stomach ache
-
ఏం కష్టం వచ్చింది తల్లీ..
మంచిర్యాలక్రైం: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఏసీసీ క్రిష్ణకాలనీకి చెందిన అయిండ్ల శ్రీనివాస్ –హేమలత దంపతుల కుమార్తె రోషిని(22)కి బెల్లంపల్లి బూడిదబస్తీకి చెందిన ప్రేమ్‌కుమార్‌తో గత ఆగస్టులో వివాహం జరిగింది. ఆరోగ్యం బాగా లేదని గత నెల 27న భర్తతో కలిసి రోషిని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో అందరితో సరదాగా గడిపిన రోషిని సోమవారం తెల్లవారుజామున బిల్డింగ్ పైకి వెళ్తుండగా రెండో అంతస్తులో నివాసం ఉంటున్న ధర్మాజి రోషినిని పైకి ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించాడు. వాకింగ్ చేసేందుకు వెళ్తున్నాని చెప్పిన రోషిని కొద్ది సేపటికే కిందకు దూకింది. పెద్ద శబ్ధం రావడంతో కిందకు చూసిన ధర్మాజి వెంటనే రోషిని తండ్రికి సమాచారం అందించాడు. తీవ్ర రక్తపు మడుగులో ఉన్న రోషినిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
9వ తరగతి బాలిక.. తల్లయింది!
బాగేపల్లి: లోకమంటే ఏమిటో తెలియని పసివయసులోనే మరో పసిబిడ్డను పోషించాల్సిన దుస్థితి ఆమెకు దాపురించింది. ఆ చిన్నారి వయసు 14 ఏళ్లు, చదివేది 9వ తరగతి. తల్లి అంగనవాడి కార్యకర్త, తండ్రి రైతు. తాము ఇంటి వద్ద సక్రమంగా ఉండము కాబట్టి చదువుకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అదే ఆ కుటుంబానికి శాపంగా మారింది. బాలికను ఎవరో దుండగుడు లోబర్చుకోగా గర్భం దాల్చి ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అమానవీయమైన సంఘటన బాగేపల్లి తాలూకాలో జరిగింది. అందరిలో అయోమయం బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ బాలిక 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి అని బాలిక ఇటీవల ఇంటికి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఇంజెక్షన్ వేసి కొన్ని మాత్రలిచ్చారు. ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లో మళ్లీ కడుపు నొప్పి వచ్చిందని చెప్పడంతో తాలూకా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని, ఇవి ప్రసవం నొప్పులు అని తెలిపారు. కాన్పు చేయగా బాలికకు మగబిడ్డ పుట్టాడు. చిన్నారి చేతిలో పసిబిడ్డను చూసిన వైద్యులు, తల్లిదండ్రులు, స్థానికులు ఏం జరిగిందోనని తీవ్ర అయోమయానికి గురయ్యారు. బాలికల హాస్టల్లో బాలికకు గర్భం ఎలా వచ్చిందని అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులకు అర్థం కాలేదు. బాలికకు పుట్టిన శిశువు 2.2 కేజీల బరువుంది. పోక్సో కేసు నమోదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తాలూకా వైద్యాధికారి డాక్టర్ సి.ఎన్. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బాలిక తల్లి అంగనవాడి టీచర్ కాగా, నిత్యం ఎంతోమంది గర్భవతులు, బాలింతలకు పోషకాహారం అందిస్తూ ఆరోగ్య మెళకువలను చెబుతూ ఉంటుంది. అలాంటిది సొంత కూతురి పరిస్థితిని గమనించలేకపోవడం గమనార్హమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగేపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, హాస్టల్ వార్డెన్, ఇతర ఇబ్బందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తాలూకావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
కన్నీటికే కన్నీరు! రెండేళ్ల తమ్ముడు మృతి.. రెండు గంటలు జాడలేని తండ్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు. రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు. రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు. తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు. -
ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు
బనశంకరి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేరళకు చెందిన రాజేశ్‌నాయర్, పూనమ్‌రాణా(35) దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. పూనమ్ నగరంలోని అక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఆమె 2015 అక్టోబరు 2న కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స చేశారు. వ్యాధి నయం కాకపోగా కోమాలోకి వెళ్లింది. ఈ నెల 24న పరిస్థితి విషమించి మృతి చెందినటు రాజేశ్‌నాయర్ చెప్పారు. ఆసుపత్రిలో రూ.7.5 కోట్ల బిల్లు చెల్లించామని, ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. ముంబై ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా శానుబాగ్ తర్వాత దీర్ఘకాలం కోమాలో ఉన్న పూనమ్ కేసు రెండోది అని వైద్యులు వెల్లడించారు. -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు.. ఎక్కువగా పారాసిటమాల్ మాత్రలు తీసుకుని
సాక్షి, జీడిమెట్ల: కడుపునొప్పి భరించలేక పారాసిటమాల్ మాత్రలు పెద్ద మొత్తంలో తీసుకున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా శంకర్‌నగర్‌కు చెందిన చేకూరి రాజు, లక్ష్మి(45) భార్యాభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి షాపూర్‌నగర్ సమీపంలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముంటూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా లక్ష్మి గత రెండేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతోంది. పలు ఆస్పత్రిలో చూపించి నా నొప్పి నయం కాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 25న కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో భరించలేక లక్ష్మి ఇంట్లో ఉన్న పారాసిటమాల్ మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. దీంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతున్న లక్ష్మి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం) -
వికటించిన ఐరన్ మాత్రలు
సాక్షి, జనగామ: జనగామ మండలం చౌడారం మోడల్ పాఠశాల విద్యార్థినులు గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఐరన్ మాత్రలు మింగిన విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మళ్లీ ఐరన్ మాత్రలు తీసుకున్న విద్యార్థినుల్లో సుమారు 20 మందికి పైగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహ నిర్వాహకులు తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. -
కడుపునొప్పితో చావులు.. వింత వ్యాధులు
పాచిపెంట : వింత వ్యాధులతో పలువురు మృతి చెందుతున్నా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని కొదమ పంచాయతీ సిరివర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీదరపు దీరయ్య (63) కడుపునొప్పితో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 18న మృతి చెందాడు. అలాగే సీదరపు లివిరి (53) శనివారం కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే జబిరి ఉన్నట్టుండి కడుపునొప్పితో బాధపడుతుండడంతో 9 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత వ్యాధులు ప్రబలినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలామంది వింత వ్యాధులతో బాధపడుతున్నారని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ఏలూరు(సెంట్రల్) : కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుట్ పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లి రామారావు(40) కృష్ణాజిల్లా ముసునూరు మండలం పెద్దపాటివారి గూడెంలో నివాసం ఉంటున్నాడు. అతను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావుకు తరచూ కడుపునొప్పి వస్తుంటుంది. బుధవారం కడుపునొప్పి ఎక్కువగా రావడంతో ఆ బాధను భరించలేక రామారావు తన ఇంట్లోనే పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ అతను మృతిచెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కడుపునొప్పితో హెచ్ఎం మృతి
గండీడ్ (రంగారెడ్డి జిల్లా) : గండీడ్ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే హెచ్ఎం విజయలక్ష్మి కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. విజయలక్ష్మి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్రం చోటుచేసుకుంది. -
మృగాడి కిరాతకం
► ప్రవర్తన నచ్చక భర్తను వదలివెళ్లిన మొదటి భార్య ► మైనర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న నీచుడు ► ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా రెండో భార్య గొంతునులిమి చంపిన దుర్మార్గుడు ► పరారీలో నిందితుడు, ఆచూకీ కోసం పోలీసుల గాలింపు నూరేళ్ల పంట.. అర్థం చేసుకుంటే ఆనందాలే ఆ ఇంట.. అంటూ వైవాహిక బంధం ఎలా ఉండాలో తెలుపుతూ ‘ పెళ్లి పుస్తకం’ సినిమాలో మనసు కవి ఆత్రేయ రాసిన పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. రెండు మనసులు, ఇద్దరి జీవితాల కలయికను ఆయన స్పష్టంగా చెప్పారు. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమలో జీవితం ముడిపడి ఉందని మానసిక నిపుణులు సైతం సెలవిచ్చారు. అయితే ఇవేవీ ఆ మృగాడిలో మార్పు తీసుకురాలేకపోయాయి. పెళ్లి తరువాత కూడా తాళిని ఎగతాళి చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. దీన్ని భరించలేకపోయిన మొదటి భార్య అతన్ని కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత పదహారేళ్ల అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆ దుర్మార్గుడి ఆలోచన, ప్రవర్తనలో మార్పు రాలేదు. రెండో భార్య కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపాన్ని అపురూపంగా చూసుకోవాల్సిన సమయంలోనే గొంతునులిపి ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడా రాక్షసుడు. - గార్లదిన్నె గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఇప్పేటి వీరాంజనేయులు(32) తన రెండో భార్య రామాంజినమ్మ(17)ను చంపేశాడు. భార్య ఏడు నెలల గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా రాత్రికి రాత్రే గొంతునులిమి హతమార్చాడు. ఆ విధంగా భార్య సహా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఊపిరి తీశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిత్ర హింసలు భరించలేక.. తాడిపత్రి రూరల్ మండలం నరసాపురానికి చెందిన యువతిని వీరాంజనేయులు మొదట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన నచ్చక పెళ్లైన కొత్తలోనే ఆమె భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఒంటరి జీవితం అనుభవించలేకపోయాడు. పువ్వుల్లో పెట్టి సాక్కుంటానంటూ... తల్లీడండ్రి లేని రామాంజినమ్మ బి.యాలేరులోని తన మేనమామ వెంకటేశ్ సంరక్షణలో పెరిగింది. పదహారేళ్లు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ వీరాంజనేయులు పెద్దమనుషులతో రాయబారం నడిపాడు. ప్రవర్తన, అలవాట్లు, అతనిలోని మృగాడ్ని వారు గుర్తించలేకపోయారు. అమాయకంగా కనిపించడంతో వెంకటేశ్ తమ మేనకోడలిని వీరాంజనేయులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకువచ్చారు. పెళ్లై ఏడాది కావస్తోంది. ఒకవైపు ఆమె కమ్మలు సహా పట్టుచీరను తన చెడు అలవాట్ల కోసం వీరాంజనేయులు కుదువపెట్టాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో మేనమామ ఇంటికి వెళ్లి రావాలనుకుంది. కమ్మలు, పట్టుచీర విడిపించుకురావాలని భర్తను కోరింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రంతా భార్యతో గొడవపడ్డాడు. ఆ రాత్రి ఏం జరిగిందో... అర్ధరాత్రి దాటాక వీరాంజనేయులు అదే గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి పరుగున వెళ్లాడు. తన భార్యకు కడుపునొప్పి వచ్చిందని నిద్రలేపాడు. ఆమె గర్భిణి కావడంతో ఏదైనా అనారోగ్యకర సమస్య వచ్చిందేమోనని బంధువులందరూ కలసి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్‌ను సంప్రదించారు. అతని సలహా మేరకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి చూసే సరికే రామాంజినమ్మ ప్రాణంతో లేదు. అప్పటికే భర్త వీరాంజనేయులు మాయమయ్యాడు. ఉదయానికల్లా మృతురాలి బంధువులు యాలేరు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించగా శరీరంపై కొట్టిన గాయాలతో పాటు గొంతునులిమిన ఆనవాళ్లు గుర్తించారు. భర్తే కొట్టిచంపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం సీఐ శివనారాయణస్వామి, తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎస్ఐ రాజు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రామాంజినమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామాంజినమ్మను గొంతునులిపి చంపిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సీఐ విలేకరులకు తెలిపారు. వాడిని ప్రజాతీర్పుకు వదలండి ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతునులిపి భార్య సహా కడుపులోని బిడ్డను చంపిన వీరాంజనేయులును పట్టుకుని ప్రజాతీర్పుకు వదలిపెట్టాలని మృతురాలి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
కడుపునొప్పితో విద్యార్థిని ఆత్మహత్య
హిందూపురం (అనంతపురం) : కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం హిందూపురం పట్ణణంలోని బోయపేటలో చోటుచేసుకుంది. హిందూపురం శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న అఖిల(14) అనే విద్యార్థిని కడుపునొప్పి తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని అమ్మమ్మ ఈరమ్మ తెలిపింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కోస్గి (కర్నూలు) : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం చినముంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కాగా మంగళవారం కడుపునొప్పి ఎక్కువ కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించేలోపే మరణించింది. -
వివాహిత ఆత్మహత్య
నందవరం (కర్నూలు) : కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహరివి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన హరిజన ప్రభావతి(20)కి నాలుగు నెలల కిందట సుందర్రాజు(25)తో వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ప్రభావతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
తిరుమాలాయపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా తిరుమాలాయపాలెం మండలంలో ఓ వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అజ్మీరా తండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీరన్న(35)కు ఈ రోజు ఉదయం వీపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కడుపు నొప్పి భరించలేక నవ వధువు ఆత్మహత్య
శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : కడుపు నొప్పి భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ రూరల్ మండలం గగన్‌పహాడ్‌కు చెందిన శిరీష(19)కు రెండు నెలల క్రితమే వివాహం అయింది. అయితే కొంత కాలంగా శిరీష తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పిని భరించలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లేత కడుపులపై పంజా విసిరిన ‘పులిహోర’
అమీనాబాద్కాలనీలో 80 మంది చిన్నారులకు అస్వస్థత బుధవారం మధ్యాహ్నం స్కూల్లో పులిహోర తిన్న బాలలు అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అవస్థ ఏలేశ్వరం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 15 మంది పిల్లలు రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ : అడిగి చేయించుకుని తిన్న పులిహోరే 80 మంది బాలలను అస్వస్థత పాలు చేసింది. వారు వాంతులు, విరేచనాలతో.. పెనుగాలికి చిగురుటాకుల్లా అల్లాడిపోతుంటే.. బిడ్డలు ఏమవుతారోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చివరికి చిన్నారులందరికీ అపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలల తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం అమీనాబాద్ కాలనీలోని ఎంపీ యూపీ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన 105 మంది పిల్లలు ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. గురువారం నుంచి పాఠశాలకు సెలవులు కావడంతో బుధవారం మధ్నాహ్న భోజనానికి బదులు పులిహోర వండి పెట్టాలని పిల్లలు భోజన పథకం నిర్వాహకులను కోరినట్టు తెలుస్తోంది. కాగా పాఠశాల నుంచి ఇళ్లకు వచ్చాక పిల్లల్లో అనేకులు కడుపునొప్పితో బాధపడ్డారు. రాత్రికి అన్నం కూడా తినలేదు. గురువారం తెల్లవారిన దగ్గర నుంచీ 80 మంది పిల్లలు వాంతులు, విరేచనాలు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో దాదాపు 15 మందిని వారి తల్లిదండ్రులు ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించగా చికిత్సతో కోలుకున్నారు. కాగా విషయం తెలిసిన ఏలేశ్వరం క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు, లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధిత చిన్నారులకు చికిత్స చేశారు. శిబిరంలో అందించిన చికిత్సతో కోలుకోని అఖిల, కోనల అశోక్‌కుమార్, సంజని, కొసిరెడ్డి భవాని, గిడుతూరి విజయలక్ష్మి, లోవబాబు, రమణమ్మ, కర్రి మాధవి, దుర్గాభవాని, లోహిత, గోపిసాయి, సుకన్య, నాగదేవి, అలేఖ్య, మోహనలక్ష్మి, నవ్యశ్రీ, శైలజ, గిడుతూరి వీరబాబు, తంగేటి ఉమామహేశ్వరిలతో సహా 23 మందిని 108 అంబులెన్స్‌లో, ప్రైవేటు వాహనాల్లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందనవసరం లేదని డాక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పారు. చిన్నారులకు గండం గడిచిందని తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. పులిహోర వండడానికి వాడిన బియ్యం ముక్కిపోయాయని, దానికి తోడు సరిగా ఉడకలేదని, అంతేకాక వేరుశనగ గుళ్లు చేదుగా ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. అవే చిన్నారులను అస్వస్థత పాలు చేశాయని భావిస్తున్నారు. తల్లీబిడ్డా ఆస్పత్రి పాలు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అన్నిక పురోహిత్ వెంట వెళ్లి పులిహోర తిన్న అతడి తల్లి సీతారత్నం, చెల్లెలు అఖిల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. వారిద్దరూ జడ్డంగి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం పాఠశాల వైపు వెళ్లిన వారికి కూడా భోజన పథకం నిర్వాహకులు పులిహోర పెట్టగా కొందరు అస్వస్థతకు గురయ్యారు. వారంతా గ్రామంలోని వైద్యశిబిరంలో చేసిన చికిత్సతో కోలుకున్నారు. తహశీల్దార్ కె.పద్మావతి, ఎంఈఓ తాతబ్బాయి దొర, జడ్డంగి, అమీనాబాద్ సర్పంచ్‌లు కొంగర మురళీ కృష్ణ, బచ్చలి సోమాలమ్మ, కాంగ్రెస్ నేతలు మునియ్యదొర, వలి, టీడీపీ నేతలు గణజాల తాతారావు, గంగాధర్ సహాయక చర్యలకు సహకరించారు.