కడావర్‌ డాగ్స్‌తో మరోసారి గాలింపు | Rescue operations ongoing in SLBC tunnel | Sakshi
Sakshi News home page

కడావర్‌ డాగ్స్‌తో మరోసారి గాలింపు

Published Fri, Mar 28 2025 4:17 AM | Last Updated on Fri, Mar 28 2025 4:17 AM

Rescue operations ongoing in SLBC tunnel

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి జాడ తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం మరోసారి కడావర్‌ డాగ్స్‌ను తీసుకెళ్లి ప్రమాదస్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో సొరంగం ఎండ్‌ ఫేస్‌ చివరలో ఈ డాగ్స్‌తో గాలించారు. ఇప్పుడు వెనుకవైపు 160 మీటర్ల దూరంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాల వాసనలను గుర్తించేందుకు మరోసారి డాగ్స్‌ను టన్నెల్‌లోనికి తీసుకెళ్లారు. 

మొత్తం 13.940 కి.మీ వరకు తవ్విన సొరంగంలో 13.500 వరకు లోకోట్రైన్‌ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి 250 మీటర్ల వరకూ పేరుకుపోయిన మట్టి, శిథిలాల్లో సుమారు 60 మీటర్ల మేరకు మట్టిని తొలగించగలిగారు. ఇందుకోసం నాలుగు ఎస్కవేటర్లు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అధికారి శివశంకర్‌ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక బృందాల నిపుణులతో కలసి సమీక్షిస్తున్నారు.  

భారీగా కొనసాగుతున్న నీటి ఊట.. 
సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంతో నిమిషానికి 3,900 లీటర్ల నీరు ఊరుతోంది. భారీ ఎత్తున వస్తున్న నీటిని సొరంగం నుంచి బయటకు తరలించేందుకు ప్రతీ 2.5 కి.మీ. పాయింట్‌లో ఒకటి చొప్పు న 150 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లను వినియోగిస్తున్నారు. అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను గ్యాస్‌కట్టర్లతో కట్‌ చేస్తూ లోకోట్రైన్‌ ద్వారా బయటకు తరలిస్తున్నారు.  

స్వగ్రామానికి చేరిన మనోజ్‌కుమార్‌ మృతదేహం  
జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ మనోజ్‌కుమార్‌(50) మృతదేహం ప్రత్యేక అంబులెన్స్‌లో గురువారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నవ్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన బంగార్మావ్‌ చేరుకుంది. మనోజ్‌కుమార్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అధికారులు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement