![Ande Satyam interview with Sakshi](/styles/webp/s3/article_images/2024/06/1/ANDHE%20SATYAM.jpg.webp?itok=65R1LQNH)
‘సాక్షి’ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో తెలంగాణలో వ్యవ‘సాయం’పెరిగిందని, దీనికి సమాంతరంగా ఆధునిక భూస్వామ్యం కూడా శరవేగంగా పెరుగుతోందని అంటున్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం. కార్పొరేట్ వర్గాలు, ధనిక రైతులు, బడా అధికారుల చేతుల్లో భూమి కేంద్రీకృతమవుతుంటే 80 శాతం ఉండే సన్న, చిన్నకారు, ఉపాంత రైతుల పరిస్థితి కూలీల స్థాయిలోనే ఉండిపోయిందన్నారు.
పాలకులు, కార్పొరేట్ వర్గాల ఐక్యతకు తెలంగాణ రాష్ట్రం నిదర్శనంగా నిలుస్తోందని, ఈ వర్గాల ఐకమత్యం కారణంగా రాజకీయ అవినీతి పెచ్చురిల్లుతోందని చెప్పారు. ఈ రెండు అంశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన దుష్పరిణామాలని, వీటికి వీలున్నంత త్వరగా చెక్ పెట్టకపోతే భవిష్యత్ తెలంగాణ మనుగడ ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పిన అందె సత్యం గుజరాత్, పంజాబ్, హరియాణ, కేరళ రాష్ట్రాల అనుభవాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సామాజిక పరిణామాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే... !
భూములు పంచాలి... ఉద్యోగాలివ్వాలి
పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో 14 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇప్పుడు తెలంగాణలోనే 25 మిలియన్ టన్నులు దాటింది. సాగునీటి ప్రాజెక్టుల వినియోగం, వర్షాలు, కాళేశ్వరం లిఫ్టు కారణంగా పెరిగిన భూగర్భజలాలు, మిషన్‌కాకతీయ లాంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. సుస్థిర పంటల సాగు వైపునకు రైతులను మళ్లించాల్సి ఉంది. పంటల మార్పిడి విషయంలో దశాబ్దకాలంగా ముందడుగు పడలేదు.
వ్యవసాయ ఉత్పత్తులే కాదు సాగు ఖర్చు కూడా అంతే పెరిగింది. పెరిగిన సంపద క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు లబి్ధదారులను తయారు చేస్తున్నాయి తప్ప వారిని ఆర్థిక వ్యవస్థలో పాత్రధారులను తయారు చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో పేదల పాత్ర ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకోసం భూపంపిణీ, ఉద్యోగాల కల్పన జరగాలి.
మెట్రోపాలిటన్‌లో మనమే ముందున్నాం
గత పదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ లక్షణాలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్, ఇతర అభివృద్ధి రంగాలన్నీ సానుకూల దిశలోనే ప్రభావితమయ్యాయి. ఐటీ పరిశ్రమ కారణంగా రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఆధునికత సంతరించుకుంది. ఉపాధి పెరిగింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరపతి కూడా పెరిగింది. సంఘటిత ఉపా ధి కల్పనలో ఐటీ పాత్ర అమోఘం.
నిర్మాణరంగంలో దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే మనమే ముందున్నాం. విద్యాసంస్థల సంఖ్య పెరగడం, నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల ఆసక్తి, తల్లిదండ్రుల ఆపేక్ష పెరగడంతో నిపుణులను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ మారింది. విద్యుచ్ఛక్తి సామర్థ్యం పెరిగిన ఫలితాలు మరో ఏడాదిలో అందుతాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు చోదకశక్తిగా మారనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాల కల్పన జరిగింది. శాంతిభద్రతలు గత పదేళ్లుగా బాగున్నాయి.
మూలధన ఖర్చు పెరగాలి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి చైనా ఒక ఉదాహరణ. పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగితేనే సంఘటిత ఉద్యోగాలు పెరుగుతాయి. తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకోవాలి. ఏటా రూ. 2–3లక్షల కోట్ల ప్రతిపాదించి ఖర్చు చేస్తున్నా, మూలధన వ్యయం (ఆస్తుల కల్పనకు ఖర్చు) రూ.20–30వేల కోట్ల మధ్యనే ఉంటోంది. దీర్ఘకాలిక అభివృద్ధి నెమ్మదించడానికి ఈ ఖర్చు కారణమవుతుంది. విద్య కార్పొరేటీకరణ రోజురోజుకూ పెరిగిపోతోంది. వైద్య రంగం కూడా శరవేగంగా కార్పొరేట్ బాట పడుతోంది.
నికర అప్పులతో పాటు పూచీకత్తులు కలిపి తెలంగాణ జీడీపీ, అప్పుల నిష్పత్తి 30 శాతం దాటుతోంది. రానున్న కాలంలో బడ్జెట్‌లో 20 శాతం అప్పులు, వడ్డీల చెల్లింపులకే కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మేరకు పెట్టుబడుల కల్పన జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకం. అలాగే అవినీతిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతుంది.
భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి
దేశంలోని వివిధ రాష్ట్రాల అనుభవం మన ముందుంది. గుజరాత్ స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, హరియాణలలో 85 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. పేద రాష్ట్రమైనా కేరళ మానవ వనరుల అభివృద్ధి ద్వారా పురోగమనంలో పయనిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల అనుభవాలకు మన స్థానికతను జోడించుకొని అభివృద్ధి చెందాలి. పరిశ్రమలను ఆకర్షించడంలో తమిళనాడు, మహారాష్ట్రలు కూడా విజయవంతమయ్యాయి. ఈ దిశగా పాలకులు ఆలోచించి భవిష్యత్ తెలంగాణకు బాటలు వేయాలి. ’అని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment