వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక...
వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక అతడిని విద్యార్థులకు దగ్గరచేస్తే.. ఆంగ్లభాషపై ఉన్న మక్కువ జాతీయ, అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఇంగ్లిష్ అంటేనే ఉలిక్కిపడుతున్న విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు చేసిన ప్రయోగం అతడికి మరింత ఖ్యాతినార్జించి పెట్టింది. అంతేనా.. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పరిశోధకుడిగానూ రాణిస్తున్న ఆ మాస్టారి పేరు శంకరభక్తుల సత్యం. ప్రయోగాత్మక విద్యతో పలువురి మన్ననలు అందుకున్న ఆయన పలు జాతీయ,అంతర్జాతీయ మాసపత్రికలకు సైతం వ్యాసాలు రాశారు. ఆయన ప్రతిభకు గుర్తుగా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు.
- కేసముద్రం
ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
మారుమూల విద్యార్థులకు ఆంగ్లాన్ని సులభంగా బోధించేందుకు అక్కడి ఉపాధ్యాయులు వ్యాకరణాంశాలతో కూడుకున్న ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంగ్లిష్‌పై విద్యార్థులకు మక్కువ ఉన్నప్పటికీ వారికి తగురీతిలో బోధించేవారు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి వ్యాకరణాంశాలతో మిళితమైన ప్రత్యేక మెటీరియల్‌ను తయారుచేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. ఉత్సాహవంతులైన ఆంగ్ల ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలు కల్పించాలి.
- శంకరభక్తుల సత్యం
నెక్కొండ మండలం చంద్రుగొండకు చెం దిన సత్యం 1996లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. తర్వాత కురవి మండలంలోని లక్ష్మీతం డా ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్లు పనిచేసి ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత మరిపెడ మండలం చిన్నగూడూరులో మూడేళ్లపాటు విధులు నిర్వర్తించా రు. 2005లో కేసముద్రం మండలం పెనుగొండ జెడ్పీస్‌ఎస్‌కు బదిలీపై వచ్చిన సత్యం మాస్టారు అప్పటి నుంచి ఇక్కడే విద్యాబోధన చేస్తున్నారు. 2006లో మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తిచేసిన ఆయన ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
ప్రయోగాత్మక విద్యకు శ్రీకారం
ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్యం మాస్టారు.. ఆంగ్లభాషపై విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా బోధించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తరగతి గదినే ల్యాబ్‌గా మార్చేశారు. సహచర ఉపాధ్యాయుల సహకారంతో ఆంగ్ల వ్యారణాంశాలను తరగతి గది గోడలపై రాయించారు.
భాషా నైపుణ్యాలు, పదకోశం, వ్యాకరణ నిర్మాణాలు, క్రియా రూపాలు, భాషాభాగాలు, ఉచ్చరణ, సర్వనామాలు, విభక్తులు, వ్యతిరేక పదాలు, కర్త, కర్మ వాక్యాలతోపాటు మరికొన్ని వ్యాకరణాంశాలను గదిగోడలపై అందంగా రాయించారు. వీటి సాయంతో 150 క్రియా రూపాలను, 12 రకాల వ్యాక్య నిర్మాణాలను, సూత్రాలను విద్యార్థులు ఎంతో సులభంగా చెప్పగలుగుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ఇష్టం ఏర్పడింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నతాధికారులు సత్యం మాస్టారిని అభినందనల్లో ముంచెత్తారు.
సమర్పించిన వ్యాసాలు
2014 ఏప్రిల్‌లో తిరుపతి చాప్టర్ వారు నిర్వహించిన జాతీయ సదస్సులో ‘లాంగ్వేజ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ ఫంక్షనింగ్’ అనే వ్యాసాన్ని సమర్పించారు.
2013 జూలైలో యూనివర్సిటీ ఆఫ్ ఆల్, యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ద ఇంపాక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఆఫ్ ఇన్‌స్కూల్ ఎడ్యుకేషన్’ అనే పరిశోధనా వ్యాసం సమర్పణ.
2013 జనవరిలో ఏడీ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుజరాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయసదస్సులో ‘లాంగ్వేజ్ లెర్నింగ్ త్రూ ల్యాబ్స్’ అంశంపై వ్యాసం సమర్పణ.
2013 ఫిబ్రవరిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, భోపాల్ ఆధ్వర్యంలో ఆంగ్ల సాహిత్యంపై రెండురోజులపాటు నిర్వహించిన సదస్సులో ‘డ్రామా అండ్ లాంగ్వేజ్ యాజ్ ఆక్టివ్ ఫామ్స్ ఆఫ్ లిటరేచర్’ వ్యాసాన్ని సమర్పించారు.
2012 అక్టోబర్‌లో జైన్ విశ్వభారతి ఇన్‌స్టిట్యూట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లిష్ ఇన్ గ్లోబలైజ్‌డ్ వరల్డ్’ వ్యాసాన్ని సమర్పించారు. సత్యం మాస్టారు సమర్పించిన వ్యాసాల్లో ఇవి కొన్ని మాత్రమే.
అవార్డులు.. ప్రశంసలు
విద్యారంగానికి చేస్తున్న సేవకుగాను 2013 అక్టోబరులో హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అప్పటి మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా రాజీవ్త్న్ర అవార్డు అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా 2011 సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయిలో సత్యం రాసిన ఈఎల్‌టీఇన్ ఇండియా అనే పరిశోధనా వ్యాసం ప్రథమస్థానంలో నిలవడంతో డాక్టర్ జేకే రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నయ్ వారు రూ.25వేల నగదును, ప్రశంసాపత్రాన్ని అందించారు.
వ్యాసాలతో కీర్తి..
ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పలు జాతీయ, అంతర్జాతీయ మాస పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు సత్యం మాస్టారు. మహారాష్ట్రకు చెందిన న్యూమాన్ పబ్లికేషన్స్, చెన్నైకు చెందిన ద ఇంగ్లిష్ రీసెర్స్ ఎక్స్‌ప్రెస్, ద ఇంగ్లిష్ ఇండియా మాస పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. సంపాదకుడిగానూ పనిచేశారు. న్యూ ఢిల్లీలోని యూనివర్సిటీ మాసపత్రికలో, ఎడ్యుట్రాక్స్ పత్రికలో, చెన్నైలోని ఎల్టాయ్ మాస పత్రికలో, ఎక్స్‌పర్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ మాసపత్రిక తదితర వాటిలో సభ్యత్వాన్ని పొందారు. అంతేకాక 2002 నుంచి 2006 వరకు పదో తరగతి మోడల్ పేపర్ల తయారీలోనూ సేవలందించారు. జిల్లా విద్యాశాఖ ఇటీవల మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ఆంగ్లం కార్యక్రమంలో దుగ్గొండి మండలానికి రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు.