ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రశ్నించడం ఆపేది లేదు
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అసెంబ్లీ వేదికగా గ్యారంటీలు, హామీల అమలుపై నిలదీస్తాం
కేసీఆర్‌ను దూషించడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు
సమాధానం చెప్పే సత్తా లేకనే రేవంత్ దూషణలు
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అస్తిత్వం మీద దాడి
అసెంబ్లీకి ఎప్పుడు రావాలో మా అధినేత కేసీఆర్‌కు తెలుసు
ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్టుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఇది. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరతమాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా?
ఇప్పుడు బతుకమ్మ మాయం.. రేపు తెలంగాణ మాయం చేస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ద్రోహులు చేస్తున్న దాడి. ఈ సీఎం తెలంగాణ ఉద్యమంలో లేరు.. ఎన్నడూ జైతెలంగాణ అనలేదు. సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకుల పార్టీలో పనిచేసి.. కేసీఆర్ పట్ల వ్యతిరేకత, ద్వేషం పెంచుకున్నారు. కేసీఆర్ చేసిన ప్రతి పనికి ఉల్టా చేయడం రేవంత్ పని. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పుల అభిప్రాయాలు తీసుకుని ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి రూపకల్పన జరిగింది.
2009లో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు పెట్టారు. కానీ ఈ మూర్ఖుడు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్లుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడిపై ప్రజలు నిరసన తెలపాలి. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరత మాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల ముసుగులో ఇచ్చిన 13 ప్రధాన గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వ తీరును నిలదీస్తామన్నారు. దళితబంధు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, ఆసరా పింఛన్ల పెంపు తదితర హామీల అమలు కోసం పట్టుబడతామని.. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రశ్నించడం ఆపేదే లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘24 ఏళ్ల ప్రస్థానంలో గత ఏడాది బీఆర్‌ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఉద్యమ సమయంలో గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్ర సాధన కోసం పనిచేశాం. తెలంగాణ సిద్ధించాక పదేళ్లు అధికారంలో కొనసాగినా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, కవిత అరెస్టు, కేసీఆర్ కాలికి గాయం వంటి అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి, నాయకులు, కార్యకర్తల పోరాట పటిమతో బీఆర్‌ఎస్ తిరిగి నిటారుగా నిలబడింది. తిరిగి అధికారంలోకి వచ్చి మరో 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతుందనే ఆత్మస్థైర్యం వచ్చింది. మాకు పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ కాదు.
సమాధానం చెప్పలేకే రేవంత్ దూషణలు
రేవంత్‌రెడ్డికి అనుకోకుండా అవకాశం వచ్చి సీఎం అయ్యారు. ఆయన పట్ల మాకు ఎలాంటి జెలసీ లేదు. ఆయనను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరితే దూషణలకు దిగుతున్నారు. మమ్మల్ని దూషించినా వయసులో చిన్న వాళ్లం సహిస్తాం. కానీ కేసీఆర్‌ను దూషించడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. తెలంగాణ సాధించిన మహానాయకుడిని స్థాయికి తగని వ్యక్తి విమర్శించడం సరికాదు.
రేవంత్ వైఖరి మారకపోతే మాపై కేసులు పెట్టినా సరే... ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన భాషలోనే స్పందిస్తాం. ఇటుకతో కొడితే రాయితో బదులిస్తాం. రేవంత్ చేస్తున్న పనికి మేం ఎక్కడా అడ్డుపడటం లేదు. బలవంతపు భూసేకరణ, దళితబంధు ఆపేయడం, మూసీ పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ప్లాన్‌చేయడంపై మేం ప్రశి్నస్తుంటే.. రేవంత్‌కు జీర్ణం కావడం లేదు. సమాధానం చెప్పే సత్తా లేక దూషణలకు దిగుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న సీఎం... మొదట తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి లగచర్లకు, తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లాలి.
కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు..
ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో రేవంత్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎనీ్టఆర్, జయలలిత శపథం చేసి అసెంబ్లీకి రాలేదు. కానీ కేసీఆర్ అలా కాదు. రేవంత్ కోరుకున్నప్పుడు కాదు.. ప్రజలు కోరుకున్నపుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు. ప్రజలు కేసీఆర్ ఎక్కడని అడగటం లేదు. హామీల అమలు, ఆరు గ్యారంటీల గురించి ప్రశి్నస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం..
ఉద్యమాల నుంచి వచ్చిన మాకు కేసులు, నిర్బంధాలు, అరెస్టులు కొత్త కాదు. వందల కేసులు పెట్టినా వెనక్కి తగ్గం. ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా కార్యకర్తలను జైలుకు పంపుతోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని బలోపేతం చేసుకుంటాం. పోరాటాలకు కేడర్‌ను సిద్ధం చేస్తాం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. కేసీఆర్ పర్యవేక్షణలో సమర్థవంతమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం.
కేసీఆర్, పార్టీ నిర్ణయం మేరకు పాదయాత్ర
నేను కచ్చితంగా పాదయాత్ర చేస్తా.. కానీ తొందరపడకుండా ప్రజల అవసరాన్ని బట్టి షెడ్యూల్ నిర్ణయిస్తాం. ఎప్పుడు పాదయాత్ర చేయాలో మా అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయిస్తుంది.
రేవంత్‌కు రక్షణ కవచంలా బీజేపీ ఎంపీలు
బీజేపీ ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా వారు రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచారు. మా ఓటమికి కారకులై కాంగ్రెస్ గెలుపునకు ఉపయోగపడ్డారు. బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, అరి్వంద్, బండి సంజయ్ వంటివారు రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు. అదానీ విషయంలో రేవంత్ వైఖరిపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుముల రేవంత్‌రెడ్డి బ్రదర్స్ అదానీలను మించి పోతున్నా కేంద్రం ఎలాంటి దర్యాప్తులు చేయడం లేదు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment