గత ప్రభుత్వం ఆర్టీసీని దెబ్బతీస్తే మేం లాభాల్లోకి తెచ్చాం
సంస్థ బలోపేతం, ప్రయాణికులకు వసతులు, సిబ్బంది సంక్షేమం మా విధానం
మహాలక్ష్మి పథకంతో సంస్థకు మంచి రోజులు
ఏడాదిలో 116 కోట్ల మంది ఉచిత ప్రయాణం.. వారికి రూ. 4 వేల కోట్లు ఆదా
హైదరాబాద్‌లో త్వరలో డీజిల్ ఆటోల తొలగింపు యోచన
అవసరమైతే ఆటోవాలాలకు చేయూతనందిస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉన్న ఆర్టీసీని పరిరక్షించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఆర్టీసీని ఉన్నతంగా నిర్వహించే విషయంలో మూడు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సంస్థ పరిపుష్టి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, సిబ్బంది సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తూ చర్యలు ప్రారంభించాం. తీవ్ర నష్టాలు, అస్తవ్యస్త విధానాలతో మూతబడే దుస్థితిలో ఉన్న ఆర్టీసీని మళ్లీ లాభాలబాట పట్టించడమే కాకుండా ప్రజలకు మరింత చేరువ చేశాం. ఇకపై సంస్థను విస్తరిస్తాం, పటిష్టపరుస్తాం, ఆధునీకరిస్తాం’అని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘మహాలక్ష్మి’తో మహర్దశ...
మా ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కలి్పంచాం. ఇది రాజకీయ హామీ కాదు.. సంస్థ గతిని మార్చే గొప్ప పథకం. కేవలం సంవత్సర కాలంలో ఏకంగా 116 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్లను ఆదా చేసుకున్నారు. ఆ మొత్తం ఆయా కుటుంబాలకు మరో రకంగా లబ్ధి చేకూర్చేందుకు కారణమైంది. కేవలం సిబ్బంది గొప్ప కృషి వల్లే ఈ పథకం ఇంతటి విజయం సాధించింది.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నేరుగా కోల్పోయే టికెట్ ఆదాయాన్ని రీయింబర్స్ చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూడుస్తున్నాం. ప్రతినెలా ఆ మొత్తాన్ని చెల్లిస్తుండటంతో సంస్థకు ఆర్థిక చేయూత కలుగుతోంది. ఇది సంస్థ విస్తరణకు దోహదపడుతోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. వారిలో మహిళల సంఖ్య దాదాపు 36 లక్షలు.
గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేసింది...
హైదరాబాద్‌లో ఒకప్పుడు దాదాపు 6 వేల సిటీ బస్సులు తిరిగేవి. కానీ గత ప్రభుత్వం ఒకేసారి 3 వేల బస్సులను తొలగించింది. ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందిపై భారం పెంచింది. ప్రయాణికులకు వసతులు కలి్పంచకుండా నిర్లక్ష్యం చేసింది. ఇలా అన్ని రకాలుగా సంస్థను దెబ్బతీసింది. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ మేం సంస్థను బలోపేతం చేస్తున్నాం. మేము వచ్చాక దశలవారీగా 1,500 కొత్త బస్సులు సమకూరాయి. ఇప్పుడు మహిళా సంఘాలు సొంతంగా బస్సులను సంస్థకు అద్దెకివ్వడం ద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాల ఆధ్వర్యంలో 600 బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. అద్దె బ స్సుల సంఖ్య నియంత్రణ లోనే ఉండేలా చూస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరించే యో చనే లేదని స్పష్టం చేస్తున్నా. ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు.
బకాయిలు చెల్లిస్తాం..
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి 2017 నాటిది. వెంటనే దానికి సంబంధించి 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి అమలు చేశాం. 2013 నాటి వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బాండ్ల బకాయిలు చెల్లించాం. బకాయి ఉన్న డీఏను చెల్లించాం. ఇలా ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం. మిగతావి కూడా ఇదే క్రమంలో క్లియర్ అవుతాయి. చనిపోయిన లేదా మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామకాలను కూడా చేపట్టాం.
ఈవీ పాలసీ కాలుష్యానికి విరుగుడే..
భాగ్యనగరంలో లక్షలాదిగా పెరుగుతున్న వాహనాల రూపంలో వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఈవీ పాలసీ తీసుకొచ్చాం. పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వారికి పన్ను మినహాయింపు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. దీన్ని అందుబాటులోకి తెచ్చాక విద్యుత్ వాహనాల కొనుగోలు మూడు రెట్లు పెరిగిందని గుర్తించాం. ఇదే కోవలో వాహన తుక్కు విధానాన్ని కూడా ప్రారంభించాం. దీనివల్ల 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను తుక్కుగా మార్చేందుకు వీలుపడుతుంది. తుక్కుగా మార్చే సెంటర్ల ఏర్పాటుకు ఇటీవలే రెండు సంస్థలకు అనుమతి ఇచ్చాం.
రాజకీయ రిజర్వేషన్లకే కులగణన పరిమితం....
కులగణన ప్రస్తుతానికి రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది కూడా అందుకోసమే. కమిషన్ నివేదిక సమరి్పంచాక చర్చించి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉంటాయి. వాటన్నింటినీ కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కులగణనలో ప్రజలు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వట్లేదని మా దృష్టికి కూడా వచి్చంది. అందరూ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా పథకాల అమలు సులువవుతుంది. సమాచారం ఇవ్వని ప్రజలు తెలంగాణ వారు కాదన్నట్లు.. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయమని గత ప్రభుత్వం బెదిరించినట్లు మేం బెదిరించట్లేదు. అందరూ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠినచర్యలు..
జ్యోతిబా పూలే విద్యానిధి పథకం కింద 300 మంది విద్యార్థులకు వర్తించే పథకాన్ని 800 మందికి పెంచాం. త్వరలోనే వారందరికీ నిధులు మంజూరు చేస్తాం. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభు త్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అన్ని జిల్లాల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌లోనూ ఈ విషయం స్పష్టం చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు వారికి ఇచ్చే మెస్‌చార్జీలు పెంచాం. వివిధ బీసీ కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించినా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేకపోయాం. త్వరలోనే వాటికి నిధులు ఇస్తాం.
త్వరలో నియామకాలు..
ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల భర్తీకి 3 వేల కొత్త నియామకాలు చేపట్టబోతున్నాం. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా నియామకాల ప్రక్రియ మొదలైంది. సాంకేతిక కారణాలతో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరలో ఆ పోస్టులు భర్తీ అయ్యేలా చూస్తాం.
కాలుష్య నియంత్రణ చర్యలు ఆర్టీసీతో మొదలు..
వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఆ దుస్థితి హైదరాబాద్‌కు పట్టకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు సమకూరుస్తున్నాం. వచ్చే రెండేళ్లలో అవి విడతలవారీగా అందుబాటులోకి వస్తాయి.
బస్సుల తరహాలో ఎలక్ట్రిక్ ఆటోలు..
ఆర్టీసీ డీజిల్ బస్సులను తొలగించిన తరహాలోనే నగరం నుంచి డీజిల్ ఆటోలను కూడా తొలగించే ఆలోచన ఉంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడతాం. ఈ మేరకు ఆటో డ్రైవర్లను త్వరలోనే చైతన్యపరిచే కసరత్తు మొదలుపెడతాం. కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే విషయంలో ఆటోవాలాలకు చేయూత అందించను న్నాం. అది ఏ రూపంలో అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment