satyam
-
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన బండి సంజయ్
-
వ్యవ‘సాయం’ పెరిగింది.. ఖర్చులూ పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో తెలంగాణలో వ్యవ‘సాయం’పెరిగిందని, దీనికి సమాంతరంగా ఆధునిక భూస్వామ్యం కూడా శరవేగంగా పెరుగుతోందని అంటున్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం. కార్పొరేట్ వర్గాలు, ధనిక రైతులు, బడా అధికారుల చేతుల్లో భూమి కేంద్రీకృతమవుతుంటే 80 శాతం ఉండే సన్న, చిన్నకారు, ఉపాంత రైతుల పరిస్థితి కూలీల స్థాయిలోనే ఉండిపోయిందన్నారు.పాలకులు, కార్పొరేట్ వర్గాల ఐక్యతకు తెలంగాణ రాష్ట్రం నిదర్శనంగా నిలుస్తోందని, ఈ వర్గాల ఐకమత్యం కారణంగా రాజకీయ అవినీతి పెచ్చురిల్లుతోందని చెప్పారు. ఈ రెండు అంశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన దుష్పరిణామాలని, వీటికి వీలున్నంత త్వరగా చెక్ పెట్టకపోతే భవిష్యత్ తెలంగాణ మనుగడ ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పిన అందె సత్యం గుజరాత్, పంజాబ్, హరియాణ, కేరళ రాష్ట్రాల అనుభవాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సామాజిక పరిణామాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే... ! భూములు పంచాలి... ఉద్యోగాలివ్వాలి పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో 14 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇప్పుడు తెలంగాణలోనే 25 మిలియన్ టన్నులు దాటింది. సాగునీటి ప్రాజెక్టుల వినియోగం, వర్షాలు, కాళేశ్వరం లిఫ్టు కారణంగా పెరిగిన భూగర్భజలాలు, మిషన్‌కాకతీయ లాంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. సుస్థిర పంటల సాగు వైపునకు రైతులను మళ్లించాల్సి ఉంది. పంటల మార్పిడి విషయంలో దశాబ్దకాలంగా ముందడుగు పడలేదు.వ్యవసాయ ఉత్పత్తులే కాదు సాగు ఖర్చు కూడా అంతే పెరిగింది. పెరిగిన సంపద క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు లబి్ధదారులను తయారు చేస్తున్నాయి తప్ప వారిని ఆర్థిక వ్యవస్థలో పాత్రధారులను తయారు చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో పేదల పాత్ర ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకోసం భూపంపిణీ, ఉద్యోగాల కల్పన జరగాలి. మెట్రోపాలిటన్‌లో మనమే ముందున్నాం గత పదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ లక్షణాలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్, ఇతర అభివృద్ధి రంగాలన్నీ సానుకూల దిశలోనే ప్రభావితమయ్యాయి. ఐటీ పరిశ్రమ కారణంగా రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఆధునికత సంతరించుకుంది. ఉపాధి పెరిగింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరపతి కూడా పెరిగింది. సంఘటిత ఉపా ధి కల్పనలో ఐటీ పాత్ర అమోఘం.నిర్మాణరంగంలో దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే మనమే ముందున్నాం. విద్యాసంస్థల సంఖ్య పెరగడం, నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల ఆసక్తి, తల్లిదండ్రుల ఆపేక్ష పెరగడంతో నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ మారింది. విద్యుచ్ఛక్తి సామర్థ్యం పెరిగిన ఫలితాలు మరో ఏడాదిలో అందుతాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు చోదకశక్తిగా మారనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాల కల్పన జరిగింది. శాంతిభద్రతలు గత పదేళ్లుగా బాగున్నాయి. మూలధన ఖర్చు పెరగాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి చైనా ఒక ఉదాహరణ. పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగితేనే సంఘటిత ఉద్యోగాలు పెరుగుతాయి. తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకోవాలి. ఏటా రూ. 2–3లక్షల కోట్ల ప్రతిపాదించి ఖర్చు చేస్తున్నా, మూలధన వ్యయం (ఆస్తుల కల్పనకు ఖర్చు) రూ.20–30వేల కోట్ల మధ్యనే ఉంటోంది. దీర్ఘకాలిక అభివృద్ధి నెమ్మదించడానికి ఈ ఖర్చు కారణమవుతుంది. విద్య కార్పొరేటీకరణ రోజురోజుకూ పెరిగిపోతోంది. వైద్య రంగం కూడా శరవేగంగా కార్పొరేట్ బాట పడుతోంది. నికర అప్పులతో పాటు పూచీకత్తులు కలిపి తెలంగాణ జీడీపీ, అప్పుల నిష్పత్తి 30 శాతం దాటుతోంది. రానున్న కాలంలో బడ్జెట్లో 20 శాతం అప్పులు, వడ్డీల చెల్లింపులకే కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మేరకు పెట్టుబడుల కల్పన జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకం. అలాగే అవినీతిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతుంది. భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి దేశంలోని వివిధ రాష్ట్రాల అనుభవం మన ముందుంది. గుజరాత్ స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, హరియాణలలో 85 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. పేద రాష్ట్రమైనా కేరళ మానవ వనరుల అభివృద్ధి ద్వారా పురోగమనంలో పయనిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల అనుభవాలకు మన స్థానికతను జోడించుకొని అభివృద్ధి చెందాలి. పరిశ్రమలను ఆకర్షించడంలో తమిళనాడు, మహారాష్ట్రలు కూడా విజయవంతమయ్యాయి. ఈ దిశగా పాలకులు ఆలోచించి భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి. ’అని ఆయన వెల్లడించారు. -
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ సత్యం
-
తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం..
బైర్రాజు రామలింగరాజు అలియాస్ సత్యం రామలింగరాజు అంటే 2009కు పూర్వం ఒక సంచలనం. 1987లో హైదరాబాద్‌లోని ఓ చిన్న భవనంలో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ 2008 నాటికి ఏటా రూ.12 వేల కోట్లు రెవెన్యూ సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆ 20 మంది ఉద్యోగులు కాస్తా 52000 వేల మంది అయ్యారు. దాంతో దేశంలోనే టాప్ 5 కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్ చోటు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఫార్చున్ 500 కంపెనీల్లో 187 స్థానాన్ని చేజిక్కించుకుంది. కేవలం రూ.10కు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ షేర్ధర ఏకంగా రూ.544కు పెరిగింది. దేశంలోనే కాకుండా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోనూ సత్యం కంప్యూటర్స్ కంపెనీ ట్రేడయ్యేది. ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలానుకున్న అప్పటి యువతకు రామలింగరాజు ఎంతో ఆదర్శంగా కనిపించేవారు. అంత సామ్రాజ్యాన్ని విస్తరించిన కంపెనీ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు చేసిన చిన్న తప్పిదంతో అంతా కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బైర్రాజు రామలింగరాజు సెప్టెంబర్ 16, 1954లో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జన్మించారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బీకామ్ చదివారు. తర్వాత అమెరికాలో ఓహయో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. 1977లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామలింగరాజు 22 ఏళ్ల వయసులో నందినిని వివాహం చేసుకున్నారు. రామలింగరాజు పలు వ్యాపారాల్లోకి ప్రవేశించారు. రూ.9 కోట్ల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ వంటి సంస్థలు స్థాపించాడు. ఈ వ్యాపారాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంవైపు మొగ్గుచూపారు. దాంతో మేటాస్ ఇన్ఫ్రా అనే సంస్థను స్థాపించారు. రామలింగరాజు 1987లో సికింద్రాబాద్‌లోని పీ అండ్ టీ కాలనీలో 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్స్ పేరుతో కంప్యూటర్ సేవల సంస్థను స్థాపించారు. 1991లో సత్యం కంప్యూటర్స్ జాన్ డీర్ అనే ఫార్చ్యూన్ 500 సంస్థ నుంచి ప్రాజెక్టు దక్కించుకుంది. 1992లో ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదయింది. 1998లో రామలింగరాజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యం కంప్యూటర్స్ సంస్థను 50 వేల ఉద్యోగులతో 50 దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. 1999లో రాజు అప్పుడే ప్రజాదరణ పొందుతున్న ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని సత్యం కంప్యూటర్స్‌కు అనుబంధ సంస్థగా సత్యం ఇన్ఫో వే (సిఫీ) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను తర్వాత వేగేశ్న సంస్థకు విక్రయించారు. సత్యం కుంభకోణం జనవరి 2009లో సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు సత్యం కంపెనీ పటిష్ఠంగా ఉందని మదుపరులను ఆకర్షించడానికి గత అక్టోబర్‌లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ‘ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ ఇంతలా పడిపోతున్నా సత్యం కంపెనీ భారీ లాభాల్లో ఉంది’ అని రాజు అన్నారు. అప్పటికే కొంతకాలంగా మేటాస్ ఇన్ఫ్రాలో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు మేటాస్ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. కంపెనీకి అన్ని లాభాలు వస్తున్నపుడు మేటాస్‌లో వాటా కొనుగోలు చేయచ్చుకదా అనే ప్రశ్నలు మదుపరుల్లో ఎక్కువయ్యాయి. డిసెంబర్ 2008లో మేటాస్ కొనుగోలు ప్రయత్నం విఫలం కావడంతో భారతీయ పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ పాలనపై ఆందోళన మొదలైంది. సత్యం షేరు ధరపడిపోయింది. జనవరి 2009లో సత్యం కంపెనీ బ్యాలెన్స్‌షీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించానని రాజు ఒప్పకుంటూ లేఖ రాశారు. 2003–07లో సత్యం బ్యాలెన్స్ షీట్‌లోని మొత్తం ఆస్తులు వాస్తవ విలువ కంటే మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల అకౌంటింగ్ మోసాన్ని అంగీకరించారు. ఒక చిన్న అబద్ధం.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తప్పు చేయడం.. ఇలా చేస్తూనే పోయామని ఆయన తన లేఖలో తెలిపారు. బ్యాలెన్స్ షీట్లో తెలిపిన లాభాలు, వాస్తవ లాభాల్లో చాలా తేడాలున్నాయి. 2003 నుంచి 2007 మధ్య కాలంలో ప్రతి త్రైమాసికంలో అధికంగానే చూపించామని చెప్పారు. ఏళ్ల గడుస్తున్న కొద్దీ అది పెరుగుతూ పోయిందని తెలిపారు. ఆ మధ్యలో కంపెనీలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దానికితోడు 2008 ద్రవ్యోల్బణ ప్రభావంతో కంపెనీ కుప్పకూలిందని చెప్పారు. కొన్నిసార్లు నష్టాల్లో ఉన్న కంపెనీ త్రైమాసిక ఫలితాలను మెరుగ్గా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇది పులిపై స్వారీ చేస్తూ దానికి బలవుకుండా ఎలా దిగాలో తెలియనట్లుగా ఉందని రాజు వివరించారు. విచారణ సాగుతోందిలా.. రాజు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్యం షేర్లలో వ్యాపారం చేయడానికి డమ్మీ ఖాతాలను ఉపయోగించారు. నిధులను పక్కదారి పట్టించేందుకు ఈ ఖాతాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ నగదు నిల్వలను రూ.7వేల కోట్లకు పెంచినట్లు రాజు అంగీకరించారు. జనవరి 2009న సత్యం బోర్డు నుండి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం సత్యం సంస్థ నిర్వహణను తాత్కాలికంగా కొందరు అధికారులకు అప్పచెప్పింది. తర్వాత 2009 ఏప్రిల్‌లో వేలం ప్రక్రియ నిర్వహించింది. దీనిలో టెక్ మహీంద్రా సత్యం కంపెనీని గెలుచుకుంది. దాంతో మహీంద్రా సత్యంగా పేరు మార్చింది. రాజు, అతడి సోదరుడు కంపెనీ ఎండీ బి.రామరాజును వీఎస్కె కౌముది నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో భాగస్వాములైన రాజు కుటుంబ సభ్యులకు చెందిన 44 ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. 2009 సెప్టెంబర్‌లో రాజు చిన్నపాటి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. రోజుకు ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని, ప్రస్తుత సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను 26 అక్టోబర్ 2010న సుప్రీంకోర్టు రద్దు చేసి, నవంబర్ 2010లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సకాలంలో అభియోగాలను దాఖలు చేయడంలో విఫలమైనందున సుప్రీంకోర్టు నవంబర్ 2011న రాజుకు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ చట్టం ప్రకారం నిందితుడిపై 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంటుంది. 2013 అక్టోబర్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాజుతో పాటు మరో 212 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేట్ ముసుగులో ఆదాయాన్ని దారి మళ్లించి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపింది. 2015 ఏప్రిల్‌లో రామలింగ రాజు అతని సోదరులకు ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5.5 కోట్ల జరిమానా విధించారు. 2015 మేలో దోషులుగా నిర్ధారించిన నెలలోపే రామలింగరాజు, మిగతా వారందరికీ హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రాజు, అతడి సోదరునికి బెయిల్ కోసం రూ.10 లక్షలు, ఇతర దోషులకు రూ. 50 వేలు నిర్ణయించింది. 2018 జనవరిలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ డైరెక్టర్లు, ఉద్యోగులకు సహకరించినందుకు గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్హౌస్ను సెబీ దేశంలోని కంపెనీల్లో ఆడిట్ చేయకుండా రెండేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు సెబీ తాజాగా 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఈ మొత్తాన్ని 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2000-2008 వరకు దాతృత్వ కార్యక్రమాలు.. బైర్రాజు ఫౌండేషన్ రామలింగరాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం రాజు, అతడి సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు కలిసి జులై 2001లో బైర్రాజు ఫౌండేషన్ స్థాపించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాల్లో 200 గ్రామాలను దత్తత తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, ప్రాథమిక విద్య, అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి వంటి 40 విభిన్న కార్యక్రమాలను అందించింది. అత్యవసర నిర్వహణ, పరిశోధనా సంస్థ (EMRI 108) ఆగస్టు 2005లో రాజు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (EMRI 108) పేరుతో 24X7 అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర సేవలను అందించేలా ఉచిత ఫోన్ నంబరు సాకర్యం కల్పించారు. మొదట్లో కేవలం 75 అంబులెన్స్‌లతో ప్రారంభమైన ఎమ్రీ ప్రస్తుతం 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,697 అంబులెన్స్‌లకు విస్తరించింది. రోజుకు 26,710 అత్యవసర సేవలు అందిస్తోంది. ఆరోగ్య నిర్వహణ, పరిశోధన సంస్థ (HMRI 104) సత్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 2007లో హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (HMRI 104) సేవలు ప్రారంభించారు. అర్హత కలిగిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సమాచారం అందుబాటులో లేని గ్రామీణ పేదల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్ హీరో నాంది ఫౌండేషన్ 1998లో నాంది ఫౌండేషన్‌ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన వ్యాపార సంస్థల అధిపతులైన కె.అంజి రెడ్డి-డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రమేష్ గెల్లి-గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వ్యవస్థాపకులు, బైర్రాజు రామలింగరాజు-సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్, కె.ఎస్.రాజు నాగార్జున గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్లతో కలిపి దీన్ని రూపొందించారు. దీని వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను పెంచాలని నిర్ణయించారు. దాంతో సమాజంలోని పేద, అట్టడుగు వర్గాల ప్రజల్లో అక్షరాస్యత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పాఠశాలలలో ప్రతిరోజూ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించినట్లు సమాచారం. -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్‌లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
43 ఏళ్లకి వచ్చావా సత్యంరెడ్డి..! చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనం
మిర్యాలగూడ: ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు సొంతింటికి దూరంగా ఉన్న ఓ మావోయిస్టు నేత ఇన్నేళ్లకి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గజ్జల సత్యంరెడ్డి అలియాస్ గోపన్న పీపుల్స్‌వార్ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేశారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1980లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు కీలకంగా పని చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించిన సత్యంరెడ్డి 26 ఏళ్లు అడవిలో ఉండి.. 17 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీసులు మోపిన అన్ని కేసులనూ కోర్టులు కొట్టివేయడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తమ్ముడితో కలిసి సొంత ఊరైన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సత్యంరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అజ్ఞాతంలో ఉండగానే సత్యంరెడ్డి తోటి పార్టీ సభ్యురాలిని వివాహం చేసుకోగా ఆమె ఎన్కౌంటర్లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియరాలేదు. సత్యంరెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరిని సందర్శించి.. చిన్నప్పుడు తాను తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి గుర్తుచేసుకున్నారు. తాను జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన చెందారు. అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబసభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగపూరిత వాతావరణంలో కంటతడిపెట్టారు. ఇక మీదట తన జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లేది లేదని సత్యంరెడ్డి చెప్పారు. -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా
దేవరాజ్, సోనాక్షీ వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ సత్యం’. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ–‘‘దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు’’ అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్. ‘‘ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ’’ అన్నారు మధు గోపు. -
టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోకి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యం మరణ వార్తతో టాలీవుడ్‌లోని ప్రముఖులంతా షాక్‌కు గురవుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సత్యం మరణవార్త విని పూజా హెగ్డె భావోద్వేగానికి గురైంది. ‘మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేసింది. కాగా, సుధీర్ఘ సీనీ కెరీర్లో కోడైరెక్టర్ సత్యం ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశాడు. రాజమౌళి-నితిన్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సై’కి చీఫ్ కో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. అలాగే మగధీర, మర్యాద రామన్న లాంటి సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. త్రివిక్రమ్ తెరకెరక్కించిన ‘అల..వైకుంఠపురంలో’కి కో డైరెక్టర్‌గా పనిచేశాడు. విటితో పాటు శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు. Sad to hear about the passing of one of my Co directors Satyam Garu, worked with him in 3 films Aravindha, Sakshyam and Ala Vaikunta. Sending his family loads of love and light in these tough times 😞🙏🏻 pic.twitter.com/gCOse1rXAg — Pooja Hegde (@hegdepooja) April 17, 2021 Shell Shocked to Hear This ... #Sathyamgaaru A Very fine Gentleman A Great Human. He is a Man of Trust & loyalty Very Aggressive Person on the Sets follows up Artists and Technical team on Time 🥺 Sir We Really Miss u Sir . Strength to the family May his soul rest in Peace #Rip pic.twitter.com/flbsmZNEZp — thaman S (@MusicThaman) April 17, 2021 చదవండి: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత హాస్యనటుడు వివేక్ మృతి.. తమిళనాట దిగ్భ్రాంతి -
‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’
సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాక శాస్త్ర ప్రావీణ్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వికాస్. లాక్డౌన్ నేపథ్యంలో ఈ స్టార్ చెఫ్ పేదలకు తన వంతు సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వికాస్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలయ్యింది. ‘‘స్ట్రీట్ బైట్’ యూట్యూబ్ చానెల్ ద్వారా నాకు మాస్టర్ చెఫ్ సత్యం పరిచయం అయ్యారు. ఈ చానెల్లో వచ్చిన సత్యం గారి వీడియో చూసి నేను దిబ్బ రొట్టె చేయడం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలో నేను నా గురువు సత్యం గారికి గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాను. దయచేసి ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి అంటూ వికాస్ ట్వీట్ చేశారు. URGENT- Plz Share-Andhra Pradesh ThankU @street_byte 4 introducing me 2 MasterChef Satyam💕 I learnt technique of Dibba Roti by watching him years ago Plz help me reach out to him asap This is the true heritage of our country and we have to protect these treasures. #GuruDakshinā pic.twitter.com/rlmZrfFolo — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్ వేలాది లైక్‌లు, షేర్లు సంపాదించింది. అంతేకాక 24 గంటల్లోనే సదరు సత్యం వివరాలను రీట్వీట్ చేశారు ట్విటర్ ఫాలోవర్లు. తన గురువు గారి వివరాలు తెలియజేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వికాస్ ఖన్నా. Thank you all. We have found MASTERCHEF Satyam,72 who taught me Dibba Roti technique (thru youtube) Need trustworthy source to deliver ration to Yeagi Ravithi Satyanarayana Near Satya hospital Deavuni Thota Palakollu, West Godavari District Andhra Pradesh 534260 info@vkhanna.com pic.twitter.com/JVy9r1wZ9T — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 -
స్వరణీయం
‘భలే చాన్సులే భలే చాన్సులే’ అంటూ ఇల్లరికంలో ఉన్న మజాను తన గొంతుతో మన కళ్ల ముందుంచినా... ‘సరదా సరదా సిగరెట్టు’ అని పాడుతూ ధూమపానం అనర్థాల గురించి హెచ్చరించినా... ‘భళి భళి భళి భళి’ దేవా అంటూ తత్త్వాన్ని బోధించినా...‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ అంటూ పేకాట గురించి సరదాగా వాపోయినా...‘వివాహ భోజనంబు’ పాట చెవిన పడ్డా, మాధవపెద్ది సత్యం స్వరం మన చెవులలో ఇంపుగా వినిపిస్తుంది. నేడు మాధవపెద్ది వర్థంతి. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు ఆయన పిల్లలు నాగలక్ష్మి, వెంకటనారాయణ మూర్తి. నాగలక్ష్మి: నాన్నగారు ఆ రోజుల్లో వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్నా, చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడేవారు. ఆర్భాటాలు, విలాసాలు ఆయనకు నచ్చేవి కాదు. మమ్మల్ని కూడా అతి సామాన్యుల్లాగే పెంచారు. జీవితంలో అన్నీ తెలుసుకోవాలని చెప్పేవారు. కష్టపడితే ఫలితం వస్తుందన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన వ్యక్తి మా నాన్న. మూర్తి: నాన్నగారు బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టారు. మా అమ్మ ప్రభావతి. వాళ్లది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. నాన్నగారికి పేకాట అంటే బాగా ఇష్టం. అలాగని అది డబ్బులకు ఆడే వ్యసనం కాదు. ఇంట్లో అందరం కలిసి సరదాగా ఆడుకోవటానికి ఇష్టపడేవారు. చెన్నై టి–నగర్లో మా పక్కింట్లోనే పెద్దనాన్న గోఖలే గారి ఇల్లు. పెద్దనాన్న, దొడ్డమ్మ అందరూ కలిసి ఆడుకునేవారు. పేకాట ఉంటే నాన్నకు ఇంకేమీ అక్కర్లేదు నాగలక్ష్మి: నాన్నకి ‘నేను ఏదో సాధించాను’ అని కించిత్తు కూడా గర్వం ఉండేది కాదు. మన కర్తవ్యం మనం నిర్వహించాం అనుకోవడం ఆయన సిద్ధాంతం. తనకు వచ్చిన గౌరవ పురస్కారాలను ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు. కారు కూడా ఎక్కేవారు కాదు. మాయాబజార్లో నాన్న పాడిన ‘వివాహ భోజనంబు’ పాట ‘సాంగ్ ఆఫ్ ద మిలీనియమ్’గా ఎంపికయినా ఏ మాత్రం గర్వించలేదు. ఆయన సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ విజిటింగ్ కార్డు కూడా ఉండేది కాదు. మూర్తి: ఆ రోజుల్లో సినిమా వాళ్లని చూడటం ఒక క్రేజ్. అభిమానులు బస్సులు వేసుకుని మరీ చెన్నై వచ్చేవారు. ఇలా కొందరు నాన్నగారిని చూడటానికి వచ్చే సమయానికి, నాన్న మా తోటలోని గడ్డిని తీస్తున్నారు. వారిని చూసి ఆయన మారుమాట్లాడకుండా ఇంటి వెనుకవైపుకు వెళ్లి చేతులు కడుక్కుని, ముందువైపునుంచి వచ్చారు. వారు ఆశ్చర్యపోతుంటే ‘ఇంటిపని చేసుకోవడం నాకు అలవాటు!’ అన్నారు సింపుల్‌గా. ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేసేవారు. నాగలక్ష్మి: ‘అపస్వరమే తెలియని గాయకుడు మా బాబాయ్’ అని నాన్న గురించి ఎస్. పి. బాలు అన్నారు. నాన్న సంగీతం పెద్దగా నేర్చుకోలేదు. తన పెదనాన్న వెంకటరామయ్యగారి దగ్గర పద్యాలతో ప్రభావితులయ్యారు. పాట రికార్డింగ్ పూర్తయ్యి ఇంటికి రాగానే ఒక బైండ్ పుస్తకం తీసుకుని, అందులో ఆ రోజు పాడిన పాట సాహిత్యం, అలాగే ఆ పాట ఏ శృతిలో, ఏయే గాయకులతో, ఎవరి సంగీత దర్శకత్వంలో, ఏ నటుడికి పాడారు.. వంటి విషయాలన్నీ రాసుకునేవారు. ఆ తరవాతే భోజన ం. మూర్తి: నాన్నగారు నాటకాలలో కూడా నటించేవారు. నాటకం పూర్తయ్యాక, పాటలు పాడేవారు. అలాగే రైలులో సెకండ్ క్లాసులోనే ప్రయాణించేవారు. గోంగూర పులుసు, వెన్నపూస, ఉల్లిపాయ కలిపి తినేవారు. పండుగకి గారెలు కావాలనేవారు. తెలుగు వంటలంటేనే ఇష్టం. నాగలక్ష్మి: అందరం కలిసి కూర్చుని భోజనం చేయటానికి ఇష్టపడేవారు. ఇంట్లో ఉన్నప్పుడు నలుగురం పీటల మీద కూర్చుని తినేవాళ్లం. కుండలో నీళ్లు మాత్రమే ఇష్టపడేవారు. మూర్తి: మా అక్కని అస్సలు కొట్టేవారు కాదు. నన్ను మాత్రం రెండుసార్లు కొట్టారు. ఒకసారి నేను సర్కస్‌కి వెళ్లొచ్చి, తాళ్లు పట్టుకుని వేలాడి కిందపడ్డాను. గడ్డం కింద దెబ్బ తగిలింది. నా అల్లరి భరించలేక గట్టిగా ఒక్కదెబ్బ వేశారు. మరోసారి షాపింగు కోసం పాండీ బజార్‌కి వెళ్దామన్నారు. నేను బీచ్‌కి వెళ్దామని ఏడ్చాను. అంతే! నా వీపు పగిలింది (నవ్వు) నాగలక్ష్మి: నాన్నకు క్రమశిక్షణ అంటే ప్రాణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాన్న చెప్పిన మాటలను నేటì కీ ఆచరిస్తూనే ఉన్నాను. మూర్తి: ఘంటసాలగారిని మాస్టారూ అని పిలిచేవారు. ఆయన నాన్నను ఉరై అనేవారు. అలాగే నాన్నగారు ఎస్వీ రంగారావుగారి కోసమే పుట్టారేమో అని అందరూ అనుకునేవారు. ఒకసారి నాన్న, నేను ఎస్వీ రంగారావుగారి ఇంటికి వెళ్లాం. కబురు పంపగానే, ఆయన వెంటనే మమ్మల్ని పైకి రప్పించారు. నన్ను చూడగానే‘ఉరై డింభకా ఇలా కూర్చోరా’ అని ప్రేమగా ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. నాన్నగారంటే ఆయనకు ఎంతో గౌరవం. నాన్న జీవితమంతా సంబరంగా, అర్థవంతంగా గడిచిపోయింది. ఏ ప్రభుత్వమూ నాన్నగారికి అవార్డులు ఇవ్వకపోయినా బాధపడలేదు. 2006లో నేను అందుకున్న కలైమామణి పురస్కారాన్ని నాన్నకి అంకితం చేశాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ, ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల మూర్తి: నా పేరు వెంకటనారాయణమూర్తి. ఎంవిఎన్‌మూర్తి అంటారు. ముద్దుగా బాజీ అని పిలుస్తారు. నేను బి.ఎస్సీ కెమిస్ట్రీ చదివాను. ఎయిర్‌లైన్స్ కోర్సు చేశాను. జర్మనీ నేర్చుకున్నాను. వెంపటి చినసత్యంగారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. పాతికేళ్లుగా శివ ఫౌండేషన్ పేరుతో డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. 1999లో అమ్మ, 2000లో నాన్న మరణించారు. అమ్మానాన్నల పేరు మీద హృదయాంజలి సంగీత విభావరిని 18 మంది గాయనీ గాయకులతో పాడించాను. బాలమురళి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రస్తుతం వారి పేరు మీద ‘మాధవపెద్ది సత్యం – మాధవపెద్ది ప్రభావతి’ పురస్కారాలు అందిస్తున్నాను. త్వరలో నాన్నగారి పుస్తకం ఆవిష్కరించాలనుకుంటున్నాను. నాగలక్ష్మి: బి.ఏ. హిస్టరీ చదివాను. పెళ్లయ్యాక బి.ఈడి చేశాను. మావారు ఉండవల్లి రవికుమార్ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశారు. వైజాగ్‌లో ఒక కాన్వెంట్లో కాలక్షేపానికి పనిచేశాను. నాన్నకి నేనంటే కొండంత ప్రేమ. కొండ మీద కోతిని అడిగినా తెచ్చేవారు. నో అనే వారు కాదు. కంచంలో అన్నీ ఆయనే వడ్డించి అన్నానికి పిలిచేవారు. నాన్నగారి చివరి రోజులలో హాస్పిటల్‌కి రోజూ వెళ్లి కూర్చునేదాన్ని. అలాగైనా ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నాను. అక్కడ కూడా ఆయన నాతో ఏమీ చేయించుకోలేదు. -
ఆపరేషన్ వశిష్ట సక్సెస్
-
ఒడ్డుకు ‘వశిష్ట’
సాక్షి, కాకినాడ/దేవీపట్నం/రంపచోడవరం: నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న అన్వేషణకు తెరదించుతూ రాయల్ వశిష్ట బోటు మంగళవారం ఒడ్డుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్స్ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. నీట మునిగిన రాయల్ వశిష్ట బోటులో 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆపరేషన్ ఇలా .. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికి తీసేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ నిర్వాహకుడు ధర్మాడి సత్యానికి రాయల్ వశిష్ట వెలికితీత పనులను రూ. 22.70 లక్షలకు అప్పగించారు. ప్రమాదానికి గురైన సమయంలో గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కచ్చులూరు మందం వద్ద ఆ సమయంలో గోదావరిలో 300 అడుగుల లోతు నీరు ఉంది. ధర్మాడి బృందం 25 మంది సభ్యులతో సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి జారిపోయినా పట్టు వీడలేదు. పలు దఫాలు విఫలమైనా ప్రయత్నాలు కొనసాగించింది. ధ్వంసమైన బోటు... మట్టి, ఒండ్రులో చిక్కుకుపోవడంతో సోమవారం బోటు పైకప్పు మాత్రమే ఊడి వచ్చింది. దీంతో మంగళవారం మరోసారి ప్రయత్నించారు. బోటు పంటుకు ఇనుప తాడు కట్టారు. ఆరుగురు గజ ఈతగాళ్లు బోటు చుట్టూ తిరిగి వెనుక భాగంలో ఉన్న ఫ్యాన్‌కు లంగరు వేశారు. అనంతరం పొక్లెయిన్ సాయంతో భారీ ఇనుప తాడు ద్వారా రాయల్ వశిష్ట బోటును గోదావరి నుంచి గట్టుకు తీసుకురాగలిగారు. అయితే ప్రమాదానికి గురైన బోటు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతో దుర్వాసన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మాడి సత్యంతోపాటు కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ కచ్చులూరు వద్దే ఉండి బోటు వెలికితీత పనులును పర్యవేక్షించారు. దారి కూడా లేని చోటుకు భారీ యంత్రాలు.. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికితీత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులను వినియోగించారు. సీఎం జగన్ స్వయంగా ప్రతి రోజూ సహాయక చర్యలపై ఆరా తీస్తూ వచ్చారు. మంత్రులను పంపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. దారి కూడా లేని కచ్చులూరు మందానికి భారీ క్రేన్ తరలించే ఏర్పాట్లు చేశారు. సీఎం వచ్చి మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. చివరి మృతదేహం లభ్యమయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సైతం వెంటనే సమకూర్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పలకరించి కొండంత ధైర్యాన్నిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించారు. ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కష్టమే అయినా సమష్టిగా సాధించాం ‘ఆరంభంలో రాయల్ వశిష్ట బోటు వెలికితీత కష్టంగా అనిపించింది. తొలుత ఐరన్ రోప్ గోదావరిలో తెగిపోయింది. లంగర్లు, ఐరన్ రోప్‌లతో ఉచ్చు వేసి పలుమార్లు లాగడంతో నది అడుగు భాగంలో ఉన్న బోటు కొద్దికొద్దిగా ఒడ్డు వైపు వచ్చింది. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. తరువాత చేపట్టిన ఆపరేషన్‌లో ప్రైవేట్ డైవర్లను రంగంలోకి దించాం. మూడు రోజుల పాటు నదిలోకి దిగి బోటుకు రోప్ కట్టడంలో విజయం సాధించాం. బోటు ఆపరేషన్‌కు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. అధికారులు, బృందం సభ్యులు, విశాఖ డైవర్ల సమష్టి కృషి ఫలితంగా బోటును ఒడ్డుకు తీసుకు రాగలిగాం’ – ధర్మాడి సత్యం (బాలాజీ మెరైన్స్ యజమాని) ఇప్పటిదాకా 46 మృతదేహాలు లభ్యం రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. అందులో 39 మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. తాజాగా బోటు వెలికితీత సమయంలో 7 మృతదేహాలు లభించాయి. మరో ఐదు మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది. శభాష్ కలెక్టర్.. మురళీధర్‌రెడ్డిని అభినందించిన సీఎం రాయల్ వశిష్ట బోటు వెలికితీత, సహాయక చర్యల పర్యవేక్షణలో చురుగ్గా వ్యవహరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ మేరకు సీఎం మంగళవారం కలెక్టర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ఆ నిర్ణయమే కీలకం! రంపచోడవరం: గతంలో పలు చోట్ల నీట మునిగిన బోట్లను వెలికి తీసిన అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం రాయల్ వశిష్ట బోటు వెలికితీతను సవాల్‌గా తీసుకుంది. వెలికితీత ఆపరేషన్ 13 రోజులు కొనసాగింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం బోటు వెలికితీతకు అనుకూలంగా మారింది. 50 అడుగుల లోతులో ఉన్న బోటును ఐరన్ రోప్‌తో లాగే ప్రయత్నం తొలుత సఫలం కాకపోవడంతో విశాఖపట్నం నుంచి డైవర్స్‌ను రప్పించారు. డైవర్స్ నదీ గర్భంలోకి వెళ్లి బోటు అడుగు భాగంలో ఇనుప రోప్‌లు కట్టాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించడం ఫలితాన్ని ఇచ్చింది. ఆపరేషన్ ఇలా... - సెప్టెంబర్ 15: రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయింది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ సహాయ చర్యలకు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హెలికాప్టర్లు, నేవీ, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. - సెప్టెంబర్ 16: ప్రమాద స్థలాన్ని సీఎం వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతులకు నివాళులు అర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. - సెప్టెంబర్ 18: కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం దేవీపట్నం చేరుకుని బోటులో కచ్చులూరు మందం వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలించింది. గోదావరి వడి ఎక్కువగా ఉండడంతో బోటు వెలికితీత ప్రక్రియకు దిగలేదు. - సెప్టెంబర్ 30: బోటు వెలికితీతకు ఆపరేషన్ రాయల్ వశిష్టను ప్రారంభించారు. భారీ ఇనుప తాళ్లు, లంగర్లు సిద్ధం చేసుకున్నారు. - అక్టోబరు 4: బోటు ఉందని గుర్తించిన ప్రాంతంలో 4 రోజులపాటు లంగర్లు వేసి తెగిపోతున్నా ప్రయత్నం కొనసాగించారు. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. - అక్టోబర్ 15: ధర్మాడి బృందం తిరిగి దేవీపట్నం చేరుకుంది. ఈనెల 16న రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ –2 తిరిగి ప్రారంభించి ఆచూకీ గుర్తించారు. మొదటి రోజు ఐరన్ రోప్ ఖాళీగా రావడంతో రెండో రోజు బోటు మునిగిన ప్రాంతంలో ఐరన్ రోప్‌ను ఉచ్చుగా వేశారు. - అక్టోబర్ 18: బోటు ముందు భాగంలోని రైలింగ్ ఊడి వచ్చింది. - అక్టోబర్ 19: బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన రోప్ జారిపోయింది. నదీ గర్భంలో బోటుకు బలమైన రోప్‌ను బిగిస్తేగానీ వెలికి తీసే పరిస్ధితి లేదని ధర్మాడి నిర్ధారణకు వచ్చారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది డైవర్స్‌ను రంగంలోకి దింపారు. - అక్టోబర్ 20: బోటు ముందు భాగం ఒడ్డువైపునకు 40 అడుగులు, వెనుకభాగం నదివైపు 70 అడుగుల లోతులో పక్కకు ఒరిగి ఒడ్డు ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు డైవర్స్ గుర్తించారు. - అక్టోబర్ 21: బోటుకు ఐరన్ రోప్ కట్టి ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేయగా ముందు భాగం కొద్దిగా మాత్రమే ఊడి వచ్చింది. - అక్టోబర్ 22: బోటు కింది భాగానికి రోప్‌లు వేసి లాగి ఒడ్డుకు చేర్చారు. -
కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..
సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు. కాగా రాయల్ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. -
సుపారీ ఇచ్చింది సత్యమే..
సాక్షి, హైదరాబాద్: స్టీల్ వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్‌ను హత్య చేయించింది తానేనని పోలీసుల అదుపులో ఉన్న కోగంటి సత్యం అంగీకరించాడు. ఈ హత్యకు విజయవాడలోని కామాక్షి స్టీల్స్‌కు సంబంధించిన వివాదమే కారణమని తేలింది. ఈ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకోవడంతో మరింత ముదిరింది. సెటిల్మెంట్ చేసుకున్న డబ్బు ఇవ్వకపోవడం, టీడీపీ నేతల మద్దతుతో కేసులు పెట్టి వేధిస్తుండటంతో కోగంటి సత్యం విసిగివేసారి పోయినట్టు సమాచారం. దీంతో తన ప్రధాన అనుచరుడు శ్యామ్‌తోనే హత్యకు పథక రచన చేసినట్లు, ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలిచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సత్యంసహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. 20 శాతం వాటా విక్రయం... విజయవాడకు చెందిన కోగంటి సత్యం కామాక్షి స్టీల్ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. కొన్నేళ్లక్రితం టీడీపీ నేత బొండా ఉమాను వర్కింగ్ పార్ట్నర్గా చేర్చుకున్నాడు. పెట్టుబడి లేకపోయినా సంస్థలోనే ఉండి, దాని వ్యవహారాలు పర్యవేక్షించేందుకు 20 శాతం వాటాను ఉమాకిచ్చాడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించిన ఉమా తన 20 శాతం వాటాను 2013లో రాంప్రసాద్‌తోపాటు ఆయన మేన బావమరిది ఊర శ్రీనివాస్‌కు విక్రయించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని వైశ్యా బ్యాంక్ నుంచి కామాక్షి స్టీల్స్ పేరిట భారీ మొత్తంలో రుణం తీసుకోవడం, దాని కిస్తీలు సక్రమంగా చెల్లించకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో 2014లో సెటిల్మెంట్ చేసుకున్న కోగంటి సత్యం, రాంప్రసాద్‌లు వ్యాపారం నుంచి వేరుపడ్డారు. ఆ సమయంలో తనవల్ల జరిగిన నష్టానికి, ఇతర అప్పులకు సంబంధించి రూ.25 కోట్లు చెల్లిస్తానంటూ రాంప్రసాద్ సెటిల్మెంట్ డీడ్ రాసిచ్చారు. రాంప్రసాద్‌కు బొండా మద్దతు... బొండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో సత్యం, రాంప్రసాద్ మధ్య స్పర్థలు మరింత ముదిరాయి. సెటిల్మెంట్ డీడ్‌ను బేఖాతరు చేసిన రాంప్రసాద్‌కు బొండా మద్దతు పెరిగింది. తమ మధ్య జరిగిన వివాదాలకు, వ్యవహారాలకు సంబంధించి సత్యం విజయవాడలోని ఏ ఠాణాకెళ్లినా కేసు నమోదయ్యేది కాదు. ఈ చర్యలతో విసిగిపోయిన సత్యం అదునుకోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. 2017లో రాంప్రసాద్ కుటుంబంతో కలసి హైదరాబాద్‌కు చేరారు. ఖాజాగూడలో ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్ పేరుతో సంస్థనేర్పాటు చేశారు. ఇటీవలే గచ్చిబౌలిలో కొత్త ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. 2 నెలల క్రితమే... దాదాపు 2 నెలలక్రితమే రాంప్రసాద్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్న సత్యం ఈ పనిని తన అనుచరుడు, రాంప్రసాద్ పెట్టిన కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్యామ్‌కు అప్పగించాడు. ఖర్చులకోసం రూ.10 లక్షలిచ్చాడు. రంగంలోకి దిగిన శ్యామ్ ఈ హత్యకోసం తన స్నేహితుడైన సురేష్‌తోపాటు ఆనంద్, ఛోటు, రమేష్‌లను తనతో కలుపుకున్నాడు. రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టాల్సిన బాధ్యతను ఆనంద్కప్పగించాడు. నగరానికి వచ్చిన ఆనంద్ తనకు భారీ మొత్తంలో స్టీలు కావాలంటూ ఫోన్ చేయగా.. రాంప్రసాద్ తన పంజగుట్ట కార్యాలయం చిరునామా చెప్పి అక్కడకు రావాలని సూచించాడు. ఈ క్రమంలో పరిగిలోని రాంప్రసాద్ సంస్థ, గచ్చిబౌలిలోని ఇల్లు గురించి కూడా ఆనంద్ తెలుసుకున్నాడు. హత్య.. అనంతర ప్రక్రియకు పథక రచన... రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఛోటు, రమేష్‌తో కలసి శ్యామ్ రంగంలోకి దిగాడు. అందుకవసరమైన కత్తుల్ని విజయవాడలోని తన వాటర్ ప్లాంట్‌లోనే తయారు చేయించాడు. హత్యానంతరం పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోవాలని, ఏ దశలోనూ సత్యం పేరు బయటకు రానీయకూడదని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఊర శ్రీనివాస్ పేరు చెప్పాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 2న విజయవాడ నుంచి కుటుంబంతోసహా తిరుపతి వెళ్లిన సత్యం అక్కడ్నుంచీ నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. 5న విజయవాడ నుంచి వాహనంలో బయల్దేరిన శ్యామ్, సురేష్, ఛోటు, రమేష్ డ్రైవర్‌తో కలసి ఆనంద్ వద్దకు చేరుకుని బస చేశారు. 6వ తేదీ రాత్రి అదే వాహనంలో పంజగుట్టలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకెళ్లారు. సురేష్ కాస్త దూరంలో ఆగిపోగా.. మిగిలిన ముగ్గురూ రాంప్రసాద్పై దాడి చేశారు. తమ ‘పని’ పూర్తయ్యాక పోలీసులకు లొంగిపోవాలని భావించిన శ్యామ్, ఛోటు, రమేష్ కంగారుపడి ఎవరికి వారుగా పారిపోయారు. వీరు వచ్చిన వాహనం తీసుకుని డ్రైవర్ విజయవాడ వెళ్లిపోయాడు. ఆనంద్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసుల విచారణలో అసలు కథ బయటికి... పథకం ప్రకారం ముందు సత్యం, ఆ తర్వాత శ్యామ్, ఛోటు, రమేష్ మీడియా ముందుకొచ్చి ఊర శ్రీనివాస్ పేరు బయటకు తెచ్చారు. అయితే రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సత్యంతోపాటు శ్యామ్, రమేష్, ఛోటులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కథంతా బయటికొచ్చింది. విజయవాడ వెళ్లిన ప్రత్యేక బృందం వాహనంతోపాటు డ్రైవర్‌ను పట్టుకుని తీసుకొచ్చింది. ప్రస్తుతం సత్యంను టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మిగిలిన నలుగురినీ పంజగుట్ట అధికారులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆనంద్, సురేష్కోసం గాలిస్తున్నారు. -
ఒక్కమార్కుతో ఫెయిల్ జీవితంలో పాస్..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెద్దచదువులు అబ్బలేదు.. అయితేనేం జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగాడు.. పదో తరగతిలో ఫెయిలైనా కలత చెందలేదు.. పట్టుదలతో ఏదైనా సాధించాలని కంకణం కట్టుకున్నాడు.. అంతే.. పొట్టచేత పట్టుకుని పరాయి దేశం వెళ్లాడు.. అక్కడే కూలీ పనులు చేస్తూ ఉన్నతంగా ఎదిగాడు. ఇప్పుడు పెద్దకంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధికల్పిస్తున్నాడు.. ఆయనే ఎల్లారెడ్డిపేటకు చెందిన రాధారపు సత్యం. ఆయన విజయం వెనుక రహస్యాలు.. ఆయన మాటల్లోనే.. వెయ్యి మందికి ఉపాధి.. వీర్నపల్లిలో 1995–96 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన. గణితంలో ఒకేఒక్క మార్కు తక్కువ రావడంతో ఫెయిలైన. రెండేళ్లు ఖాళీగా ఉన్న. మా సోదరుడు శంకర్ సాయంతో 1998లో కంపెనీ వీసాపై దుబాయి పోయిన. అక్కడే కూలీ పనులు చేసిన. ఎల్‌ఎస్‌పీఎంకే పేరిట దుబాయిలో భవన నిర్మాణాల కంపెనీ ప్రారంభించిన. సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న. పుట్టెడు కష్టాలు.. నా చిన్నతనంలోనే అమ్మానాన్న అనారోగ్యంతో చనిపోయిండ్రు. సోదరుడు, ఒక అక్క, చెల్లెలు. అన్నీ తామై నన్ను పెంచిండ్రు. ఆర్థిక పరిస్థితులకు తోడు పదో తరగతిలో ఫెయిలైన. సోదరుని సాయంతో దుబాయికి వెళ్లి కూలీ పనులకు కుదిరిన. కొన్నాళ్లపాటు అవేపనులు చేసిన. కొందరు మిత్రుల సాయంతో దుబాయిలోనే భవన నిర్మాణ వ్యాపారం ప్రారంభించిన. ప్రస్తుతం దుబాయి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న. వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాలి.. భవన నిర్మాణ రంగ వ్యాపారం అనుకూలించింది. కూలీల అవసరం ఎక్కువైంది. అందుకే.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మందిని నా కంపెనీలో కూలీలుగా పెట్టుకున్న. నేను బతకడం కష్టమనుకునే పరిస్థితిని ఇలా అధిగమించిన. అంచలంచెలుగా ఎదగడమే కాదు.. నేను ఉపాధి కల్పిస్తున్న వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాననే సంతృప్తి నా జీవితకాలం ఉంటుందని నా అభిప్రాయం. నిరుపేదలకు అండగా.. అనాథలకు అండగా ఉంటూ.. నిరుపేదలకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్న. అభాగ్యులకు ఆపద సమయంలో నేనున్నాననే భరోసా కల్పిస్తున్న. వృద్ధాశ్రమంలో మలిసంధ్యలో ఉన్న అవ్వలకు బువ్వకోసం సాయం చేస్తున్న. తంగళపల్లిలోని లగిశెట్టి శ్రీనివాస్ చారిట్రబుల్ ట్రస్ట్‌లోని అనాథలకు రూ.50వేలు, గంభీరావుపేట వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, పండ్లు, రూ.25వేల నగదు అందించిన. ఎల్లారెడ్డిపేటలోని 20 మంది అనాథ మహిళలకు దుప్పట్లు, దుస్తులు అందించిన. వివిధ సందర్భాల్లో వివాహం చేయలేని స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రుల కూతుళ్ల పెళ్లిళ్లకు పుస్తెమెట్టెలు, దుస్తులు, పెళ్లి సామగ్రి అందిస్తూ వస్తున్న. ఇలా ఇప్పటివరకు 25 మంది యువతుల వివాహాలకు రూ.2.25 లక్షల సాయం చేసిన. పాఠశాలల్లో విద్యార్థుల చదువులకోసం రూ.5 లక్షలతో పది పాఠశాలలకు ప్రొజెక్టర్లు, దుస్తులు, విద్యాసామగ్రి అందించిన. జీవితకాలం కొనసాగిస్తా నేను ఒకప్పుడు బుక్కెడు బువ్వకోసం తండ్లాడిన. ఆకలి బాధ అంటే నాకు తెలుసు. అందుకే పేదల ఆకలి తీర్చడంలో ముందుంటున్న. పెద్ద చదువులు చదువలేకపోయినా.. తెలివితో రాణించి పదిమందికి సాయం చేసే విధంగా నేటి యువత ఎదగాలి. -
పరిటాల సునీతపై మండిపడ్డ జ్యోతక్క
‘‘పరిటాల కుటుంబం ఉద్యమాన్ని స్వార్థానికి వాడుకుంటోంది. అణగారిన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తోంది. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు...రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’’ అని మాజీ నక్సలైటు, 2004లో పోలీసుల తూటాలకు బలైన నక్సల్ ఉద్యమ నేత ఎర్రసత్యం సతీమణి అరుణక్క అలియాస్ జ్యోతక్క అభిప్రాయపడ్డారు. నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె...ఆ తర్వాత వైఎస్సార్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె... బుధవారం తనకల్లు మండలం ఉస్తినిపల్లిలోని తన స్వగృహంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. అనంతపురం, కదిరి: నక్సల్ ఉద్యమం...ప్రస్తుత రాజకీయాలపై జ్యోతక్క తన అభిప్రాయాలను సాక్షితో ఇలా పంచుకున్నారు. ‘సాక్షి’: నక్సల్ ఉద్యమానికి ఎలా ఆకర్షితులయ్యారు..? జ్యోతక్క: మా పుట్టిల్లు తాడిపత్రి. మా నాన్న నక్సల్ ఉద్యమంలో రైతు కూలీ సంఘ నాయకుడిగా ఉండేవారు. అలా నేను కూడా ఆకర్షితురాలినై చిన్నప్పుడే జననాట్య మండలిలో చేరి ఉద్యమంలోకి వెళ్లాను. గణపతి వర్గంలో జిల్లా కమిటీలో పనిచేశాను. నా భర్త ఎర్రసత్యం ఎంఏ గోల్డ్‌మెడలిస్ట్. ఆయన ఎస్కేయూలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ.. నక్సల్ ఉద్యమంలో చేరి రాష్ట్ర కమిటీలో చురుగ్గా ఉండేవారు. ‘సాక్షి’: పరిటాల కుటుంబీకులు కూడా నక్సల్ ఉద్యమంలో పనిచేశారు కదా..! జ్యోతక్క: రవి తండ్రి శ్రీరాములు, రవి సోదరుడు హరి వీరిద్దరూ పనిచేశారు. వారి గురించి ప్రస్తావించలేము. కానీ పరిటాల రవితో పాటు ఆయన సతీమణి సునీత చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు...మా కుటుంబం అణగారిన వర్గాల కోసం పనిచేస్తోందని ప్రజల్ని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నక్సల్ ఉద్యమాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. వారికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ‘సాక్షి’: వైఎస్సార్, చంద్రబాబు..వీరిద్దరిలో ఎవరు ప్రజల మనిషి..? జ్యోతక్క: వైఎస్ రాజ శేఖరరెడ్డికి, చంద్రబాబుకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు ఏమీ లేకపోయినా హంగామా ఉంటుంది. కానీ వైఎస్సార్ ప్రజల మనిషి. ఆయన అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డారు. ఆఖరుకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ఎక్కువ రోజులు పరిపాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అదే వైఎస్సార్ ఎక్కువ రోజులు పరిపాలించినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. ‘సాక్షి’: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? జ్యోతక్క: ఇప్పుడున్న పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్ అన్పించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. గత ఎన్నికల్లోనే ఆయన ఒక్క అబద్ధం చెప్పింటే అధికారంలోకి వచ్చేవారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ జగన్ అని చెప్పచ్చు. ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరగాలంటే జగనన్నే కరెక్ట్. అందుకే నేను కూడా ఎంతో కొంత ప్రజలకు నా వంతు ప్రజా సేవ చేయాలని భావించే వైఎస్సార్సీపీలో చేరాను.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజలను పలకరించిన తీరుగానీ..ప్రజల కోసం ఆయన పడుతున్న తపన గానీ చూస్తే ఆయన జనం కోసమే పుట్టారేమో అనిపిస్తోంది -
బాబా దయవల్ల...
మచ్చా రామలింగారెడ్డి సాయిబాబాగా నటించి, నిర్మించిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడి సాయి’. కొండవీటి సత్యం దర్శకత్వంలో దత్త ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా పాటలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘షిర్డీ సాయిబాబా జీవితం ఎందరినో ప్రభావితం చేసింది. సాయిబాబా పాత్రకు రామలింగారెడ్డి కరెక్టుగా సరిపోయారు. బాబా లీలలను సత్యం చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ముందు వేరేవాళ్లు ప్రారంభించి, ఆపేశారు. బాబా దయవల్ల ఇదే సినిమాను కొండవీటి సత్యం దర్శకత్వంలో నిర్మించాను. బాబా గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను చూపించాం’’ అన్నారు మచ్చా రామలింగారెడ్డి. ‘‘బాబా దయతో సినిమాని అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించాను’’ అన్నారు కొండవీటి సత్యం. -
‘అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు. -
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడి మృతి
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. సత్యం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, నాయకులు మల్లు రవి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సత్యం కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ హైదరాబాద్‌లోని మాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. సత్యం భౌతికకాయాన్ని ఖమ్మం తరలించి ప్రజల సందర్శనార్థం డీసీసీ కార్యాలయంలో కొద్ది సేపు ఉంచుతారు. సత్యం మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. -
ఆ చిత్రం విషయంలో ప్రభాస్ నమ్మకం కలిగించారు..
సాక్షి, చెన్నై: నటుడు ప్రభాస్ తనకు నమ్మకం కలిగించారని సీనియర్ నటుడు, నిర్మాత సత్యరాజ్ వ్యాఖ్యానించారు. ఈయన తన కొడుకు హీరోగా నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం సత్య. నటి రమ్యానంబీశన్ హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించారు.ఆనందరాజ్, సతీష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సైతా న్ చిత్రం ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం బాధ్యతను నిర్వహించారు. ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. సమన్ కే.కింగ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, నిర్మాత సత్యరాజ్ మాట్లాడుతూ.. తాను బాహుబలి చిత్ర షూటింగ్లో ఉన్నప్పుడు తన కొడుకు సిబిరాజ్ ఫోన్ చేసి తెలుగు చిత్రం క్షణం గురించి వివరాలను తెలుసుకోమని చెప్పాడన్నారు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న నటుడు ప్రభాస్‌ను క్షణం గురించి అడగ్గా చాలా మంచి చిత్రం ఎందుకడుగుతున్నారు అని అడిగారన్నారు. తన కొడుకు సిబిరాజ్ ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడని తాను చెప్పగా మంచి సినిమా రీమేక్ చేయండని ప్రభాస్ నమ్మకం కలి గించారని తెలిపారు. దీంతో ఆ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసి సిబిరాజ్ మంచి టీమ్‌తో తమిళంలో సత్య పేరుతో రూపొందించారని తెలిపారు. చిత్రం అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని, ఈ చిత్ర టైటిల్‌ని నటుడు కమలహాసన్ ఇచ్చారని, అదే విధంగా నటుడు సూర్య చిత్ర ట్రైలర్‌ను శనివారం ఆవిష్కరించారని తెలిపారు. క్షణం చిత్రం రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తరువాత విజయ్‌ఆంటోని ఫోన్ చేసి దర్శకుడు ఎవరనుకుంటున్నారు? ఎవరిని ఫిక్స్ చేయకపోతో ప్రదీప్ కృష్ణమూర్తిని పెట్టుకోండి. తన సైతాన్ చిత్రాన్ని బాగా తెరెక్కిం చారాయన అని చెప్పారన్నారు. దీంతో తాను ప్రదీప్ కృష్ణమూర్తిని కలిసి కథ గురించి చెప్పి ఆయన్నే దర్శకత్వం చేయమని సిబిరాజ్ తెలి పారు. మంచి చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నటి రమ్యానంబీశన్ అంది. -
నేటి మెట్రో రైలు ఘనత నాటి వైఎస్సార్ దే
-
పండుగకూ పస్తులేనా?: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయకుండా ప్రభుత్వం పండుగ (దసరా) నాడు కూడా పస్తులు ఉంచుతుందా అని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేడిపల్లి సత్యం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యేదాకా రేషన్ ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేదని.. కానీ ఇప్పుడు అన్ని సరుకుల పంపిణీ జరగటం లేదని ఆరోపించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రూ.220 కోట్లు ఖర్చుచేసిన సీఎం.. పేదలకు మాత్రం రూ.50 నాసిరకం చీరలను పంచారని విమర్శించారు. ఇందులో కమీషన్ల పేరిట రూ.150 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడం లేదని, పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని విమర్శించారు. -
సత్యం వ్యవహారం..
పీడబ్ల్యూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు! న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటింగ్ అవకతవకలకు సంబంధించి ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌పై (పీడ్లూ్యసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్కి ఆడిటింగ్ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009 జనవరిలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో పీడబ్ల్యూసీకి సెబీ షోకాజ్ నోటీసులిచ్చింది. తాము సెబీ పరిధిలోకి రామంటూ పీడబ్ల్యూసీ .. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పీడబ్ల్యూసీ నిర్ధారించిన బ్యాలెన్స్ షీట్ల ఆధారంగానే సత్యం కంప్యూటర్స్‌లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు.. దాని వైఖరి కారణంగా నష్టపోయారంటూ సెబీ వాదించింది. ఫలితంగా షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సెబీకి పూర్తి అధికారాలు ఉంటాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అప్పట్నుంచీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆరునెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించడంతో సెబీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. మే–జూన్‌లో పీడబ్ల్యూసీ వర్గాలను పలు దఫాలుగా విచారించింది. అటు ప్రభుత్వం నుంచి కూడా సెబీకి పీడబ్ల్యూసీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిశీలించాలని కేంద్రం సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రోడ్డుప్రమాదంలో హెచ్ఎంటీవీ కెమెరామెన్ మృతి
హైదరాబాద్ : నగరంలోని మొట్టుగుడ వద్ద బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్ఎంటీవీ కెమెరామెన్ సత్యం మృతి చెందారు. విధులు ముగించికుని కీసరగుట్టలోని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సత్యంకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధుని అనుమానాస్పద మృతి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాత శ్రీరంగరాజపురంలో శనివారం ఉదయం ఒక వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సత్యం(70) అనే వృద్ధుడు దెబ్బలు తగిలి మృతిచెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై రాళ్లతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి...
మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో శనివారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మిర్యాలగూడ అగ్రిగోల్డ్ కాలనీకు చెందిన పున్నా సత్యం అనే వ్యక్తి ఇంట్లో చోరికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం సత్యం వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.60 వేల నగదు, ఓ ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగలు గొట్టి ఉండటం గమనించిన స్థానికులు హైదరాబాద్‌లో ఉన్న సత్యానికి సమాచారమిచ్చారు. హుటాహుటిన మిర్యాలగూడ చేరుకున్న ఆయన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న లారీ
వర్గల్ : సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొనగా ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తె ల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ మొగులుగాని సత్యం (50) ఆస్పతిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, క్లీనర్ గుగులోతు వెంకన్న (40) గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిలిండర్ లారీ డ్రైవర్ బురాన్ నగేష్ (35) కాలు పూర్తిగా తెగిపోయింది. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలడం లాంటి ఘటన చోటుచేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతకు సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోగా దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కలపను తీసుకువచ్చేందుకు బుధవారం రాత్రి ఓ లారీ హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే లారీలో సాంకేతిక లోపం కారణంగా గౌరారం వద్ద రోడ్డు పక్కన ఆగిపోయింది. డ్రైవర్ సత్యం, క్లీనర్ గుగులోతు వెంకన్న అందులోనే కూర్చుని ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో చర్లపల్లి నుంచి హెచ్‌పీ సిలిండర్ల లోడ్‌తో సిద్దిపేట వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు 50 గజాలు పైగా ముందుకు దూసుకెళ్లాయి. ఆగి ఉన్న లారీ రోడ్డు కిందకు గోతిలోకి జారిపడగా, కల్వర్టు గోడ అడ్డుతగిలి సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీ ఆగిపోయింది. క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దాదాపు రెండు గంటలపాటు నరక యాతన అనుభవించాడు. గౌరారం పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని వెలికి తీసే ప్రయత్నం విఫలమైంది. జేసీబీ సాయం తీసుకుని లారీలను విడదీసి డ్రైవర్‌ను వెలికి తీసారు. నిండు సిలిండర్లు కావడంతో పేలిపోయే ప్రమాదం శంకించి గజ్వేల్ నుంచి అగ్నిమాపక వాహనాన్ని తెప్పించారు. ప్రమాదంలో అతడి కాలు కొంత మేర పూర్తిగా తెగిపోయింది. ముందులారీ డ్రైవర్ సత్యంకు, క్లీనర్ వెంకన్నకు తీవ్రగాయాలు కాగా వారందరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి సొంత గ్రామం వరంగల్ జిల్లా నర్సింహులు పేట మండలం బీర్శెట్టి గూడెం. మృతుడికి భార్య వెంకటమ్మ, కొడుకు రాజేష్ (19) ఉండగా ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. డ్యూటీకి వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలిసి వెంకటమ్మ కుటుంబం పెను విషాదంలో కూరుకుపోయింది. ప్రమాదానికి కారణమైన సిలిండర్లలోడుతో వెళుతున్న లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎవరీ సత్యం ?
విజయనగరం క్రైం:దేశం పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక గందరగోళానికి తెరతీసింది. జిల్లా నాయకత్వానికే పెద్దగా తెలియని వ్యక్తి పేరు ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టేసి, పెద్దగా ఎవరికీ పరిచయంలేని వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లా నుంచి అధిష్టానం ఖరారు చేసిందని, ఇది అన్యాయమని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు. లాబీయింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ డాది కాలంగా ఎమ్మెల్సీ పదవికి కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ తెంటులక్ష్మునాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కె.త్రిమూర్తులరాజు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.పి భంజదేవ్లు ఎదురుచూస్తున్నారు. వీరంతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గవర్నర్, స్థానిక సంస్థల కోటాలో వస్తుందని ఆశపడ్డారు. బుధవారం చంద్రబాబు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం పేరును ప్రకటించడంతో వారంతా ఖంగుతిన్నారు. జోరుగా చర్చ: జిల్లా నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ సత్యం అనే పేరును ప్రకటించడం తో జిల్లాలో టీడీపీ నేతలు గందరగోళానికి గురయ్యారు. ఈ పేరు గల వ్యక్తి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరీ సత్యమంటూ ఆరా తీశారు. భో గాపురం మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ పేరును సత్యంగా ప్రకటించిరా..? లేదా మంత్రి నారాయణకు సన్నిహితుడైన సత్యం అనే వ్య క్తి విశాఖపట్నంలో ఉంటున్నారని, ఆయన పేరును ఇలా ప్రకటించారా అని కొందరు తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అనుంగ శిష్యుడు పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు పేరును అలా ప్రకటించి ఉంటారని మరి కొందరు చెబుతున్నారు. -
వృద్ధుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఘటన నగరంలోని గాజుల రామారం ప్రాంతంలో జరిగింది. విశాఖపట్టణానికి చెందిన సత్యం (65) గాజుల రామారంలో ఉండే తన కుమారుడు నాయుడు దగ్గరకు 20 రోజుల క్రితం వచ్చాడు. అయితే, సోమవారం ఉదయం సత్యం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా గాజులరామారంలోని ఓ క్వారీ గుంతలో శవమై కనిపించాడు. పని కోసం వచ్చి క్వారీలో పడి మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (జీడిమెట్ల) -
జ్వరంతో ముగ్గురి మృతి
రామన్నపాలెం (వేంసూరు): రామన్నపాలెం గ్రామంలో ఒకే రోజున.. కేవలం గంటల వ్యవధిలోనే జ్వరంతో ముగ్గురు మృతిచెందారు. దీంతో, ఈ గ్రామస్తులు తీవ్ర భయూందోళనతో వణకుతున్నారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం... ఈ గ్రామానికి చెందిన రామినేని సత్యం(48) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో నోటి నుంచి నురగతో మృతిచెందాడు.ఇతని మృతదేహాన్ని చూసేందుకు అదే వీధిలో ఉంటున్న అంగిడి గోపయ్య(55), బండి వెంకటేశ్వరరావు(45) వచ్చారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయూరు. ఆ తరువాత కొద్దిసేపటికి అంగిడి గోపయ్యకు ఒకేసారి జ్వరం పెరిగింది. తీవ్రంగా అస్వస్థుడైన అతనిని కుటుంబీకులు కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో (11 గంటల సమయంలో) మృతిచెందాడు. వెంకటేశ్వరరావుది కూడా ఇదే పరిస్థితి. రామినేని సత్యం మృతదేహాన్ని చూసేందుకు వచ్చి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఆ తరువాత తన ఇంటికి వెళ్లిపోయూడు. కొద్దిసేపటి తరువాత జ్వరం పెరగడంతో తీవ్రంగా అస్వస్థుడయ్యూడు. కుటుంబీకులు తిరువూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడు అక్కడే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతిచెందాడు. ఒకే వీధికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంటల వ్యవధిలో మృతిచెందడంతో గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామంలో మరికొందరు కూడా జ్వరంతో బాధపడుతున్నారు. మృతుల కుటుంబీకులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. -
సెబీ కేసులో కోర్టు ముందుకు రామలింగరాజు
సాక్షి, హైదరాబాద్: మదుపుదారులను మోసం చేశారంటూ స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు గురువారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబ సభ్యులు రామరాజు, ఝాన్సీరాణి, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, మాజీ వీపీ (ఫైనాన్స్) జి.రామకృష్ణ, ఆడిటింగ్ విభాగం హెడ్ వీఎస్ ప్రభాకర్‌గుప్తా, మాజీ డెరైక్టర్, టీవీ-9 అధినేత చింతలపాటి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీని రాజు తదితరులు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్...రూ.20 వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ, ఆడిటర్ తళ్లూరి శ్రీనివాస్‌లకు సమన్లు అందకపోవడంతో వారు కోర్టుకు హాజరుకాలేదు. ఇదిలా ఉండగా ఇదే కేసులో శ్రీని రాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (మైటాస్ ఇన్ఫ్రా), సూర్యనారాయణ రాజుకు చెందిన ఎస్ఆర్ ఎస్ఆర్ హోల్డింగ్స్‌లు కూడా నిందితుల జాబితాలో ఉండగా ఆ సంస్థల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. -
తెయూపై శీతకన్ను
భిక్కనూరు : టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సౌత్‌క్యాంపస్ విద్యార్థి జేఏసీ కన్వీనర్ సత్యం ఆరోపించారు. శుక్రవారం సౌత్‌క్యాం పస్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం రూ. 24 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, అయితే ఆ విషయాన్ని కేసీఆర్ విస్మరించారని అన్నారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విడుదల చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గోవర్ధన్, నాయకులు రఘురాం, రమేశ్, ఫర్మియానాయక్, సంధ్యకుమార్, యోగి, నర్సింలు, శివకుమార్, రఘురామ్‌లు పాల్గొన్నారు. -
అనగనగా ఒక రాజు
-
వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక...
వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక అతడిని విద్యార్థులకు దగ్గరచేస్తే.. ఆంగ్లభాషపై ఉన్న మక్కువ జాతీయ, అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఇంగ్లిష్ అంటేనే ఉలిక్కిపడుతున్న విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు చేసిన ప్రయోగం అతడికి మరింత ఖ్యాతినార్జించి పెట్టింది. అంతేనా.. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పరిశోధకుడిగానూ రాణిస్తున్న ఆ మాస్టారి పేరు శంకరభక్తుల సత్యం. ప్రయోగాత్మక విద్యతో పలువురి మన్ననలు అందుకున్న ఆయన పలు జాతీయ,అంతర్జాతీయ మాసపత్రికలకు సైతం వ్యాసాలు రాశారు. ఆయన ప్రతిభకు గుర్తుగా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. - కేసముద్రం ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి మారుమూల విద్యార్థులకు ఆంగ్లాన్ని సులభంగా బోధించేందుకు అక్కడి ఉపాధ్యాయులు వ్యాకరణాంశాలతో కూడుకున్న ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంగ్లిష్‌పై విద్యార్థులకు మక్కువ ఉన్నప్పటికీ వారికి తగురీతిలో బోధించేవారు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి వ్యాకరణాంశాలతో మిళితమైన ప్రత్యేక మెటీరియల్‌ను తయారుచేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. ఉత్సాహవంతులైన ఆంగ్ల ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలు కల్పించాలి. - శంకరభక్తుల సత్యం నెక్కొండ మండలం చంద్రుగొండకు చెం దిన సత్యం 1996లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. తర్వాత కురవి మండలంలోని లక్ష్మీతం డా ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్లు పనిచేసి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత మరిపెడ మండలం చిన్నగూడూరులో మూడేళ్లపాటు విధులు నిర్వర్తించా రు. 2005లో కేసముద్రం మండలం పెనుగొండ జెడ్పీస్ఎస్కు బదిలీపై వచ్చిన సత్యం మాస్టారు అప్పటి నుంచి ఇక్కడే విద్యాబోధన చేస్తున్నారు. 2006లో మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తిచేసిన ఆయన ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రయోగాత్మక విద్యకు శ్రీకారం ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్యం మాస్టారు.. ఆంగ్లభాషపై విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా బోధించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తరగతి గదినే ల్యాబ్‌గా మార్చేశారు. సహచర ఉపాధ్యాయుల సహకారంతో ఆంగ్ల వ్యారణాంశాలను తరగతి గది గోడలపై రాయించారు. భాషా నైపుణ్యాలు, పదకోశం, వ్యాకరణ నిర్మాణాలు, క్రియా రూపాలు, భాషాభాగాలు, ఉచ్చరణ, సర్వనామాలు, విభక్తులు, వ్యతిరేక పదాలు, కర్త, కర్మ వాక్యాలతోపాటు మరికొన్ని వ్యాకరణాంశాలను గదిగోడలపై అందంగా రాయించారు. వీటి సాయంతో 150 క్రియా రూపాలను, 12 రకాల వ్యాక్య నిర్మాణాలను, సూత్రాలను విద్యార్థులు ఎంతో సులభంగా చెప్పగలుగుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ఇష్టం ఏర్పడింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నతాధికారులు సత్యం మాస్టారిని అభినందనల్లో ముంచెత్తారు. సమర్పించిన వ్యాసాలు 2014 ఏప్రిల్‌లో తిరుపతి చాప్టర్ వారు నిర్వహించిన జాతీయ సదస్సులో ‘లాంగ్వేజ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫంక్షనింగ్’ అనే వ్యాసాన్ని సమర్పించారు. 2013 జూలైలో యూనివర్సిటీ ఆఫ్ ఆల్, యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ద ఇంపాక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఆఫ్ ఇన్స్కూల్ ఎడ్యుకేషన్’ అనే పరిశోధనా వ్యాసం సమర్పణ. 2013 జనవరిలో ఏడీ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుజరాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయసదస్సులో ‘లాంగ్వేజ్ లెర్నింగ్ త్రూ ల్యాబ్స్’ అంశంపై వ్యాసం సమర్పణ. 2013 ఫిబ్రవరిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, భోపాల్ ఆధ్వర్యంలో ఆంగ్ల సాహిత్యంపై రెండురోజులపాటు నిర్వహించిన సదస్సులో ‘డ్రామా అండ్ లాంగ్వేజ్ యాజ్ ఆక్టివ్ ఫామ్స్ ఆఫ్ లిటరేచర్’ వ్యాసాన్ని సమర్పించారు. 2012 అక్టోబర్‌లో జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లిష్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్’ వ్యాసాన్ని సమర్పించారు. సత్యం మాస్టారు సమర్పించిన వ్యాసాల్లో ఇవి కొన్ని మాత్రమే. అవార్డులు.. ప్రశంసలు విద్యారంగానికి చేస్తున్న సేవకుగాను 2013 అక్టోబరులో హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అప్పటి మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా రాజీవ్త్న్ర అవార్డు అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా 2011 సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయిలో సత్యం రాసిన ఈఎల్టీఇన్ ఇండియా అనే పరిశోధనా వ్యాసం ప్రథమస్థానంలో నిలవడంతో డాక్టర్ జేకే రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నయ్ వారు రూ.25వేల నగదును, ప్రశంసాపత్రాన్ని అందించారు. వ్యాసాలతో కీర్తి.. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పలు జాతీయ, అంతర్జాతీయ మాస పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు సత్యం మాస్టారు. మహారాష్ట్రకు చెందిన న్యూమాన్ పబ్లికేషన్స్, చెన్నైకు చెందిన ద ఇంగ్లిష్ రీసెర్స్ ఎక్స్‌ప్రెస్, ద ఇంగ్లిష్ ఇండియా మాస పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. సంపాదకుడిగానూ పనిచేశారు. న్యూ ఢిల్లీలోని యూనివర్సిటీ మాసపత్రికలో, ఎడ్యుట్రాక్స్ పత్రికలో, చెన్నైలోని ఎల్టాయ్ మాస పత్రికలో, ఎక్స్పర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ మాసపత్రిక తదితర వాటిలో సభ్యత్వాన్ని పొందారు. అంతేకాక 2002 నుంచి 2006 వరకు పదో తరగతి మోడల్ పేపర్ల తయారీలోనూ సేవలందించారు. జిల్లా విద్యాశాఖ ఇటీవల మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ఆంగ్లం కార్యక్రమంలో దుగ్గొండి మండలానికి రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు. -
'సత్యం' కేసు ఈ నెల 28కి వాయిదా
-
జైలో ? బెయిలో ?.. తేలేది నేడే!
-
సత్యం స్కాం బయటపడి ఇప్పటికి సరిగ్గా అయిదేళ్లు
-
ప్చ్.. ఎదురీతే!
రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక రంగాల పరిస్థితి ఈ ఏడాది పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. సర్కారు అలసత్వం... విద్యుత్ కోతలు.. ఇతరత్రా సమస్యలతో ఈసురోమంటూ నెట్టుకొస్తున్న పారిశ్రామిక వర్గాలపై మరో పిడుగు పడింది. రాష్ట్ర విభజన అంశం... వ్యాపార, వాణిజ్య రంగాలను కుదిపేసింది. షాపింగ్ మాల్స్ మొదలు బ్యాంకింగ్ దాకా అన్నింటికీ ఈ సెగ తగిలింది. ఇక రాష్ట్రానికే తలమానికంగా నిలిచి.. కుంభకోణంతో మసకబారిన ఒకప్పటి ఐటీ దిగ్గజం ‘సత్యం’ పేరు పూర్తిగా కనుమరుగైంది కూడా ఈ ఏడాదే. రాష్ట్రానికి చెందిన అనేక కంపెనీలు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి దిగజారాయి కూడా. అయితే, కంపెనీల కొనుగోళ్ల విషయంలో మన కార్పొరేట్లు కాస్త దూకుడును ప్రదర్శించారు. ఇక తొలి విమానయాన సంస్థ రాష్ట్రం నుంచి ఆవిర్భవించడం కాస్త చెప్పుకోదగ్గ విషయం. మొత్తంమీద చూస్తే.. ఒకడుగు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా గడిచిన ఈ ఏడాది మరో రెండు రోజుల్లో తెరమరుగవుతోంది. కొత్త ఏడాదివైపే గంపెడాశలతో ఎదురుచూడాల్సిన రాష్ట్ర వ్యాపార రంగంలో గతేడాది కీలక ఘట్టాల పునరావలోకనమే ఈ ‘ఏపీ బిజినెస్ రౌండప్’.... ఇద్దరు దిగ్గజాల అస్తమయం రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఫార్మా దిగ్గజాలు ఈ ఏడాది అస్తమించారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి మరణం.. ఇటు రాష్ట్రంతో పాటు దేశీయ ఫార్మాకు తీరని లోటును మిగిల్చింది. జనరిక్స్ ఔషధాలతో ధరలను సామాన్యుడికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత అంజిరెడ్డిది. మరోవైపు, వ్యాక్సిన్ తయారీలో రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బయోలాజికల్ ఇ’ చైర్మన్, ఎండీ విజయ్ కుమార్ దాట్ల ఈ ఏడాది మార్చిలో మరణించారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన విజయ్ కుమార్ 43ఏళ్లపాటు కంపెనీకి సేవలందించారు. డీపీటీ సహా పలు వ్యాక్సిన్ల తయారీకి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కష్టాల్లో ఇన్ఫ్రా... రాష్ట్ర ఇన్ఫ్రా కంపెనీలకు ఈ ఏడాది కష్టకాలంగానే గడిచింది. ప్రాజెక్టులు ముందుకు సాగక కంపెనీలకు రుణాల భారం పెరిగిపోయింది. సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు అప్పుల్లో కూరుకున్న జీఎంఆర్ పలు ప్రాజెక్టుల్లో వాటాలను విక్రయించుకొని నిధుల సమీకరణలో పడింది. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు జాయింట్ వెంచర్ నుంచి వైదొలగనుంది. ఈ జేవీలో జీఎంఆర్‌కి ఉన్న 40 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్ రేసులో నిలిచింది. డీల్ విలువ సుమారు రూ. 1,900 కోట్లుగా అంచనా. ఇక ల్యాంకో ఇన్ఫ్రా సైతం రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు సుమారు రూ. 7,600 కోట్ల విలువైన అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో పడింది. రాష్ట్రంలో తొలి ఎయిర్‌లైన్స్ టేకాఫ్... రాష్ట్రానికి చెందిన తొలి విమానయాన సంస్థ ‘ఎయిర్ కోస్టా’ ఈ ఏడాది అక్టోబర్‌లో టేకాఫ్ తీసుకుంది. విజయవాడ కేంద్రంగా ప్రారంభంలో రెండు విమానాలతో ఆరు నగరాలకు సర్వీసులను ప్రారంభించింది. రూ. 150 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలను మొదలుపెట్టిన ఈ సంస్థ.. వచ్చే రెండేళ్లలో విస్తరణ కోసం 10 కోట్ల డాలర్లను(దాదాపు రూ.600 కోట్లు) వెచ్చించాలనే ప్రణాళికల్లో ఉంది. విమానాల సంఖ్యను 2018 నాటికి 25కి పెంచాలనేది కంపెనీ లక్ష్యమని ఎయిర్ కోస్టా ఎండీ రమేష్ లింగమనేని ప్రకటించారు. 2015 నాటికి చార్టర్డ్, కార్గో సేవల్లోకి ప్రవేశించాలని కూడా ఈ కంపెనీ ఉవ్విళ్లూరుతోంది. ఫార్మా... షాపింగ్ వివిధ డీల్స్‌కి రాష్ట్ర ఫార్మా వేదికగా నిల్చింది. ఆక్టస్ ఫార్మా సంస్థను గ్రాన్యూల్స్ ఇండియా రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్.. రాష్ట్ర సంస్థ గ్లాండ్ ఫార్మాలో మైనారిటీ వాటాను 200 మిలియన్ డాలర్లకు కొనుక్కొంది. క్యాన్సర్ ఔషధం నెక్సావర్ తయారీ కోసం కంపల్సరీ లెసైన్సు ఇవ్వడం సబబేనంటూ మేధోహక్కుల అప్పిలేట్ బోర్డు కూడా నాట్కో ఫార్మాకి అనుకూలంగా తీర్పునిచ్చింది. హయసింథ్స్ ఫార్మాను అరబిందో ఫార్మా సుమారు రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. కార్పొరేట్ డీల్స్ సందడి... విజయ్ ఎలక్ట్రికల్స్‌కి చెందిన విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తోషిబా దాదాపు 200 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. హైడ్రాలిక్స్ సిలిండర్స్ తయారీ సంస్థ వేన్ బర్ట్ పెట్రోకెమికల్స్‌ను పెన్నార్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. మైహోమ్ ఇండస్ట్రీస్.. తమిళనాడుకు చెందిన జయజ్యోతి సిమెంట్స్‌ను సుమారు రూ. 1,400 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కోరమాండల్ చేతికి లిబర్టీ ఫాస్ఫేట్ గ్రూప్. డీల్ విలువ దాదాపు రూ.375 కోట్లు. ‘సత్యం’ కనుమరుగు.. ఒకప్పుడు రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన ఐటీ సంస్థ ‘’ పేరు పూర్తిగా కనుమరుగైంది. మహీంద్రా సత్యం(గతంలో సత్యం కంప్యూటర్స్) టెక్ మహీంద్రాలో విలీన ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తయ్యింది. తద్వారా దేశీయంగా అయిదో అతి పెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. రూ. 7,000 కోట్ల పైచిలుకు అకౌంటింగ్ కుంభకోణంతో సత్యం సంక్షోభంలో చిక్కుకోవడం, 2009లో మహీంద్రా గ్రూప్ దాన్ని కొనుగోలు చేయడం తెలిసిందే. మరోవైపు, ఇన్ఫోటెక్.. తైవాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో శాఖలు ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ ఐటీ ఉత్పత్తులందించే విరించి టెక్నాలజీస్.. బెంగళూరుకి చెందిన ఎస్లేపియస్ కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్‌ని కొనుగోలు చేసింది.