సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్‌పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్‌పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్‌పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్‌పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్‌పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది.
ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment