వికటించిన హోమియో వైద్యుడి చికిత్స?
ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన
మంత్రి ఆదేశాలతో ఆలస్యంగా కదిలిన యంత్రాంగం
ఆసుపత్రిలో తనిఖీలు, కీలక పత్రాలు స్వాధీనం
కంటోన్మెంట్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరితే కాటికి పంపారని, అర్హత, అనుభవం లేని డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లికి చెందిన మధుసూదన్ గౌడ్ కడుపునొప్పితో బాధపడుతుండటంతో, కుటుంబ సభ్యులు అతడిని శనివారం స్థానిక వీఆర్ ఆసుపత్రిలో చేరి్పంచారు.
ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు. మర్నాడు ఉదయం మధుసూదన్ పరిస్థితి విషమించినట్లు చెప్పడంతో కుటుంబసభ్యులు అతడిని మరో ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. అయితే అందుకు నిరాకరించిన ఆసుపత్రి యాజమాన్యం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో మధుసూదన్ గౌడ్ మృతి చెందినట్లు చెప్పిన ఆసుపత్రి నిర్వాహకులు, అంబులెన్స్‌లో నేరుగా మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. మధుసూదన్‌గౌడ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు, తిరిగి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అర్హత, అనుభవం లేని వైద్యుడితో చికిత్స చేయించారని ఆరోపిస్తూ ఆసుపత్రిపై దాడికి యతి్నంచారు.
దీంతో అక్కడికి వచి్చన స్థానిక నాయకుడు ఆసుపత్రి యాజమాన్యం తరఫున బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు సదరు నేతపై దాడికి యత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన అతను అక్కడి నుంచి జారుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి ఆదేశాలతో...
మృతుడి బంధువులు ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి సూచించడంతో పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యా రు. ఆదివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల బృందం మృతుడి చికిత్సకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి చికిత్స చేసిన డాక్టర్ అర్హతతో పాటు మందుల వివరాలను సేకరించారు. అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment