* దిగువసభలో మెజార్టీ.. ఎగువసభలో మైనార్టీ
* కీలక బిల్లుల ఆమోదానికి ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకండ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించి లోక్‌సభలో పూర్తి ఆధిపత్యంతో అధికారం చేపట్టిన బీజే పీకి, ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి రాజ్యసభలో మాత్రం గడ్డుపరిస్థితి ఎదురు కానుంది. దిగువసభలో 545 సీట్లకుగాను సొంతంగానే 282 సీట్లను సాధించిన బీజేపీకి ఎగువసభలో మాత్రం 250 సీట్లకుగాను 42 మంది సభ్యులే ఉన్నారు.
మిత్రపక్షాలకు చెందిన 20 మంది సభ్యులను కలుపుకొన్నా బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ మాత్రం దక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం లోక్‌సభలో 44 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు పెద్దల సభలో 68 మంది సభ్యులు ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఏదైనా చట్టాన్ని ఆమోదింప చేసుకోవాలంటే చిన్నాచితకా, ప్రాంతీయ పార్టీల సభ్యుల మద్దతు బీజేపీకి తప్పనిసరి కానుంది.
ఆయా ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ మేరకు ఆయా ప్రాంతాలకు ప్రయోజనాలు చేకూర్చడమూ అనివార్యం కానుందని, ఇది బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ ఎంపీలను లోక్‌సభ ఎంపీలు, రాష్ట్రాల శాసన సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి.. ఆయా ప్రాంతీయ పార్టీలకూ కీలక ప్రాతినిధ్యం ఉంది.
రాజ్యసభలో ముఖ్య పాత్ర పోషించే ప్రాంతీయ పార్టీల్లో అన్నా డీఎంకేకు 10 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు 12 మంది, బీఎస్పీకి 14 మంది, ఎస్పీకి 9 మంది, బిజూ జనతాదళ్‌కు ఆరుగురు సభ్యులు ఉన్నారు. బడ్జెట్ బిల్లు వంటి వాటిని రాజ్యసభ తిరస్కరించినా.. లోక్‌సభ ఆమోదించుకోగలదు. కానీ 2011 నుంచీ పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ విద్యపై పర్యవేక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుల వంటి వాటిని ఆమోదింప చేసుకోవాలంటే మాత్రం ఉభయసభల ఆమోదం అనివార్యమని, ఇది బీజేపీని ఇరుకునపెట్టే విషయమేనని నిపుణులు చెబుతున్నారు.
రాజ్యసభలో బీజేపీకి కఠిన పరీక్షే!
Published Sat, May 31 2014 1:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement