
‘సాక్షి’తో సొరంగం నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ఎండీ పంకజ్ గౌర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిపడటంతో మట్టి, శిథిలాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోర్ మెషీన్ (టీబీఎం) పరిస్థితి ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. ప్రమాదంలో టీబీఎంకు బాగా నష్టం జరిగితే పనికిరాకుండా పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెస్క్యూ శ్రీ ఆపరేషన్ తర్వాత తిరిగి టన్నెల్ తవ్వకం పనులు కొనసాగాలంటే టీబీఎం యంత్రం పనిచేయాల్సిందే.
దీనిపై జేపీ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్‌ను ‘సాక్షి’ప్రశ్నించగా.. టీబీఎం పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. మట్టి, శిథిలాలు తొలగించి పరీక్షించిన తర్వాతే మెషీన్ పనికి వస్తుందా? లేదా? అన్నది గుర్తించగలమని చెప్పారు. అందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేమన్నారు. ప్రస్తుతానికి సొరంగంలో చిక్కుకున్నవారిని బయటికి తేవడమే తమ ధ్యేయమని తెలిపారు. సమస్యలన్నీ అధిగమించి సొరంగం నిర్మాణ పనులను పునరుద్ధరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.