అమీనాబాద్‌కాలనీలో 80 మంది చిన్నారులకు అస్వస్థత
బుధవారం మధ్యాహ్నం స్కూల్లో పులిహోర తిన్న బాలలు
అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అవస్థ
ఏలేశ్వరం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 15 మంది పిల్లలు
రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ :
అడిగి చేయించుకుని తిన్న పులిహోరే 80 మంది బాలలను అస్వస్థత పాలు చేసింది. వారు వాంతులు, విరేచనాలతో.. పెనుగాలికి చిగురుటాకుల్లా అల్లాడిపోతుంటే.. బిడ్డలు ఏమవుతారోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చివరికి చిన్నారులందరికీ అపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలల తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం అమీనాబాద్ కాలనీలోని ఎంపీ యూపీ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన 105 మంది పిల్లలు ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. గురువారం నుంచి పాఠశాలకు సెలవులు కావడంతో బుధవారం మధ్నాహ్న భోజనానికి బదులు పులిహోర వండి పెట్టాలని పిల్లలు భోజన పథకం నిర్వాహకులను కోరినట్టు తెలుస్తోంది. కాగా పాఠశాల నుంచి ఇళ్లకు వచ్చాక పిల్లల్లో అనేకులు కడుపునొప్పితో బాధపడ్డారు.
రాత్రికి అన్నం కూడా తినలేదు. గురువారం తెల్లవారిన దగ్గర నుంచీ 80 మంది పిల్లలు వాంతులు, విరేచనాలు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో దాదాపు 15 మందిని వారి తల్లిదండ్రులు ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించగా చికిత్సతో కోలుకున్నారు. కాగా విషయం తెలిసిన ఏలేశ్వరం క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు, లాగరాయి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధిత చిన్నారులకు చికిత్స చేశారు. శిబిరంలో అందించిన చికిత్సతో కోలుకోని అఖిల, కోనల అశోక్‌కుమార్, సంజని, కొసిరెడ్డి భవాని, గిడుతూరి విజయలక్ష్మి, లోవబాబు, రమణమ్మ, కర్రి మాధవి, దుర్గాభవాని, లోహిత, గోపిసాయి, సుకన్య, నాగదేవి, అలేఖ్య, మోహనలక్ష్మి, నవ్యశ్రీ, శైలజ, గిడుతూరి వీరబాబు, తంగేటి ఉమామహేశ్వరిలతో సహా 23 మందిని 108 అంబులెన్స్‌లో, ప్రైవేటు వాహనాల్లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందనవసరం లేదని డాక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పారు. చిన్నారులకు గండం గడిచిందని తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. పులిహోర వండడానికి వాడిన బియ్యం ముక్కిపోయాయని, దానికి తోడు సరిగా ఉడకలేదని, అంతేకాక వేరుశనగ గుళ్లు చేదుగా ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. అవే చిన్నారులను అస్వస్థత పాలు చేశాయని భావిస్తున్నారు.
తల్లీబిడ్డా ఆస్పత్రి పాలు
పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అన్నిక పురోహిత్ వెంట వెళ్లి పులిహోర తిన్న అతడి తల్లి సీతారత్నం, చెల్లెలు అఖిల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. వారిద్దరూ జడ్డంగి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం పాఠశాల వైపు వెళ్లిన వారికి కూడా భోజన పథకం నిర్వాహకులు పులిహోర పెట్టగా కొందరు అస్వస్థతకు గురయ్యారు. వారంతా గ్రామంలోని వైద్యశిబిరంలో చేసిన చికిత్సతో కోలుకున్నారు. తహశీల్దార్ కె.పద్మావతి, ఎంఈఓ తాతబ్బాయి దొర, జడ్డంగి, అమీనాబాద్ సర్పంచ్‌లు కొంగర మురళీ కృష్ణ, బచ్చలి సోమాలమ్మ, కాంగ్రెస్ నేతలు మునియ్యదొర, వలి, టీడీపీ నేతలు గణజాల తాతారావు, గంగాధర్ సహాయక చర్యలకు సహకరించారు.
లేత కడుపులపై పంజా విసిరిన ‘పులిహోర’
Published Fri, Jan 10 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement