మృగాడి కిరాతకం
► ప్రవర్తన నచ్చక భర్తను వదలివెళ్లిన మొదటి భార్య
► మైనర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న నీచుడు
► ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా రెండో భార్య గొంతునులిమి చంపిన దుర్మార్గుడు
► పరారీలో నిందితుడు, ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
నూరేళ్ల పంట.. అర్థం చేసుకుంటే ఆనందాలే ఆ ఇంట.. అంటూ వైవాహిక బంధం ఎలా ఉండాలో తెలుపుతూ ‘ పెళ్లి పుస్తకం’ సినిమాలో మనసు కవి ఆత్రేయ రాసిన పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. రెండు మనసులు, ఇద్దరి జీవితాల కలయికను ఆయన స్పష్టంగా చెప్పారు. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమలో జీవితం ముడిపడి ఉందని మానసిక నిపుణులు సైతం సెలవిచ్చారు. అయితే ఇవేవీ ఆ మృగాడిలో మార్పు తీసుకురాలేకపోయాయి.
పెళ్లి తరువాత కూడా తాళిని ఎగతాళి చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. దీన్ని భరించలేకపోయిన మొదటి భార్య అతన్ని కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత పదహారేళ్ల అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆ దుర్మార్గుడి ఆలోచన, ప్రవర్తనలో మార్పు రాలేదు. రెండో భార్య కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపాన్ని అపురూపంగా చూసుకోవాల్సిన సమయంలోనే గొంతునులిపి ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడా రాక్షసుడు. - గార్లదిన్నె
గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఇప్పేటి వీరాంజనేయులు(32) తన రెండో భార్య రామాంజినమ్మ(17)ను చంపేశాడు. భార్య ఏడు నెలల గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా రాత్రికి రాత్రే గొంతునులిమి హతమార్చాడు. ఆ విధంగా భార్య సహా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఊపిరి తీశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
చిత్ర హింసలు భరించలేక..
తాడిపత్రి రూరల్ మండలం నరసాపురానికి చెందిన యువతిని వీరాంజనేయులు మొదట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన నచ్చక పెళ్లైన కొత్తలోనే ఆమె భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఒంటరి జీవితం అనుభవించలేకపోయాడు.
పువ్వుల్లో పెట్టి సాక్కుంటానంటూ...
తల్లీడండ్రి లేని రామాంజినమ్మ బి.యాలేరులోని తన మేనమామ వెంకటేశ్ సంరక్షణలో పెరిగింది. పదహారేళ్లు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ వీరాంజనేయులు పెద్దమనుషులతో రాయబారం నడిపాడు. ప్రవర్తన, అలవాట్లు, అతనిలోని మృగాడ్ని వారు గుర్తించలేకపోయారు. అమాయకంగా కనిపించడంతో వెంకటేశ్ తమ మేనకోడలిని వీరాంజనేయులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకువచ్చారు. పెళ్లై ఏడాది కావస్తోంది. ఒకవైపు ఆమె కమ్మలు సహా పట్టుచీరను తన చెడు అలవాట్ల కోసం వీరాంజనేయులు కుదువపెట్టాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో మేనమామ ఇంటికి వెళ్లి రావాలనుకుంది. కమ్మలు, పట్టుచీర విడిపించుకురావాలని భర్తను కోరింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రంతా భార్యతో గొడవపడ్డాడు.
ఆ రాత్రి ఏం జరిగిందో...
అర్ధరాత్రి దాటాక వీరాంజనేయులు అదే గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి పరుగున వెళ్లాడు. తన భార్యకు కడుపునొప్పి వచ్చిందని నిద్రలేపాడు. ఆమె గర్భిణి కావడంతో ఏదైనా అనారోగ్యకర సమస్య వచ్చిందేమోనని బంధువులందరూ కలసి గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్‌ను సంప్రదించారు. అతని సలహా మేరకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి చూసే సరికే రామాంజినమ్మ ప్రాణంతో లేదు. అప్పటికే భర్త వీరాంజనేయులు మాయమయ్యాడు. ఉదయానికల్లా మృతురాలి బంధువులు యాలేరు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించగా శరీరంపై కొట్టిన గాయాలతో పాటు గొంతునులిమిన ఆనవాళ్లు గుర్తించారు. భర్తే కొట్టిచంపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు, రెవెన్యూ అధికారులు
శుక్రవారం ఉదయం సీఐ శివనారాయణస్వామి, తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ రాజు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రామాంజినమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామాంజినమ్మను గొంతునులిపి చంపిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సీఐ విలేకరులకు తెలిపారు.
వాడిని ప్రజాతీర్పుకు వదలండి ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతునులిపి భార్య సహా కడుపులోని బిడ్డను చంపిన వీరాంజనేయులును పట్టుకుని ప్రజాతీర్పుకు వదలిపెట్టాలని మృతురాలి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.