pachipenta
-
ఎస్ఐపై యువకుల దాడి
సాక్షి, విజయనగరం: తమను అడ్డుకున్న ఎస్ఐతో గొడవకు దిగారు ఇద్దరు యువకులు. జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట బైక్‌ని అతివేగంగా నడపడమే కాకుండా.. వారించిన ఎస్ఐపై దాడి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్ఐ రమణపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వారిని వారించినందుకు ఆయనపై యువకులు దాడికి దిగినట్లు తెలిపారు. -
నకిలీల ఆటకట్టు..
సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. జరిగిన సంఘటనలు.. ►ఈ ఏడాది జూన్ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం.. నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్చల్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. – సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు -
మానవత్వం పరిమళించిన వేళ
సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్ఎం సంగీతకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్‌కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్ఎం విన్నవించింది. మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వద్ద ఏఎన్ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్ఎం స్థానిక సీహెచ్‌సీ స్టాఫ్ నర్స్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కడుపునొప్పితో చావులు.. వింత వ్యాధులు
పాచిపెంట : వింత వ్యాధులతో పలువురు మృతి చెందుతున్నా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని కొదమ పంచాయతీ సిరివర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీదరపు దీరయ్య (63) కడుపునొప్పితో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 18న మృతి చెందాడు. అలాగే సీదరపు లివిరి (53) శనివారం కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే జబిరి ఉన్నట్టుండి కడుపునొప్పితో బాధపడుతుండడంతో 9 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత వ్యాధులు ప్రబలినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలామంది వింత వ్యాధులతో బాధపడుతున్నారని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
290 మద్యం సీసాలు స్వాధీనం
పాచిపెంట : మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు. వినాయక నిమజ్జనంలో భాగంగా మెయిన్‌రోడ్డులో వెళ్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 290 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఎక్సైజ్ శాఖకు తరలిస్తామన్నారు.