జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు, గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ పీసీ పంపిణీ ఇందులో ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వీటిని నెరవేరుస్తామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు.
పాత పింఛను విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేలా చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే ల్యాప్‌టాప్ లేదా టాబ్ ఇస్తామన్నారు. ఇవికాకుండా, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందజేయడం, రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లోని ఒక్కో మహిళకు ఏడాదికి విడతలుగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గెహ్లోత్ కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
‘దేశంలో ఈడీ వీధి కుక్కల కంటే ఎక్కువగా హడావుడి చేస్తోందని ఒక సీఎం(భూపేష్ బఘేల్) అనాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. అంత మాట అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘దర్యాప్తు విభాగాలు మీకు రాజకీయ ఆయుధాలుగా మారాయి. మోదీజీ, మీకు అర్థం కావడం లేదు. మీకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై గురువారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment