
పొత్తులో భాగంగా ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్
కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం పేరు ఖరారైంది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన నెల్లికంటి సత్యం యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. 1969 జూన్ 6న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతమ్మ, పెద్దయ్య, భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు.
విస్తృతంగా చర్చించి ఎంపిక..
పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థా నం కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివా రం సాయంత్రం ప్రకటించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో సమావేశమై చర్చించింది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితోపాటు మరి కొందరు నేతలు ఎమ్మెల్సీ స్థానం కోసం ఆసక్తి చూపినా.. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, ప్రజా పోరాటాల్లో పాల్గొన్న తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. తెలంగాణ శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాంగ్రెస్‌కు సీపీఐ ధన్యవాదాలు
స్నేహధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment