయ సభల్లోనూ మూజువాణితో సరి!
తెలంగాణ కేంద్రంగా చోటుచేసుకున్న పలు పరిణామాలతో సోమవారం హస్తిన మరింతగా వేడెక్కింది. విభజన బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ చర్చకు చేపట్టనుంది. దాన్ని గురువారం రాజ్యసభలో పెట్టేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఉభయసభల్లోనూ బిల్లు ఆమోదానికి కలసి రావాలంటూ బీజేపీ అగ్రనేతలను కేంద్ర మంత్రులు షిండే, జైరాం అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ అధినేతతో కూడా జైరాం భేటీ అయ్యారు. 18, 19 తేదీల్లో రెండు సభల్లోనూ బిల్లుకు ఆమోదముద్ర ఖాయమని అనంతరం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బిల్లును అడ్డుకునే యత్నాలకు సీమాంధ్ర నేతలు పదును పెంచారు. ఆ ప్రాంత కేంద్ర మంత్రులు అద్వానీతో సమావేశమై తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీ వారిని పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
మరోవైపు విభజనను అడ్డుకునేందుకు, ఈ విషయంలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో హస్తినలో జంతర్‌మంతర్ వద్ద సమైక్య ధర్నా జరిగింది. అనంతరం సమైక్యవాదులతో కలసి పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన వైఎస్ జగన్‌ను, వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకోవైపు విభజనను వ్యతిరేకిస్తూ రామ్‌లీలా మైదానంలో ఏపీఎన్జీవోల రెండు రోజుల ధర్నా సోమవారం ప్రారంభమైంది. కేంద్రం, కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని నేతలంతా తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం లోక్‌సభలో ఏం జరగనుందన్న అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది...
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీధుల్లో సమైక్యవాదులంతా ఉధృతంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం దూకుడు ఆపడం లేదు. విభజన బిల్లును ఆమోదించుకునే దిశగా చకచకా ముందుకు వెళుతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి మరో 4 రోజులే ఉండటంతో అంతకు ఒకరోజు ముందే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన ప్రక్రియను ముగించడానికి వ్యూహం సిద్ధం చేసింది. అందులో భాగంగా సమైక్యవాదులు ఎంతగా వ్యతిరేకించినా, విపక్షాల నుంచి మరెన్ని విమర్శలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో చర్చకు చేపట్టేందుకు సిద్ధమైంది. బిల్లు మంగళవారం చర్చకు రానుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
బిల్లుపై అభ్యంతరాలున్న వారు పార్లమెంటరీ పద్ధతుల్లో చర్చ సందర్భంగా వాటిని వ్యక్తం చేయవచ్చన్నారు. కనీవినీ ఎరగని గందరగోళం నడుమ 13వ తేదీన తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం తెలి సిందే. కేంద్రవర్గాలు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ముందుగా 3 ఇతర బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. ఆ వెంటనే విభజన బిల్లుపై చర్చ ప్రారంభించాల్సిందిగా స్పీకర్ మీరాకుమార్ కోరతారు. సభ సజావుగా సాగితే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటలదాకా చర్చ జరగవచ్చు. కాంగ్రెస్ తరఫున బిల్లుపై సోనియాగాంధీ ప్రసంగిస్తారు. సాధ్యమైనంత వరకు మంగళవారమే బిల్లుకు సభ ఆమోదం కూడా పొందేందుకు ప్రయత్నిస్తారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల తీవ్ర వ్యతిరేకత, ఆందోళన కొనసాగితే సభ బుధవారానికి వాయిదా పడవచ్చు. ఆ రోజూ అదే పరిస్థితి నెలకొంటే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం.
రాజ్యసభ విషయానికొస్తే... టీ-బిల్లుపై చర్చకు గురువారం 2 గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్లు చైర్మన్ హమీద్ అన్సారీ సోమవారం సభలోనే ప్రకటిం చారు. రాజ్యసభ వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చను ప్రారంభించి రాత్రి 7 గంటలకు ముగిస్తారు. రాజ్యసభలోనూ చర్చ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నందున అక్కడా మూజువాణి ఓటుతోనే ఆమోదించడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీలంటున్నారు. బిల్లు ఆమోదంకోసం అవసరమైతే పార్లమెంటు సమావేశాల్ని ఒకట్రెండు రోజులు పొడిగించే యోచనా ఉందంటున్నారు.
కాంగ్రెస్ సభ్యులకు విప్: పార్లమెంట్ సమావేశాలు తుది అంకానికి చేరుకోవడంతో రాబోయే 3 రోజులు అత్యంత కీలకమైనవిగా భావించిన కాంగ్రెస్ పెద్దలు సొంత పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. 18, 19, 20 తేదీల్లో కీలక బిల్లులున్నందున తప్పక ఉభయ సభలకు హాజరవ్వాలని లోక్‌సభ, రాజ్యసభ చీఫ్ విప్‌లు గిరిజా వ్యాస్, సుదర్శన్ నాచియప్పన్ పేర్కొన్నారు.
కమలనాథులేం చేస్తారు?
ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాము తెలంగాణకు అనుకూలమైనా సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాల్సిందేనని కొద్ది రోజులుగా పట్టుపడుతున్న కమలనాథులు ఇప్పటికే కొన్ని సవరణలను ప్రతిపాదించడం తెలిసిందే. మంగళవారమూ సభలో విభజన వ్యతిరేక ఆందోళనలు కొనసాగే అవకాశాలున్నందున కమలనాథులు ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. బిల్లు ఆమోదానికి అడ్డంకులు లేకుండా ‘సభా సమన్వయం’ సాధించడంలో భాగంగా మంత్రులు షిండే, జైరాం రమేశ్ సోమవారం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులతో పార్లమెంటు హౌస్‌లో 40 నిమిషాలు సమావేశమయ్యారు. బిల్లుపై అభ్యంతరాలు, పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. తాము ప్రతిపాదించిన ప్రధానమైన 9 సవరణలనూ బిల్లులో చేర్చాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సీమాంధ్రకు భారీ ఆర్థిక ప్యాకేజీ, తక్షణమే హైకోర్టు ఏర్పాటు, రెండేళ్లలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, పోలవరంతో పాటు పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకూ జాతీయ హోదా తదితరాలను బిల్లులో చేర్చాల్సిందని పేర్కొన్నట్టు సమాచారం. అంతేగాక బిల్లుపై సభల్లో చర్చ జరగాల్సిందేన ని, ఆందోళనల మధ్య మూజువాణి ఆమోదం పొందుతామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేసినట్టు తెలి సింది. ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలని అద్వానీ సూచించారు. తమ సవరణలను పరిగణన లోకి తీసుకోవాలన్నారు. తర్వాత వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ అదే చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా 100 మంది ఎంపీలు వెల్‌లోకొచ్చి ఆందోళన చేస్తే వారిలో 16 మందినే సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీని సంతృప్తి పరిచేందుకు కొన్ని సవరణల్ని కేంద్రం బిల్లులో చేర్చే అవకాశాలున్నాయి.
సోనియా ప్రసంగం: మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంట్‌లో విభజన బిల్లుపై మాట్లాడాలని భావిస్తున్నారు. ప్రసంగ పాఠాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోల్లో పొందుపరిచిన అంశంతో పాటు అందుకోసం పదేళ్లుగా చేసిన కృషి, పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ. 2009 డిసెంబర్ 9న కేంద్రం చేసిన తెలంగాణ ఏర్పాటు ప్రకటన తదితరాలన్నీ అందులో ఉంటాయంటున్నారు.
వెంకయ్యా... మద్దతివ్వండి!: సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సోనియా, బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఎదురుపడ్డారు. ‘టీ-బిల్లు పెడితే మద్దతిస్తామని గతంలో చెప్పారు కదా’ అని సోనియా ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. తాము తెలంగాణకు అనుకూలమేనని, సీమాంధ్రుల సమస్య పరిష్కారానికి తాము ప్రతిపాదించిన సవరణల్ని ఆమోదిస్తే కచ్చితంగా మద్దతిస్తామని ఆయన బదులిచ్చినట్టు తెలి సింది. బిల్లుకు తన మద్దతును సోనియా కోరారని, ముందుగా కాంగ్రెస్ ఎంపీల్ని కట్టడి చేసుకోవాలని సూచించానని వెంకయ్య మీడియాకు చెప్పారు.
Advertisement