లోక్‌సభలో మోదీకి ఘనస్వాగతం
లేచి నిలబడి అభినందించిన బీజేపీ ఎంపీలు
⇒ జై శ్రీరాం, భారత్‌మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లిన సభ
న్యూఢిల్లీ: బీజేపీ గెలుపు సంబరాలకు పార్లమెంటు కూడా వేదికైంది. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి బుధవారం పార్లమెంటుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ పార్టీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయన లోనికి అడుగుపెట్టగానే వారంతా లేచి నిలబడి, బల్లలు చరుస్తూ అభినందించారు. మోదీ తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా బల్లలు చరుస్తూనే ఉన్నారు. ‘మోదీ, మోదీ’, ‘భారత్‌మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో సభ రెండు నిమిషాలపాటు మారుమోగింది. బిజూ జనతా దళ్ సభ్యుడు బైజయంత్‌పండా కూడా బల్ల చరుస్తూ కనిపించారు. టీఆర్‌ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి.. మోదీ దగ్గరకెళ్లి కరచాలనం చేసి అభినందించారు. 10 నిమిషాల తర్వాత ప్రధాని సభ నుంచి వెళ్లి పోయారు.
‘గోవా, మణిపూర్‌ల’పై నిరసన
గోవా, మణిపూర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ ఉల్లంఘించిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విపక్ష కాంగ్రెస్ రాజ్యసభలో తీవ్ర నిరసన తెలిపింది. దీంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను, ప్రజాతీర్పును చోరీ చేశారని ఆరోపించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి మద్దతు పలికారు.
విద్యార్థి ఆత్మహత్యపై ఎఫ్‌ఐఆర్
జేఎన్‌యూ విద్యార్థి ముత్తు కృష్ణన్ ఆత్మహత్యపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు. ఎస్టీ, ఎస్సీలపై నేరాల నిరోధక నిబంధనలు, ఆత్మహత్య యత్నానికి పురిగొల్పడానికి సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించామని, ప్రతులను మృతుని కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కృష్ణన్ తోబుట్టువులకు ఉద్యోగం ఇవ్వాలన్న అతని తండ్రి విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కృష్ణన్ ఆత్మహత్యపై దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యనూ ప్రస్తావించాయి.
500 నోటు ముద్రణ వ్యయం రూ. 2.87
కొత్త రూ.500 నోటు ముద్రణకు రూ. 2.87 నుంచి రూ. 3.09 వరకు, రూ.2,000 నోటు ముద్రణకు రూ. 3.54 నుంచి రూ. 3.77 వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను తెచ్చేందుకు మొత్తం ఎంత ఖర్చవుతుందో చెప్పలేదు. ‘ప్రజల అవసరాల కోసం కొత్త 500, 2000 నోట్లను ఇంకా ముద్రిస్తున్నారు కనుక ఇప్పుడే మొత్తం వ్యయమెంతో చెప్పలేం’ అని ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభకు తెలిపారు.