మార్పులు ఒప్పుకోం
ఉపాధి హామీపై రాజ్యసభలో ధ్వజమెత్తిన విపక్షాలు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని మూసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి హామీపై సావధాన తీర్మానం ఇచ్చిన సీపీఐ ఎంపీ డి.రాజా మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరచి, ఆ తర్వాత స్వస్తి పలికే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
పథకంలో మార్పులు చేసి అవినీతికి కేంద్రం దోహదం చేస్తోందని సీపీఐతోపాటు విపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో ఈ పథకం మంచి ఫలితాలను సాధించిందని, రూ.1.80లక్షల కోట్లు వేతనాల కింద చెల్లించామని, ఐదుకోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు.