The Rajya Sabha
-
గాంధీపై కట్జూ వ్యాఖ్యలకు రాజ్యసభ ఖండన
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్, సుభాష్‌చంద్రబోస్ జపాన్ ఏజెంట్ అంటూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను బుధవారం రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. జీరో అవర్‌లో ప్రతిపక్షం సూచనపై సభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన తీర్మానం మేరకు సభ పై విధంగా స్పందించింది. రాజ్యసభలో అధికార పార్టీ పక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ గాంధీజీపై కట్జూ వ్యాఖ్యలు ప్రతిపక్షంతో పాటు అందరినీ బాధించాయన్నారు. మహ్మాతుడు ఈ శకానికే గొప్ప మనిషి అని ప్రశంసించారు. మన దేశానికి స్వాతంత్య్రాన్ని ఆర్జించి పెట్టడంలో ఆయన కృషి ఎంతో శ్లాఘనీయమన్నారు. కట్జూకు మాజీ న్యాయమూర్తి హోదాలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
సెలెక్ట్ కమిటీకి గనుల బిల్లు
నిరసనల మధ్య రాజ్యసభలో బిల్లు న్యూఢిల్లీ: బీజేపీకి బలం లేని రాజ్యసభలో విపక్షాలు మరోసారి పంతం నెగ్గించుకున్నాయి. మంగళవారం గనులు, ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. బిల్లును నేరుగా ఆమోదింపజేసుకోవాలనుకున్న ప్రభుత్వ యత్నం విఫలమైంది. మెజారిటీ లేని కారణంగా విపక్షాల ఒత్తిడికి తలొగ్గి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష సవరణను ఆమోదిందించిన నిస్సహాయ స్థితి నుంచి తేరుకోకముందే ప్రభుత్వానికి పెద్దల సభలో మళ్లీ షాక్ తగిలింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య రాజ్యసభలో మంత్రి నరేంద్ర సింగ్ గనుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చకు ముందే విపక్షాలు బిల్లుపై అభ్యంతరం చెప్పాయి. దీన్ని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలా వద్దా అన్న అంశంపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. తమ వాదనలకు బలంగా అధికార, విపక్షాలు సభా నియమాలను చెప్పుకొచ్చాయి. ప్రభుత్వం దొడ్డిదారిన చట్టాలు తెస్తోందని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. నిరసన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో బిల్లును స్థాయీసంఘానికి పంపడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ సంఘానికి కాలపరిమితిని బుధవారం నిర్ణయిస్తారు. -
ప్రధాని ప్రకటన చేయాల్సిందే
మతమార్పిళ్లపై రాజ్యసభలో పట్టువీడని విపక్షం వీహెచ్ ఒకరోజు సస్పెన్షన్ సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిళ్లు న్యాయబద్ధమేనని ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీయే ఈ విషయమై రాజ్యసభలో ప్రకటన చేయాలన్న విపక్షాలు పట్టువీడలేదు. మూడో రోజూ ఈ విషయమై సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. బుధవారం కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యుల ఆందోళన కారణంగా సభ పలుమార్లు వాయిదాపడింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని, ప్రధాని వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మతమార్పిళ్లపై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతుండగా ప్రధాని మాత్రం స్పందించడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రధానమంత్రి, ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెనన్, కాంగ్రెస్ నేత అశ్వినీకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ఎంపీలు మతమార్పిళ్లపై చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని జోక్యం చేసుకుని ప్రకటన చేయాలని కోరారు. అయితే, కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు ఇదే డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభాపతి స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంలో ‘ప్రైం మినిస్టర్ కో బులావో’ అంటూ ఏకవచనంలో సంబోధించారని, అన్ పార్లమెంటరీ భాష వాడారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో చైర్మన్ నిబంధన 255 కింద వీహెచ్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిబంధన కింద చైర్మన్ సభ్యుడి పేరు చదివినప్పుడు ఆ రోజులో తదుపరి సమయం సభకు హాజరు కాకూడదు. ‘గుడ్‌గవర్నెన్స్’పై దద్దరిల్లిన లోక్‌సభ క్రిస్మస్ పండుగ రోజున పాఠశాలలను తెరిచి ఉంచాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని, సంఘ పరివార్ ఎజెండాను అమలు చేయాలని చూస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. 25న గుడ్గవర్నెన్స్పై వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఆ మేరకు వాటి వీడియోలు తీసి పంపాలని తెలుపుతూ వెలువడిన ఉత్తర్వులను కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ సభలో చదివి వినిపించారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధాన మిచ్చారు. క్రిస్మస్ సెలవు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. -
సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేత లేకుంటే విపక్షాల్లోని అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు ఈ కమిటీలో చోటు కల్పించేలా ఈ బిల్లుతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియ కొనసాగేలా మరో సవరణను బిల్లులో పొందుపరచింది. -
మార్పులు ఒప్పుకోం
ఉపాధి హామీపై రాజ్యసభలో ధ్వజమెత్తిన విపక్షాలు న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని మూసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి హామీపై సావధాన తీర్మానం ఇచ్చిన సీపీఐ ఎంపీ డి.రాజా మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరచి, ఆ తర్వాత స్వస్తి పలికే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పథకంలో మార్పులు చేసి అవినీతికి కేంద్రం దోహదం చేస్తోందని సీపీఐతోపాటు విపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో ఈ పథకం మంచి ఫలితాలను సాధించిందని, రూ.1.80లక్షల కోట్లు వేతనాల కింద చెల్లించామని, ఐదుకోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. -
‘ప్రతిపక్ష నేత’పై 4లోగా నిర్ణయం
కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ కొలువుదీరే జూన్ 4లోగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా మంజూరు అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిబంధనలు పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిం దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మం త్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వచ్చే 4లోగా ఈ అంశాన్ని పరిష్కరిస్తామని అన్నారు. మంత్రిగా పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎగువసభ (రాజ్యసభ)కు సంబంధించిన వ్యవహారాలను జవదేకర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అప్పగించారు. రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడం, అక్కడ తమ యుద్ధాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. పెద్దల సభలో శాసనపరమైన ఎజెండా ఆమోదం పొందడం కష్టమవుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై సమాధానమిచ్చారు. తగిన సంఖ్యా బలం ఉన్నందున కాంగ్రెస్‌కు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కడంలో ఎలాం టి సమస్యా లేనప్పటికీ.. లోక్‌సభకు సంబంధించి మాత్రం అవసరమైన 55 సీట్లకు గాను ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే లభించడంతో ఈ అంశం ప్రశ్నార్ధకమైంది. ప్రతిపక్ష నేత హోదా కింద ప్రయోజనాలు దక్కాలంటే చట్టపరమైన కొన్ని అవసరతలు ఉండా ల్సి ఉన్నప్పటికీ.. ఏకైక అతిపెద్ద పార్టీ నేతకు లేదా గ్రూపునకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టాలని స్పీకర్ భావించినట్టైతే అందుకు న్యాయపరమైన ఆటంకం ఏమీ లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా పార్టీ తరఫునుంచి ఎవరు ఉండాలనేదానిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. -
రాజ్యసభలో బీజేపీకి కఠిన పరీక్షే!
* దిగువసభలో మెజార్టీ.. ఎగువసభలో మైనార్టీ * కీలక బిల్లుల ఆమోదానికి ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకండ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించి లోక్‌సభలో పూర్తి ఆధిపత్యంతో అధికారం చేపట్టిన బీజే పీకి, ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి రాజ్యసభలో మాత్రం గడ్డుపరిస్థితి ఎదురు కానుంది. దిగువసభలో 545 సీట్లకుగాను సొంతంగానే 282 సీట్లను సాధించిన బీజేపీకి ఎగువసభలో మాత్రం 250 సీట్లకుగాను 42 మంది సభ్యులే ఉన్నారు. మిత్రపక్షాలకు చెందిన 20 మంది సభ్యులను కలుపుకొన్నా బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ మాత్రం దక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం లోక్‌సభలో 44 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు పెద్దల సభలో 68 మంది సభ్యులు ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఏదైనా చట్టాన్ని ఆమోదింప చేసుకోవాలంటే చిన్నాచితకా, ప్రాంతీయ పార్టీల సభ్యుల మద్దతు బీజేపీకి తప్పనిసరి కానుంది. ఆయా ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ మేరకు ఆయా ప్రాంతాలకు ప్రయోజనాలు చేకూర్చడమూ అనివార్యం కానుందని, ఇది బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ ఎంపీలను లోక్‌సభ ఎంపీలు, రాష్ట్రాల శాసన సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి.. ఆయా ప్రాంతీయ పార్టీలకూ కీలక ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో ముఖ్య పాత్ర పోషించే ప్రాంతీయ పార్టీల్లో అన్నా డీఎంకేకు 10 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు 12 మంది, బీఎస్పీకి 14 మంది, ఎస్పీకి 9 మంది, బిజూ జనతాదళ్‌కు ఆరుగురు సభ్యులు ఉన్నారు. బడ్జెట్ బిల్లు వంటి వాటిని రాజ్యసభ తిరస్కరించినా.. లోక్‌సభ ఆమోదించుకోగలదు. కానీ 2011 నుంచీ పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ విద్యపై పర్యవేక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుల వంటి వాటిని ఆమోదింప చేసుకోవాలంటే మాత్రం ఉభయసభల ఆమోదం అనివార్యమని, ఇది బీజేపీని ఇరుకునపెట్టే విషయమేనని నిపుణులు చెబుతున్నారు.