ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు    | Ande Satyam gave a special interview to Sakshi on fundamental changes in politics | Sakshi
Sakshi News home page

ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు   

Published Tue, Oct 17 2023 3:08 AM | Last Updated on Tue, Oct 17 2023 10:50 AM

Ande Satyam gave a special interview to Sakshi on fundamental changes in politics

ఆర్థిక నిపుణుడు అందె సత్యం

మేకల కల్యాణ్‌ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. 

ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? 
ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. 

ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? 
తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినో­దం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అ­ప్పు­ల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. 

వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? 
ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు  ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. 

విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? 
విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. 

 పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం..
ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్‌ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.  

రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? 
వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. 

జమిలి ఎన్నికలతో... 
భారత్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్‌లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు.

ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? 
ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 

నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా?  
దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్‌ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్‌ విధానాన్నే అమలు చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement