పాచిపెంట : వింత వ్యాధులతో పలువురు మృతి చెందుతున్నా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని కొదమ పంచాయతీ సిరివర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీదరపు దీరయ్య (63) కడుపునొప్పితో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 18న మృతి చెందాడు. అలాగే సీదరపు లివిరి (53) శనివారం కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదిలా ఉంటే జబిరి ఉన్నట్టుండి కడుపునొప్పితో బాధపడుతుండడంతో 9 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత వ్యాధులు ప్రబలినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలామంది వింత వ్యాధులతో బాధపడుతున్నారని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment