న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో విపక్ష నేత, ఇతర నేతల ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష రాహుల్ గాంధీ ప్రసంగాన్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. అయితే దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్ దాడికి దిగింది. ప్రధాని మోదీ ప్రసంగమే తప్పుల తడకగా సాగిందని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని పేర్కొంటూ చాలా భాగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందిస్తూ.. ‘‘సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే ఏ సభ్యుడైనా సులభంగా తప్పించుకోలేరు. నియమాలు వాళ్లను అడ్డుకుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ఇప్పుడు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంలో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసింది.
‘‘2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు భారత రక్షణ దళాల్లో సరిపడా ఆయుధ సంపత్తి లేదని.. యుద్ధ విమానాలు అసలే లేవని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ, జాగ్వార్, మిగ్ 29, ఎస్‌యూ-30, మిరేజ్ 2000 లాంటి ఫైటర్ జెట్‌లు అప్పటికే ఉన్నాయి. అలాగే.. న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి.. పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చినట్లు ప్రధాని ప్రకటించుకున్నారు. దీనిని కూడా మేం సవాల్ చేస్తున్నాం.
అలాగే.. 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పడిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిమాచల్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది. కాంగ్రెస్‌పార్టీ మహిళలకు ప్రతీ నెలా రూ.8,500 ఇస్తుందనే తప్పుడు హామీ ఇచ్చిందని మోదీ మాట్లాడారు. కానీ, అది హామీ మాత్రమే. గెలిచి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అది నేరవేర్చాల్సిన విషయం. అలాంటప్పుడు అది అసత్య ప్రచారం ఎలా అవుతుంది?.
కేవలం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రసంగంలోనూ తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ మేరకు.. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ పేరిట ఈ లేఖ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వెళ్లింది. 115(1)వ ఆదేశం అమలు చేసి.. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల్లోని తప్పులు, తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని తొలగించేలా చూడాలని మాణిక్కం ఠాగూర్ లేఖలో కోరారు.
115(1) ఆదేశాల ప్రకారం.. మంత్రులుగానీ, ఇతర ఎంపీలుగానీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. అభ్యంతరం వ్యక్తం చేసే సభ్యులు స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు. మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల విషయంలో 115(1)ని అమలు చేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పీకర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment