వేధింపుల గురువుపై సస్పెన్షన్ వేటు
వేధింపుల గురువుపై సస్పెన్షన్ వేటు
Published Sat, Jan 21 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
పటవల హైస్కూలు ఇంగ్లీష్ టీచర్ అకృత్యాలు
గతంలో ఫిర్యాదు చేసినా విద్యాశాఖ నిర్లక్ష్యం
విద్యార్థినుల ఆందోళనతో చివరికి చర్య
తాళ్లరేవు (ముమ్మిడివరం) : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుస్థానంలో ఉన్నవాడే ఉచ్ఛనీచాలు విస్మరించి, విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చివరికి బాధిత బాలికలు ఆందోళన బాట పట్టడంతో విద్యాశాఖ అతడిని సస్పెండ్ చేసింది. వివరాలిలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం పటవల హైస్కూల్ ఇంగ్లీషు ఉపాధ్యాయుడు ఎ.హఫీజ్ ఇమ్రాన్ గత కొన్నేళ్లుగా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో రెండు సార్లు విద్యార్థినులు, తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కీచక ఉపాధ్యాయుడిని తొలగించాలని విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు.. స్థానిక నాయకులు చెక్కపల్లి లక్ష్మణ్, కాలా వెంకటరమణ, టి.ఈశ్వరరావుల ఆధ్వర్యంలో శనివారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. విషయాన్ని డీఈఓ ఆర్.నరసింహారావు, డీవైఈఓ గంగాభవాని, ఎంఈఓ మందాల వీరభద్రరావులకు తెలిపారు. దీంతో ఎంఈఓ వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు. అనంతరం బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. ఇమ్రాన్ తమను లైంగికంగా వేధించేవాడని, సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించేవాడని, ఈ విషయాలను బయటపెట్టవద్దని భయపెట్టేవాడని బాధితులు చెప్పారు. ఇటీవల అతని అకృత్యాలు ఎక్కువవడంతో కొత్తగా వచ్చిన హెచ్‌ఎం సుబ్బలక్ష్మికి ఫిర్యాదు చేసామని, ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తమ ఇళ్లకు వచ్చి తమ తల్లిదండ్రులను సైతం బెదిరించి తన తప్పేమీలేదని సంతకాలు చేయించుకున్నాడని చెప్పారు. బాధితులు చెప్పిన వివరాల్ని ఎంఈఓ డీవైఈఓ దృష్టికి తీసుకువెళ్లగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విద్యార్థులు డీవైఈఓ వచ్చి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని చెప్పడంతో ఆమె వచ్చి సస్పెన్షన్ ఆర్డర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులకు అందజేశారు. ఇలా ఉండగా విద్యార్థినులు ఆందోళన బాట పట్టనున్న విషయం ముందే తెలుసుకున్న ఇమ్రాన్ శుక్రవారం మధాహ్నం నుంచి గైర్హాజరైనట్లు చెపుతున్నారు.
Advertisement
Advertisement