atlast
-
వేధింపుల గురువుపై సస్పెన్షన్ వేటు
పటవల హైస్కూలు ఇంగ్లీష్ టీచర్ అకృత్యాలు గతంలో ఫిర్యాదు చేసినా విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థినుల ఆందోళనతో చివరికి చర్య తాళ్లరేవు (ముమ్మిడివరం) : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుస్థానంలో ఉన్నవాడే ఉచ్ఛనీచాలు విస్మరించి, విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చివరికి బాధిత బాలికలు ఆందోళన బాట పట్టడంతో విద్యాశాఖ అతడిని సస్పెండ్ చేసింది. వివరాలిలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం పటవల హైస్కూల్ ఇంగ్లీషు ఉపాధ్యాయుడు ఎ.హఫీజ్ ఇమ్రాన్ గత కొన్నేళ్లుగా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో రెండు సార్లు విద్యార్థినులు, తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కీచక ఉపాధ్యాయుడిని తొలగించాలని విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు.. స్థానిక నాయకులు చెక్కపల్లి లక్ష్మణ్, కాలా వెంకటరమణ, టి.ఈశ్వరరావుల ఆధ్వర్యంలో శనివారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. విషయాన్ని డీఈఓ ఆర్.నరసింహారావు, డీవైఈఓ గంగాభవాని, ఎంఈఓ మందాల వీరభద్రరావులకు తెలిపారు. దీంతో ఎంఈఓ వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు. అనంతరం బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. ఇమ్రాన్ తమను లైంగికంగా వేధించేవాడని, సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించేవాడని, ఈ విషయాలను బయటపెట్టవద్దని భయపెట్టేవాడని బాధితులు చెప్పారు. ఇటీవల అతని అకృత్యాలు ఎక్కువవడంతో కొత్తగా వచ్చిన హెచ్ఎం సుబ్బలక్ష్మికి ఫిర్యాదు చేసామని, ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తమ ఇళ్లకు వచ్చి తమ తల్లిదండ్రులను సైతం బెదిరించి తన తప్పేమీలేదని సంతకాలు చేయించుకున్నాడని చెప్పారు. బాధితులు చెప్పిన వివరాల్ని ఎంఈఓ డీవైఈఓ దృష్టికి తీసుకువెళ్లగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విద్యార్థులు డీవైఈఓ వచ్చి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని చెప్పడంతో ఆమె వచ్చి సస్పెన్షన్ ఆర్డర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులకు అందజేశారు. ఇలా ఉండగా విద్యార్థినులు ఆందోళన బాట పట్టనున్న విషయం ముందే తెలుసుకున్న ఇమ్రాన్ శుక్రవారం మధాహ్నం నుంచి గైర్హాజరైనట్లు చెపుతున్నారు. -
ఎట్టకేలకు తెరచుకోనున్న రైల్వే గేట్
–మొదలైన పునరుద్ధరణ పనులు –మిఠాయిల పంపిణీ ఆలేరు : ఎట్టకేలకు ఆలేరు రైల్వే గేట్ తెరుచుకోనుంది. గత నెల 9న రైల్వే గేట్ మూసివేశారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పలుమార్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రైల్వే జీఎం, రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఆర్యూబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతించింది. వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ, రైల్వేశాఖ వారు సంయుక్తంగా రూ. 5.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించారు. ఆÆŠయూబీ నిర్మాణానికి 9 నెలల సమయం పడుతుందని నిర్ణయించారు. ఆర్యూబీ నిర్మాణంతో పాటు రైల్వేగేట్‌ను తెరవాలని నిర్ణయించారు. అయితే ఆర్యూబీ నిర్మాణం పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెయింటెన్స్ ఖర్చులు సుమారు రూ. 33 లక్షలు ఖర్చు అవుతాయని, డిపాజిట్ చేయాలని రైల్వేశాఖ కోరింది. దీంతో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన సొంత డబ్బులు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు పలు మార్లు రైల్వే జీఎంలను కలిశారు. మొత్తం మీద రైల్వేగేట్‌ను తెరిచేందుకు పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రైల్వేగేట్‌ను తెరచి యధావిధిగా కొనసాగించనున్నారు. మిఠాయిల పంపిణీ ఆలేరులో రైల్వేగేట్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడంతో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గేట్ వద్దకు చేరుకుని పనులు చేపడుతున్న రైల్వేసిబ్బందికి మిఠాయిలు తినిపించారు. గేట్‌ను తెరిపించేందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, ఎండి సలీం, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కామిటికారి కృష్ణ, దడిగె ఇస్తారి, ఎగ్గిడి శ్రీశైలం, వడ్డెమాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.